ఇంకా మీరెందుకు... రాజీనామా చేయండి!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌పై వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాల‌న‌తో ప్ర‌జ‌లకు అవ‌స్థ‌లే త‌ప్ప‌, ఒక్క ప్ర‌యోజ‌నం కూడా లేద‌ని ఆమె మండిప‌డుతున్నారు. 

చిన్న అవ‌కాశం దొరికినా కేసీఆర్ పాల‌న‌లోని లోపాల‌ను ఎత్తి చూప‌డానికి కాచుకుని ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి కేసీఆర్ పాల‌న‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌ను సంధించారు.

త‌న తండ్రి వైఎస్సార్ పాల‌న సాగించిన రోజుల‌ను గుర్తుకు తెస్తూ... కేసీఆర్‌ను దెప్పి పొడిచారు. తాజాగా తెలంగాణ‌లో క‌రెంట్‌, ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను భారీగా పెంచ‌నున్న నేప‌థ్యంలో ష‌ర్మిల ఘాటుగా స్పందించారు. 

వైఎస్సార్ పాలనలో కరెంట్, బస్ ఛార్జీలు పెంచింది లేదని షర్మిల అన్నారు. కేసీఆర్‌కు పరిపాలన చేతకాక విద్యుత్ సంస్థలను, ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.

విద్యుత్‌, ఆర్టీసీ సంస్థ‌ల్లో న‌ష్టాల‌ను పూడ్చుకునేందుకు సామాన్యుడిపై పన్నుల భారం మోపుతున్నారని వైఎస్ ష‌ర్మిల విరుచుకు ప‌డ్డారు. ప్రజల నడ్డి విరచేందుకు తెలంగాణ‌ సర్కార్ సిద్ధ‌మైంద‌ని తెలిపారు. 

అప్పులు, పన్నులు పెరిగిపోతుంటే ఇంకా మీరెందుకు సారు.. రాజీనామా చేయండంటూ షర్మిల ఘాటు వ్యాఖ్య‌ల‌తో నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.