ఎమ్బీయస్: అప్పుతిప్పలాంధ్ర

చంద్రబాబు ఆంధ్రను పాలిస్తున్న రోజుల్లో ఓ సారి ‘‘ఆపసోపాంధ్ర’’ అని హెడింగ్ పెట్టి వ్యాసం రాస్తే చాలామందికి అభిమానం పొడుచుకుని వచ్చింది. అప్పట్లో చాలామంది విభజన తర్వాత బాబు నేతృత్వంలో ఆంధ్ర ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకునేవారు. విభజన గురించి చర్చలు జరిగే రోజుల్లో ఆ ప్రాంతానికి ఎవరోగాని సీమాంధ్ర అనే పదాన్ని కాయిన్ చేశారు. విభజన తర్వాత టిడిపి వాళ్లు ‘బంగారు తెలంగాణ’కు దీటుగా ‘స్వర్ణాంధ్ర’ అనే పదాన్ని కాయిన్ చేసి, విరివిగా వాడేవారు. కొన్ని కంపెనీలు ఆ పేరుతో వెలిశాయి కూడా. అలాటి సమయంలో ఆంధ్రకు వనరులు లేవు, బిజెపి సాయం చేయటం లేదు, యిటు చూస్తే బాబు పెద్దపెద్ద కలలు కనేసి అవి తీరక అవస్థ పడుతున్నారు అని పరిస్థితిని వర్ణిస్తూ ఆ హెడింగ్ పెట్టాను. అప్పుడు టిడిపి అభిమానులే కాక, తటస్థులు కూడా ఎక్కడో తెలంగాణలో కూర్చుని ఆంధ్రను అవమానించారు అంటూ నన్ను తిట్టిపోశారు.

ఈ రోజు ఈ హెడింగ్ చూసి వైసిపి అభిమానులే కాక, తటస్థులు కూడా నొచ్చుకోవచ్చు. నాకు ఆంధ్రద్వేషం వుందని ఆడిపోసుకోవచ్చు. వాళ్లు రాష్ట్రాభిమానులు కాదు, ఆ పార్టీ సానుభూతిపరులు, వాస్తవాలు గుర్తించడం యిష్టం లేక తమను తాము మభ్యపెట్టుకునే వాళ్లు. కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్రం ఏర్పడేనాటికి 0.97 లక్ష కోట్ల అప్పుంటే చంద్రబాబు 60 నెలల్లో 1.62 లక్షల అప్పు చేర్చారు. జగన్ 18 నెలల్లో 1.07 చేర్చడం చేత మొత్తం మీద 2020 నవంబరు నాటికి 3.73 లక్షల కోట్ల అప్పుందని నెలకు 9.20 వేల కోట్ల అప్పు పెరుగుతోందని చెప్పింది.  కాబట్టి ఈ పాటికి నాలుగున్నర లక్షల కోట్లు దాటిపోయి వుంటుంది. ఈ అంకెలు చూపించి, యివిగో యింత అప్పుంది కదా అంటే కేంద్రానికి అప్పు లేదా? ఇతర రాష్ట్రాలకు లేదా? అని వాదనకు దిగుతారు. నిన్న కొమ్మినేని శ్రీనివాసరావుగారు ‘‘సాక్షి’’లో వ్యాసం రాస్తూ కేంద్రానికి 119 లక్షల కోట్ల అప్పుంది. దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉన్నాయి అంటూ జాబితా వల్లించారు. పోల్చేటప్పుడు సరిసమానమైన వాళ్లతో పోల్చాలి. పెద్ద పెద్ద రాష్ట్రాలతో, పాత రాష్ట్రాలతో, ఆదాయ వనరులున్న రాష్ట్రాలతో పోలిస్తే ఎలా?

ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు. మీకెంత ఆదాయం వస్తోందో చూసుకుని, దానికి తగ్గట్టుగా అప్పులు చేసుకోవాలి. సిరి గలవానికి చెల్లును.. అన్నట్లు మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక వంటి ఇండస్ట్రీలు మెండుగా వున్న రాష్ట్రాలు అప్పు చేసినా అదో అందం, తీర్చేయగల కెపాసిటీ వుంటుంది. మరి ఆంధ్రా కేముంది? రాజధాని ఎక్కడుందంటే జవాబు వెతుక్కోవాలి. సెక్రటేరియట్ దగ్గర్నుంచి అన్నీ తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయి. హైదరాబాదు వంటి బంగారు బాతు ఏదీ లేదు. అన్నీ చిన్న పట్టణాలే! హైదరాబాదులో ప్రభుత్వ స్థలం వేలం వేస్తే కోట్లుకోట్లు వచ్చిపడ్డాయి. ఆంధ్రలో అలాటి అవకాశం వుందా? అమరావతి కట్టి వుంటే, అదే రాష్ట్రమంతా పోషించేది అంటారు బాబు. అసలు కట్టడానికి చేతిలో డబ్బు వుంటే కదా! పెళ్లయితే తప్ప పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే తప్ప పెళ్లి కాదు అన్నట్లుంది.

ఇప్పుడు వైజాగ్‌ను బంగారు బాతు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పిల్ల బాతు ఎప్పటికి పెద్దదవుతుందో, ఎప్పటికి గుడ్లు పెడుతుందో తెలియదు. ఈలోగా యింకో పార్టీ అధికారంలోకి వచ్చి  క్విట్ వైజాగ్ నినాదాన్నిస్తే కథ మళ్లీ మొదటికి రావచ్చు. ప్రస్తుత వాస్తవమేమిటంటే యీ బాతుగుడ్ల కథ మాట ఎలా వున్నా, సరదాలకు ఖర్చు పెట్టాలన్నా, వైద్యావసరాలకు ఖర్చు పెట్టాలన్నా, భూమి కొనాలన్నా ఆంధ్ర జనాలు పొరుగు రాష్ట్రాలకు పోతున్నారు. ఆంధ్రలో సరుకులమ్మే కంపెనీలన్నిటి రిజిస్టర్డ్ ఆఫీసులూ హైదరాబాదులోనే వున్నాయి. అక్కడ ఆడే సినిమాలు, నడిచే టీవీ కార్యక్రమాలు, కనిపించే ఓటిటి షోలు అన్నీ హైదరాబాదులోనే తీస్తారు. నిర్మాణ సంస్థలన్నీ అక్కడే పన్ను కడతాయి. మార్కెట్ ఆంధ్రలో, పన్ను ఆదాయం తెలంగాణకు! పరిశ్రమల విషయంలో ఆంధ్ర ఎప్పుడూ వీక్‌యే! ప్రభుత్వ పెట్టుబడులూ తక్కువ, ప్రయివేటు పెట్టబడులూ తక్కువ! కన్స్యూమర్ రంగం ఎదిగినట్లుగా ఉత్పాదక రంగం ఎదగలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి! అందువలన ఆదాయం బజెట్ అంచనాలను అందుకోవటం లేదు.

కేంద్రం అప్పు చేయటం లేదా అంటారు. చేస్తుంది, దాని యిష్టం. అప్పెందుకు చేశావ్ అని కేంద్రం రాష్ట్రాలను అడగగలదు కానీ రాష్ట్రాలు వెళ్లి కేంద్రాన్ని అడగగలవా? అప్పు చేసినా తీర్చుకునే అవకాశం కేంద్రానికి ఉంది. పన్నులు వేయగలదు, రాష్ట్రాల నుంచి వాటాలు గుంజుకోగలదు, బ్రిటిష్ వారి హయాం దగ్గర్నుంచి, తరతరాలుగా కూడబెట్టిన ఆస్తులు తెగనమ్మగలదు. రోడ్లు, రైళ్లు, విమానాలు, విమానాశ్రయాలు, కాలువలు, వంతెనలు, ఏది కనబడితే అవి ఈ ఐదేళ్లలో అమ్మేసి, దేశాన్ని శుబ్భరంగా కడిగి బోర్లించిన బిందెలా చేసి పెట్టగలదు. తర్వాత వచ్చేవాళ్లకు అమ్మడానికి ఏమీ మిగల్చకుండా కరారావుడు చేసేయగలదు. పన్నులంటే రాష్ట్రాలకు వాటా యివ్వాలని సెస్‌ల రూపంలో వడ్డించగలదు. రాష్ట్రాలకివ్వాల్సిన పన్ను వాటా బకాయి పెట్టగలదు, కావాలంటే బయటకు వెళ్లి అప్పు తెచ్చుకోండి తప్ప, నన్ను ఒత్తిడి పెట్టకండి అనగలదు. పెట్రోలు, డీజిల్, గ్యాసు ధర చిత్తమొచ్చినట్లు పెంచగలదు, గుర్తు వచ్చినప్పుడల్లా ఆర్‌బిఐ ఖజానాను ఖాళీ చేసేయగలదు.

