ఎమ్బీయస్‍: సత్యజిత్ రాయ్ 'నాయక్'

సత్యజిత్ రాయ్ శతజయంతి సందర్భంగా ఆయన తీసిన మూడు సినిమాలను పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నాను. ‘‘చారులత’’ పరిచయం చేశాను. ఇప్పుడు చేస్తున్నది ‘‘నాయక్’’ (1966). ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏమిటంటే పారలల్ లేదా ఆర్ట్ సినిమాకు ప్రాతినిథ్యం వహించిన సత్యజిత్, కమ్మర్షియల్ సినిమాకు ప్రాతినిథ్యం వహించిన బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్ తొలిసారి కలిసి పనిచేశారు. ఇది బాగా ఆడడంతో, దీని తర్వాతి సంవత్సరమే ‘‘చిడియాఖానా’’ అనే సినిమాకై యిద్దరూ మళ్లీ కలిశారు. దానిలో ఉత్తమ్ వ్యోమ్‌కేశ్ (బొంకేశ్) బక్షీ అనే డిటెక్టివ్ పాత్ర వేశాడు. ఆ సినిమా పేరు తీసుకురాక పోవడంతో మళ్లీ యిద్దరూ కలిసి పని చేయలేదు. సాధారణంగా సత్యజిత్ సినిమాలన్నిటిలో హీరోగా సౌమిత్ర చటర్జీ వేశాడు. కానీ యీ సినిమా థీమ్ ఒక సూపర్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. సౌమిత్రకు యాక్టర్‌గా పేరు బాగా వుంది కానీ ఉత్తమ్‌కు యాక్టర్‌గానే కాక స్టార్‌గా కూడా పేరుండడంతో సత్యజిత్ అతన్ని ఎంచుకున్నాడు.

ఈ సినిమాలో ఒక బెంగాలీ సూపర్ హీరో జాతీయ ఎవార్డు తీసుకోవడానికి కలకత్తా నుంచి దిల్లీకి ట్రెయిన్‌లో వెళతాడు. సినిమానటుల జీవితం పైకి ఎంత డాబుగా కనబడినప్పటికీ, లోపల వాళ్లు ఎంతటి అభద్రతాభావంతో, అసంతృప్తితో గడుపుతారో పొరలు విప్పి చూపిస్తుందీ సినిమా. ఉత్తమ్ అసలు పేరు అరుణ్ కుమార్ చటర్జీ. ఆ పేరు స్ఫురించేట్లా ఈ సినిమా కథానాయకుడికి అరిందమ్ చటర్జీ అని పేరు పెట్టాడు సత్యజిత్. ఇటువంటి సినిమాలో వేయడమంటే తన స్టార్‌డమ్‌కు తనే తూట్లు పొడుచుకున్నట్లు. అయినా ఉత్తమ్ సాహసించి యీ పాత్ర ఒప్పుకున్నాడు. అద్భుతంగా నటించాడు. ఉత్తమ్, సుచిత్రా సేన్ జంటగా వేసిన సినిమాలన్నీ మంచి మెలోడ్రమటిక్‌గా వుండి, సూపర్ హిట్లు అయ్యాయి. కొన్ని తెలుగులో రీమేక్ అయ్యాయి కూడా. వాటన్నిటిలో కంటె దీనిలో ఉత్తమ్ నటన ఉత్తమంగా వుంటుంది. సత్యజిత్ సినిమాలలో చాలా భాగం స్లోగా వున్నా, యిది మాత్రం వేగంగా కదులుతుంది. ఆయన సినిమాల్లో అన్నిటి కంటె నాకు యిదే నచ్చింది.

