డిసెంబర్ బాక్సాఫీస్.. ఈనెల ఎట్రాక్షన్స్ ఇవే!

నవంబర్ లో రిలీజైన సినిమాలతో బుక్కయిన బాక్సాఫీస్.. తన ఆశలన్నీ డిసెంబర్ నెలపైనే పెట్టుకుంది. నిజానికి అసలైన సినిమాలన్నీ డిసెంబర్ నుంచే షెడ్యూల్ అయి ఉండడంతో, ఆడియన్స్ దృష్టి కూడా ఈ నెలపైన పడింది. మరి డిసెంబర్ లో భారీ అంచనాలతో రాబోతున్న ఆ సినిమాలేంటి?

బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో డిసెంబర్ బాక్సాఫీస్ ఓపెన్ కానుంది. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే, ఇది బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి సింహా, లెజెండ్ రూపంలో 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందా అవ్వదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

డిసెంబర్ నెలలో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న మరో మూవీ లక్ష్య. డిసెంబర్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నాగశౌర్య నటించిన మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామా ఇది. శౌర్య సిక్స్ ప్యాక్ లుక్ తో పాటు టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. శౌర్య ట్రాక్ రికార్డ్ ఈమధ్య కాలంలో ఏమంత ఆశాజనకంగా లేదు. అతడి కెరీర్ ను లక్ష్య మూవీ గాడిలో పెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక డిసెంబర్ లో వస్తున్న భారీ మూవీ పుష్ప. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం లాంటి మరో ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా ఇది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.17న పుష్ప పార్ట్-1 రిలీజ్ కు రెడీ చేశారు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ఆశిస్తున్నాడు బన్నీ. ప్రమోషన్ ఇప్పటికే పీక్ స్టేజ్ కు చేరుకుంది.

డిసెంబర్ లో వస్తున్న మరో బడా మూవీ శ్యామ్ సింగరాయ్. నాని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమా ఇది. రాహుల్ సంకృత్యాన్ డైరక్ట్ చేసిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా 24న థియేటర్లలోకి వస్తోంది. ఇందులో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు నాని. సాయిపల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.

అఖండ, శ్యామ్ సింగరాయ్, పుష్ప సినిమాలతో పాటు గుడ్ లక్ సఖి, స్కైలాబ్, గమనం లాంటి మరికొన్ని సినిమాలు కూడా డిసెంబర్ లో వస్తున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గని మూవీ కూడా డిసెంబర్ లో రావాల్సి ఉంది. కానీ మరోసారి వాయిదాపడింది. సో.. డిసెంబర్ బాక్సాఫీస్ బరిలో ఏ సినిమా మెరుస్తుందో చూడాలి.