ఒక రాష్ట్రం వీటిల్లో ఏదైనా చేయగలదా? చేయలేనప్పుడు సాపత్యం తేవడం దేనికి? వాళ్లెక్కడ? వీళ్లెక్కడ? అందువలన మనతో మనమే పోల్చుకోవాలి. క్రెడిట్ వర్దీనెస్, అప్పు చేసే తాహతు ఎలా లెక్కకడతారో ఏ బాంకర్‌ను అడిగినా చెప్తారు. మీరు నాలుగు లక్షల క్రెడిట్ కార్డుకి అప్లయి చేస్తే, వాళ్లు వచ్చి లెక్కలేసి మీ మొహానికి 80 వేలకు మించి యివ్వలేం అని చెప్పేస్తారు. అప్పులు తీర్చడంలో మన హిస్టరీ ఏమంత ఘనంగా వుందో క్రిసిల్ రేటింగు చెప్పేస్తుంది. రాష్ట్రం విషయంలో ఎన్నిసార్లు ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) తీసుకున్నారో చూస్తే ప్రభుత్వ నిర్వాకం ఏమిటో తెలిసిపోతుంది. వైయస్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థికమంత్రిగా రోశయ్య ఓడీ లేకుండా మేనేజ్ చేసేవారు. దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ వుంటే టిడిపివారు ‘ఆ ఫెసిలిటీ వున్నది వినియోగించు కోవడానికేగా, దాన్ని వాడుకోకపోవడం పెద్ద ప్రజ్ఞ అన్నట్లు చెప్పుకుంటే ఎలా?’ అని వెక్కిరించారు. దానికి రోశయ్యగారు ‘మనిషి పోతే తగలేయడానికి ప్రతీ ఊళ్లో స్మశానం అనే ఫెసిలిటీ వుంటుంది. అంతమాత్రం చేత దాన్ని ఉపయోగించుకోవాలని ఎవరైనా ఆతృత పడతారా?’ అని అడిగారు.

వైయస్-రోశయ్య హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమతూకంలో నడిపించారు. 42 మంది ఎంపీలున్న ఉమ్మడి రాష్ట్రం పలుకుబడే వేరు. హైదరాబాదు వంటి కామధేనువు వుంది. ప్రభుత్వభూములు అమ్మితే డబ్బు వచ్చేది. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వుంది, ఆంధ్ర వలననే అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ఆ ప్రాజెక్టని, యీ ప్రాజెక్టని ఏవో కొట్టుకుని వచ్చేవారు. ఇప్పుడు కేంద్రాన్ని ఏ రకంగానూ బెదిరించే అవకాశం లేదు. బిజెపికి సొంత మెజారిటీ వుంది. మొన్న 20 ని.ల్లో మూడు బిల్లులు పాస్ చేసేసుకున్నారు. రాజ్యసభలో మాత్రమే కాస్త యిబ్బంది. అది కూడా ఫిరాయింపులతో, రకరకాల జిత్తులతో మేనేజ్ చేసేస్తున్నారు. ఏది కావాలంటే అది బిజెపి చేయగలుగుతోంది. బిజెపికి ఆంధ్రలో ఏ మాత్రం స్టేక్ లేదు. విభజనకు భుజం కాశాం కాబట్టి నొచ్చుకుంటారేమో, ప్రత్యేక హోదా యివ్వలేదని కోపగించుకుంటారేమో,  వైజాగ్ స్టీల్ ప్లాంటు అమ్మేస్తున్నామని అలుగుతారేమో అనే భయాలు లేవు. గుడ్డికన్ను మూస్తే ఎంత, తెరిస్తే ఎంత, రాష్ట్రంలో పార్టీ బతికితే ఎంత, లేకపోతే ఎంత అనే ధోరణిలో వున్నారు. ఇలాటప్పుడు వారిని బతిమాలినా, బెదిరించినా ఏ నిధులూ రాలవు. ఏ ప్రాజెక్టులూ దిగి రావు.