సత్యజిత్ తీసిన సినిమాలలో తన కథలనో, యితరుల కథలనో తెరకు ఎడాప్ట్ చేసినవే ఎక్కువ. సినిమా కోసం డైరక్టుగా రాసినవి తక్కువ. వాటిల్లో ‘‘నాయక్’’ (1966) ఒకటి. అయితే దీనికి ఇన్‌స్పిరేషన్ ఇంగ్మార్ బెర్గ్‌మన్ స్వీడిష్ భాషలో తీసిన ‘‘వైల్డ్ స్ట్రాబెరీస్’’ (1957)లో కనబడుతుంది. రెండిటిలోనూ ప్రయాణం వుంది. ఆ ప్రయాణంలోనే కథానాయకుడి జీవనగమనమూ వుంది. గతాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తు గురించి భయపడుతూ, వర్తమానంలో ఆందోళన పడుతూండడం, ప్రయాణంలో యితరులు తారసిల్లడం, వీరిపై వారి ప్రభావం కనిపిస్తుంది. ఇద్దరూ ప్రముఖులే, వేర్వేరు రంగాల్లో! ముందుగా స్వీడిష్ సినిమా కథ చెప్తాను. ఇసాక్ బోర్గ్ అనే 78 ఏళ్ల డాక్టరు బాక్టీరియాలజీలో సాధించిన అద్భుతాలకు గుర్తింపుగా లుండ్ యూనివర్శిటీవాళ్లు ఎవార్డు ప్రకటించారు. దాన్ని తీసుకోవడానికి స్టాక్‌హోమ్ నుంచి అతను లుండ్‌కు కారులో బయలుదేరాడు. అతని కోడలు మారియానా లుండ్‌లో వున్న తన భర్త దగ్గరకు వెళ్లడానికి యితనితో కలిసి ప్రయాణించింది.

ఇసాక్ అహంభావి, కోపిష్టి, మొండివాడు. భార్య పోయింది. కొడుకుకి చికాకు ఎక్కువ. అతని భార్య గర్భవతి. గర్భం తీయించేసుకోమని ఆమెతో గొడవ పడుతున్నాడు. ఆమె అతనికి విడాకులు యిచ్చేద్దామనుకుంటోంది. ఆమెకు మావగారంటే కూడా పడదు. ఇష్టం లేకుండానే తోడుగా బయలుదేరింది. వీళ్లకు దారిలో చాలా రకాలవాళ్లు తారసిల్లారు. లిఫ్ట్ యిమ్మనమని కోరారు. మొదటి తగిలిన గ్రూపులో యిద్దరబ్బాయిలు, ఒకమ్మాయి వున్నారు. ఆ అమ్మాయిని చూస్తే ఇసాక్‌కు తను యవ్వనంలో తొలి ప్రేమలో పడిన అమ్మాయి గుర్తుకు వచ్చింది. ఇద్దరూ కలిసి స్ట్రాబెరీలు ఏరుకోవడమూ గుర్తుకు వచ్చింది. చివరకు ఆ అమ్మాయి యితని సోదరుణ్ని పెళ్లాడి యితని హృదయాన్ని ఛిద్రం చేసింది. తర్వాత తగిలిన గ్రూపు మధ్యవయస్కులైన జంట. వాళ్లిద్దరూ చీటికీమాటికీ కొట్టుకోవడం చూస్తే తనూ భార్యా ఉత్తిపుణ్యానికే గొడవలు పడిన సంగతులు గుర్తుకు వచ్చాయి ఇసాక్‌కు.

ఇలా యీ ప్రయాణంలో అతనికి గతంలో జరిగిన మంచీచెడూ అన్నీ గుర్తుకు వస్తాయి. మధ్యలో నిద్రపట్టడంతో కలలు, పీడకలలు వస్తాయి. పైకి సుపీరియారిటీ కాంప్లెక్స్ కనబరిచినా, లోపల తన ప్రతిభ గురించి తనకే సందేహాలున్నట్లు అర్థమౌతుంది. ఎందుకంటే అవార్డు తీసుకోబోతూండగా నిర్వాహకులు నీకు దీన్ని తీసుకునే అర్హత లేదు, యివ్వం అని ప్రకటించినట్లు పీడకల వస్తుంది. తనకు ఆత్మీయులెవరూ లేరని, తను ఒంటరిననీ కూడా గ్రహింపుకి వస్తుంది. ఈ లక్షణాలు తన తల్లిలోనూ, కొడుకులోనూ వున్నాయని, అందుకే వాళ్లు తన పట్ల నిరాదరణతో వున్నారనీ అవగాహన ఏర్పడుతుంది. స్వీయలోపాలను తెలుసుకోగానే అతని మనసు తేట పడుతుంది. కోడలితో కూడా మనసు విప్పి మాట్లాడి, ఆమెను సమాధాన పరుస్తాడు. గమ్యం చేరేసరికి అతను మారిన మనిషి.  లుండ్‌లోని కొడుకు యింట్లో పక్క మీద పడుకున్నపుడు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి పిక్నిక్‌కు వెళ్లినట్లు కల వస్తుంది. సినిమా సమాప్తం.

