ఎక్స్ క్లూజివ్.. పవన్ కొత్త సినిమా బిజినెస్ క్లోజ్

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాకు సంబంధించి ఇంకా శాటిలైట్ డీల్ క్లోజ్ అవ్వలేదు. అతడు హీరోగా నటిస్తున్న మరో సినిమా హరిహర వీరమల్లు సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా ఇంకా అమ్ముడుపోలేదు. కానీ పవన్ కల్యాణ్ ఇంకా సెట్స్ పైకి తీసుకురాని ఓ సినిమా మాత్రం బిజినెస్ క్లోజ్ చేసింది. అదే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమా.

అవును.. పవన్ కల్యాణ్, సురేందర్ రెడ్డి సినిమాను జీ గ్రూప్ దక్కించుకుంది. తాజా ఒప్పందం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో పాటు మరికొన్ని నాన్-థియేట్రికల్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుకు సహ-నిర్మాతగా కూడా వ్యవహరించబోతోంది ఈ సంస్థ.

ఈమధ్య కాలంలో చాలా పెద్ద సినిమాల నిర్మాణ వ్యవహారాల్లో కూడా పాలుపంచుకుంటోంది జీ గ్రూప్. బంగార్రాజు సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ ఫండింగ్ సమకూర్చి పెట్టింది. అంతకంటే ముందు రిపబ్లిక్ లాంటి సినిమాలకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. 

తాజాగా రామ్ చరణ్-శంకర్ సినిమాలో కూడా వాటా దక్కించుకుంది. దిల్ రాజుతో కలిసి ఆ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్, సురేందర్ రెడ్డి మూవీ రైట్స్ ను కూడా హోల్ సేల్ గా దక్కించుకుంది ఈ సంస్థ.

ఎస్ఆర్జీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించాడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.