ఇది ప్రస్తుతం వున్న కఠోరవాస్తవం. మరి అలాటప్పుడు వైయస్‌ని మించి సంక్షేమ పథకాలు అమలు చేసేస్తానని తెగబడితే ఎలా? వైయస్‌కూ ఉత్సాహం వుండేది కానీ ఆర్థికమంత్రి ఆగమంటే ఆగేవారు. రోశయ్యను వైయస్ అన్నగారిలా, హితైషిగా చూసేవారు. జగన్‌కు అలాటి అంకుశం ఏది? అతనికి ఎవరైనా చెప్పగలరా? నచ్చచెప్పగలరా? రెండున్నరేళ్ల పదవీకాలం తర్వాత మంత్రులందరినీ మార్చేస్తానని జగన్ చెప్పారు. ‘అన్నమాట నిలబెట్టుకుని, మీరు నా పోస్టు మార్చేయండి’ అని ప్రాధేయపడేవారిలో ప్రథముడు బుగ్గన అయివుంటారు. ఎందుకంటే తెల్లవారితే ఆంధ్ర ఆర్థికమంత్రి చేసే పనేమిట్రా అంటే అప్పుల అప్పారావులా కొత్త అప్పులు తెచ్చి పాత అప్పుల వడ్డీ కట్టడమెలా అని ఆలోచించడం! మ్యాప్ ముందేసుకుని కొత్తగా అప్పులిచ్చే వాడెవడున్నాడా అని వెతకడం. బోరింగు వేయించాలంటే కఱ్ఱముక్కలు చేతబట్టి, నేలలో జలధార ఎక్కడ పడుతుందో చెప్పేవాళ్లను వెతుకుతారు చూడండి, అలాగ అప్పెక్కడ పుడుతుందో చెప్పే సలహాదారును వెతకడమే పని.

అసలు సలహాదారులకే పోతోంది ఆంధ్ర రాష్ట్రం డబ్బంతా! ఐదున్నర కోట్ల జనాభా వున్న రాష్ట్రానికి యింతమంది సలహాదారులా? ఈ సలహాదారులు లేనప్పుడు కూడా, ఉమ్మడి రాష్ట్రమంత పెద్ద రాష్ట్రంలో పరిపాలన సాగింది కదా! ఇప్పుడు వాళ్లు లేకుండా నడవటం లేదంటే ముఖ్యమంత్రి చేతకానితనం కాదా? ఏదైనా టెక్నికల్ విషయం వుంటే కన్సల్టెంట్ సలహా అవసరమే. అప్పుడు ఓ సారి పిలిచి కన్సల్టేషన్ ఫీ యిచ్చి పంపించేయవచ్చు కానీ ఏడాదంతా భరించడం దేనికి? పర్శనల్‌గా మొహమాటాలుంటే పార్టీ పరంగా పెట్టుకోవాలి కానీ టాక్స్ పేయర్స్ మనీ దోచి పెట్టడమేమిటి? రోజంతా చచ్చీచెడి పని చేసే ఉద్యోగులకు జీతాలు సమయానికి యివ్వటం లేదు. ఒకటవ తారీక్కు రావలసినది మొదటివారంలో వస్తే దేవుడికి దణ్ణం పెట్టుకునే స్థితికి తెచ్చారు. 2018 నుంచి పెండింగులో వున్న పే రివిజన్ చేస్తామంటూ ఇంటెరిమ్ రిలీఫ్ యిచ్చి కాలక్షేపం చేస్తున్నారు. ఫైనల్‌గా వచ్చేసరికి కెసియార్‌లా 2018 నుంచి యివ్వలేను, యీ ఏడాది నుంచే యిస్తానంటారేమో తెలియదు.

ఇక పెన్షనర్ల సంగతి మరీ దారుణం. 2018 జులై నుంచి డిఏలు బకాయి పెట్టి, 2018 నాటివి యీ జనవరిలో యిచ్చారు. 2019ది ఆగస్టులో యిస్తానన్నా యిప్పటిదాకా అజాపజా లేదు. 30 నెలల డిఏ బకాయి అంటే అవి అందేనాటికి పెన్షనర్ వుంటాడో, ఊపిరి వదిలేస్తాడో తెలియదు. ఎరియర్స్ యిచ్చేశామంటూ టిడిఎస్ కట్ చేసేశారు. కట్ చేసినది ఇన్‌కమ్ టాక్స్ వారి 26ఏఎస్‌లో చూపించలేదు. పెన్షనర్లకు రెండిందాలా నష్టం. ఇదెక్కడి ఘోరం అని చెప్పుకుందామంటే అయ్యవారి దర్శనం దుర్లభం. పథకాలు సరిగ్గా అమలు కావాలంటే ఉద్యోగుల భాగస్వామ్యం అతి ముఖ్యం. పెన్షనర్ల అవస్థలు చూసి రేపు మన గతీ యింతే కదా అని నేటి ఉద్యోగులు డీమోరలైజ్ అయితే ఎంత నష్టం? పనిచేసే ఉద్యోగులకు ఆకుల్లో విదిలిస్తూ, సలహాదారులకు మాత్రం కంచాల్లో వడ్డిస్తున్నవారి విజ్ఞత గురించి ఏం చెప్తాం!