ఇక ‘‘నాయక్’’ కథలో హీరో ప్రఖ్యాత బెంగాలీ సినిమాస్టార్. అవివాహితుడు. అతనికి జాతీయ ఎవార్డు వచ్చింది. దిల్లీ వెళ్లాలి. ఫ్లయిట్ టిక్కెట్టు దొరకలేదు. ముందురోజు రాత్రి ఒకతనితో ఘర్షణ పడిన విషయం ఉదయం పేపర్లో వచ్చింది. తర్వాతి ఫ్లయిట్ కోసం వెయిట్ చేస్తూ యిక్కడే వుండిపోతే మీడియా పొడుచుకు తింటుంది. అందుకని కలకత్తా నుంచి దిల్లీకి రైల్లో ఒంటరిగా బయలుదేరాడు. దాదాపు 24 గంటల ప్రయాణమున్నా ఫర్వాలేదని! ఇతను ఫస్ట్‌క్లాసులో ప్రయాణిస్తున్నాడు. పక్కనున్న కోచ్‌లలో అదితి సేన్‌గుప్తా (ఆ పాత్ర వేసినది శర్మిలా టాగోర్) అనే హైబ్రోయిష్ జర్నలిస్టు ప్రయాణిస్తోంది. ఇద్దరూ డైనింగ్ కార్‌లో కలిశారు. అదితికి సినీరంగమన్నా, బెంగాలీ సినిమాలన్నా చిన్నచూపు. స్టార్స్ చేసే హడావుడి అంటే మంట, ఏవగింపు. అయితే ఆమె ‘‘ఆధునికా’’ పేరుతో మహిళల కోసం తన సంపాదకత్వంలో ఒక పత్రికను నడుపుతోంది. తన అభిప్రాయాల మాట ఎలా వున్నా, యీ హీరో జీవితంలోని గుట్టుమట్లను సేకరించి బయటపెడితే పత్రిక సేల్స్ పెరుగుతాయనే ఊహ కలిగి, వెళ్లి పలకరించింది.

హీరో కోచ్‌లో వున్న ఆడవాళ్లందరూ అతన్ని చూసి మైమరచిపోతున్నారు. అలాటి వాళ్లను చూసిచూసి విసుగెత్తిన అతనికి హుందాగా వున్న యీమె భిన్నంగా కనిపించి, ఆదరంగా స్పందించాడు. ఆమె యింటర్వ్యూ అని చెప్పకుండా పిచ్చాపాటీగా మాట్లాడుతూ, రహస్యంగా నోట్సు తయారుచేసుకోవడం మొదలుపెట్టింది. అదేమీ తెలియని అతను, ఎవరో ఆత్మీయురాలు దొరికినట్లుగా ఫీలయి, తన జీవితంలోని ఎత్తుపల్లాల గురించి, స్టార్‌డమ్ తనలో తెచ్చిన మార్పుల గురించి అన్నీ చెప్ప నారంభించాడు. అన్నీ ఒకేసారి కాదు, ఒక్కోసారి కొంతకొంత చొప్పున. ఈ క్రమంలో అతను జీవితాన్నంతా సింహావలోకనం చేసుకుంటూ ఆత్మపరిశీలన చేసుకున్నాడు. దీన్ని అనేక ఫ్లాష్‌బ్యాక్‌లలో దర్శకుడు చెప్పినప్పుడు ఏ మాత్రం గందరగోళం లేకుండా మనకు అర్థమౌతుంది. ఈమెతో మాట్లాడడం వలన హీరోకి మనసు తేలిక పడుతుంది. ఇది అనేక సింబాలిక్ షాట్స్ ద్వారా చూపడం జరిగింది. అందువలన సినిమా రెండు సార్లు చూస్తే, బాగా అర్థమవుతుంది.

ఇతను నాటకాల నుంచి వచ్చాడు. నాటకాల్లో యితని గురువు శంకర్‌దాకి యితను సినిమాల్లోకి వెళ్లడం యిష్టం లేదు. సినిమాలు ఒక కళే కాదంటాడు. కొంతకాలం పోయాక దుర్గాపూజ పందిళ్లలో నాటకప్రదర్శనలిస్తూ, ఎదురుపడి తిడతాడు కూడా. ‘మీరంతా నిర్మాతల చేతుల్లో కీలుబొమ్మలు, మేము ప్రజల్లో బతికుతూ వారి జీవితాల్ని ప్రతిబింబించే కళాకారులం.’ అంటాడు. మన హీరో సినిమాల్లో ప్రవేశించినపుడు ముకుంద్ లాహిరి అనే అప్పటికి చాలా ప్రసిద్ధ నటుడు అహంభావంతో యితన్ని యీసడిస్తాడు. అతనిదంతా పాతకాలపు మెలోడ్రమటిక్ నటన. ఇతను కాస్త రియలిస్టిక్‌గా చేయబోయేసరికి ‘నువ్వేమైనా హాలీవుడ్ నటుడవనుకుంటున్నావా?’ అని తిట్టిపోస్తాడు. కానీ క్రమేపీ యితని మార్కు నటనే ప్రజామోదం పొంది, యితను స్టార్ అయ్యాడు. లాహిరి వెనకబడి, వేషాలు లేక చిన్న వేషమైనా యిప్పించమని ప్రాధేయపడడానికి యితని దగ్గరకు వస్తాడు.

ఎన్టీయార్ తొలి సినిమా ‘‘మనదేశం’’లో నారాయణరావుది హీరో. ఎన్టీయార్‌ది చిన్న పాత్ర. నారాయణరావు గొప్పనటుడే కానీ అహంభావి అనే పేరుండేది. ఆయన ఎన్టీయార్‌ను అవమానించినట్లుగా ఎవరూ చెప్పలేదు కానీ పదేళ్లు గడిచాక ఆయన ఎన్టీయార్ వద్దకు వేషమేదైనా యిప్పించమని అడుగుతూండగా చూసిన వారు తమ జ్ఞాపకాల్లో రాశారు. సినీరంగపు రంగులరాట్నం అలా వుంటుంది. మన హీరోకి కాలేజీ రోజుల్లో వీరేశ్ అనే ఒక ఆప్తమిత్రుడు వున్నాడు. అతను ప్రజాసేవలోకి వెళ్లి, కార్మిక నాయకుడయ్యాడు. ఒకసారి సమ్మె జరుగుతోంది. కార్మికులవి న్యాయమైన కోరికలు, నువ్వు వచ్చి మద్దతు ప్రకటిస్తే వాళ్లకు ఉత్సాహంగా వుంటుంది అని వచ్చి హీరోని బతిమాలాడు. ‘అలా చేస్తే నా యిమేజి దెబ్బ తింటుంది. ఒక వర్గం ప్రేక్షకులకు దూరమవుతాను. కావాలంటే ధనసహాయం చేస్తాను.’ అంటూ హీరో. అతను బలవంతంగా కార్మికుల మధ్యకు లాక్కుని వెళితే పిరికివాడిలా పారిపోతాడు. ఇమేజి చట్రంలో యిరుక్కుపోయిన తన నిస్సహాయత పట్ల తనకే అసహ్యం వేస్తుంది హీరోకి.

ఇవన్నీ తనకు తానే చెప్పుకుంటున్నట్లుగా అదితితో అన్నీ చెప్పేశాడు. చీకటి పడింది. తాగేసి పడుక్కున్నాడు కానీ అర్ధరాత్రి ఓ కల వచ్చింది. తనొక్కడే పెద్ద ఖాళీ ప్రదేశంలో వున్నాడు. ఎటు చూసినా నోట్ల గుట్టలే! వాటిపై ఆనందంగా నడుస్తూ వుండగా, సడన్‌గా నేల ఊబిలా మారిపోయి, అతను కూరుకుపోసాగాడు. చేయెత్తి ఆదుకోమని అరుస్తున్నా ఎవరూ వినలేదు. అంతలో ఎక్కణ్నుంచో టెలిఫోన్ మోగిన శబ్దం. కంగారు, గుండె ఝల్లుమంది. చూడబోతే అస్తిపంజరాలు తిరుగుతున్నాయి. సినిమాలో ఆ సీనుకి చాలా పేరు వచ్చింది. అలాగే ఎవార్డు ఫంక్షన్‌లో తనను తిరస్కరించినట్లు, తను గొప్ప నటుడు కాదని చెప్పినట్లు కూడా కల వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు. ఎందుకీ వ్యర్థజీవితం అనుకున్నాడు. కంపార్టుమెంటు డోరు దగ్గరకు వచ్చి, దూకి, ఆత్మహత్య చేసుకోబోయాడు.

అంతలోనే అదితికి తన రహస్యాలు కూడా చెప్పేస్తే బాగుండుననిపించింది. కోచ్ ఎటెండెంట్‌కు చెప్పి అదితిని రప్పించాడు. వివాహిత ఐన హీరోయిన్‌తో తనకు ఎఫైర్ వుందని పేపర్లు రాసేది నిజమేనని ఒప్పేసుకున్నాడు. కితం రోజు రాత్రి నైట్‌క్లబ్‌లో ఆమె భర్తతోనే గొడవ పడ్డానని చెప్పి హృదయభారం దింపుకున్నాడు. ఇంకా వివరాలు చెప్పబోయాడు కానీ అదితి అతన్ని ఆపింది. అప్పటికే ఆమెకు యితని పట్ల జాలి కలిగింది. పైకి ఎంత అట్టహాసంగా కనిపించినా, అంతరంగంలో అతను మామూలు వ్యక్తే అని, మంచిచెడ్డలు కలిసివున్నవాడని, చుట్టూ ఎందరున్నా మానసికంగా ఒంటరని, అపరాధభావనతో తన ముందు చేసిన కన్ఫెషన్ల కారణంగా అతను మానసిక ప్రక్షాళనా కార్యక్రమాన్ని మొదలుపెట్టాడని అర్థం చేసుకుంది. అక్కడే వుంటే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం వుందని, అతన్ని జాగ్రత్తగా కోచ్‌ లోపలికి తీసుకెళ్లి పడుక్కోబెట్టింది.

అతని పట్ల సానుభూతి, సహానుభూతి ఎప్పుడైతే కలిగాయో, అప్పుడు ఆమె రహస్యంగా తయారుచేసుకున్న నోట్సును బుట్టదాఖలు చేసింది. అతని జీవితాన్ని ప్రజల ముందు బయటపెట్టి యిమేజి చెడగొట్టకూడదని నిశ్చయించుకుంది. మర్నాడు ఉదయం కలిసినపుడు అతను ‘‘నేను నీతో చెప్పిన విషయాలను జ్ఞాపకం పెట్టుకుని పేపర్లకు ఎక్కిస్తావా?’’ అని అడిగాడు. ఆమె ‘‘మొనే రఖే దేబో (మనసులోనే వుంచుకుంటా)’’ అని జవాబిచ్చింది. మర్నాడు దిల్లీ చేరగానే స్టేషన్‌లో అతని చుట్టూ అభిమానులు మూగుతున్నారు. అతను మళ్లీ తన రంగుల జీవితంలోకి వెళ్లిపోవడానికి కళ్లకు రంగుటద్దాలు ధరించాడు. అతనెవరో తెలియనట్లే యీమె తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రితో కలిసి బయటకు నడిచింది. మళ్లీ కలుద్దామనే భావన యిద్దరిలోనూ లేదు. ఈ క్లయిమాక్స్ చూసినపుడు ‘‘రోమన్ హాలిడే’’లో జర్నలిస్టు గ్రెగరీ పెక్, యువరాణి ఆడ్రీ హెప్‌బర్న్ గుర్తుకు వస్తారు. అక్కడా ఒక రోజు సంఘటనలే, యిక్కడా ఒక రోజు సంఘటనలే. అనుభవాలు, భావాలు మనసులోనే ఉండిపోతాయి తప్ప అక్షరరూపంలో బయటకు రావు.

హీరోతో బాటు ఉన్న ప్రయాణికులు పలురకాలు. ఒకతను ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే వుంటాడు. మహా భోగిలా కనబడతాడు. రైలు దిల్లీ చేరే సమయానికి కాషాయవస్త్రాలు ధరించాడు. అదేమిటంటే అతనో స్వామీజీట. సుఖాలు త్యజించాలని దిల్లీలో ఉపన్యాసం యిచ్చి భక్తసమూహాన్ని పెంచుకోబోతాడట. అలాగే యింకో అతను ఎడ్వర్టయిజింగ్ మనిషి. మరో ముసలి రైటర్ యీ నాటి సినిమాలన్నీ దరిద్రగొట్టువని, సమాజాన్ని పాడు చేసే సినీరంగానికి నువ్వు ప్రతినిథివి అని హీరోని తిడుతూంటాడు. ఒక బిజినెస్‌మన్ తన వ్యాపారావకాశాల కోసం భార్యను మరొకరి దగ్గరకు పంపడానికి ప్లాన్లు వేస్తూంటాడు. అతనే యీ హీరోతో ‘మన సినిమాలన్నీ దేశంలోని వెనకబాటుతనాన్ని చూపిస్తున్నాయి తప్ప, మనం సాధించిన ప్రగతిని చూపించటం లేద’ని విమర్శిస్తాడు. ఇక కోచ్‌లో వున్న కొందరు మహిళలైతే యితన్ని కృష్ణుడివని, తామంతా గోపికలమని చెప్పేస్తారు. ఇలా మన సినిమా హీరో ఒక్కడే కాదు, సమాజంలోని అనేక వర్గాల్లో కూడా చెడు వుందని దర్శకుడు అన్యాపదేశంగా చెప్పాడు.

సినిమాలో అందరూ గొప్పగా నటించారు. కానీ ఉత్తమ్ కుమార్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఎందుకంటే ‘దీన్ని నా బయోపిక్‌గా ప్రేక్షకులు అనుకున్నారంటే నా యిమేజి చెడిపోతుంది’ అనే సంకోచం ఏమాత్రం లేకుండా అతను పాత్రను అంగీకరించాడు. సాధారణంగా సత్యజిత్ అందరి పాత్రలూ అభినయించి చూపుతాడు. పాత్రల గురించి పాత్రధారులతో చాలా చర్చిస్తాడు. కానీ ఉత్తమ్ విషయంలో అలా జరగలేదు. తన 54వ ఏట 1980లో ఉత్తమ్ మరణించినప్పుడు నివాళి ఘటిస్తూ సత్యజిత్ రాశాడు – ‘‘పాత్ర గురించి, సన్నివేశం గురించి మేమేమీ పెద్దగా చర్చించుకునేవాళ్లం కాదు. కానీ ప్రతి సన్నివేశంలోనూ అతను నేను ఊహించిన దాని కంటె బాగా నటించాడు. ప్రతి చిన్న విషయంలోనూ యింప్రొవైజేషన్ చూపించాడు. ఆ ఘనతంతా అతనిదే, నాది కాదు. అవి ఎంత స్పాంటేనియస్‌గా వచ్చేవంటే అతను ఏదో మాజిక్ చేసి, చొక్కా మడతల్లోంచి బయటకు తీసినట్లుండేవి. అతను ముందే ఆలోచించి పెట్టుకున్నాడనుకున్నా దాని గురించి చాటుకునేవాడు కాదు.’ అని. సినిమా చూస్తే మీకూ అర్థమౌతుంది ఉత్తమ్ కుమార్‌ను మహానాయక్ అని ఎందుకు అన్నారో!

ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)