బాబు హయాంలో లోకేశ్‌కు తెలుగు నేర్పడానికి పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో టీచరును పెట్టారంటే యిదెక్కడి ఘోరం అనుకున్నాను. అంతగా తెలుగు నేర్చుకోవాలనుకుంటే సొంత డబ్బుతో పెట్టుకోవాలి, కానీ ప్రభుత్వధనం ఎందుకు? మరో మంత్రి వచ్చి సింగపూరు వెళ్లాలి, స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులకు డబ్బివ్వండి అంటే! లోకేశ్‌కు మంత్రి పదవి యిచ్చినపుడు నీకు వచ్చిన తెలుగు చాలులే అని కదా యిచ్చారు, దీన్ని మించిన తెలుగు రాకపోతే పదవి పీకేస్తాం అని ముఖ్యమంత్రి నోటీసు యిచ్చారా? మీరు సరైన తెలుగు నేర్చుకుని, మంచి తెలుగులో ఆదేశాలు యివ్వకపోతే పని చేయలేం అని అధికారులు అన్నారా? లేదే! లోకేశ్ తెలుగు నేర్చుకోవడమనేది రాజకీయ అవసరం. దాని ఖర్చు వాళ్ల పార్టీయే భరించాలి.

అలాగే జగన్ యింతమంది సలహాదారులను పెట్టుకున్నాడంటే దాని అర్థం సొంతంగా పాలన రాదనేగా! పరిపాలన వచ్చని ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేసినట్లు అనుకోవాలా? పాలన బాగాలేకపోతే జగన్‌కు రాజకీయంగా నష్టం జరుగుతుంది. రాష్ట్రానికేముంది? ఇతను కాకపోతే మరొకడు ముఖ్యమంత్రిగా వస్తాడు. అందుచేత జగన్ పరిపాలన నేర్చుకోవాలంటే పార్టీ ఖర్చుతో సలహాదారులను పెట్టుకోవాలి తప్ప ప్రజాధనంతో కాదు. అసలు యింతమంది ఎందుకురా అంటే అప్పులు ఏ విధంగా చేయాలో, ఎక్కణ్నుంచి అప్పు పుడుతుందో చెప్పడానికే అని నా అనుమానం. ఎందుకంటే ఖర్చు పెట్టడం ఎలా అన్నది జగన్‌కు ఎవరూ చెప్పనక్కరలేదు. సీతామ్మవారు ఎక్కడుందాని నలుమూలలా వెతకడానికి వానరసైన్యం వెళ్లినట్లు, ఋణదాత ఎక్కడున్నాడాని గాలించడానికి యీ సలహాదారుల బృందం తిరుగుతూంటుంది కాబోలు.

సలహాదారుల్లాగానే కార్పోరేషన్ చైర్మన్లు. ఒక్క బిసిలకే 56 కార్పోరేషన్లా? ఒక బిసి కులానికి చెందిన చైర్మన్ మరో బిసి కులాల సంక్షేమం పట్టించుకోడనా, కులానికోటి చొప్పున పెట్టుకుంటూ పోయారు? వాళ్లకు ఏడాదంతా పని వుంటుందా? అసలు వీళ్లందరికీ యివ్వడానికి సర్కారు వారి వద్ద నిధులున్నాయా? చైర్మన్లకు, సిబ్బందికి జీతాలకే పోతే యిక ఆ కులాల వారికి ఋణాలేమిస్తారు? ఈ కార్పోరేషన్లు లేనప్పుడు ఆ కులాల వారికి అందినదాని సహాయంలో యిప్పుడు లోటు పడుతుంది. ఎందుకంటే కార్పోరేషన్ నిర్వహణాభారం తినేస్తుంది కదా! పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడానికి ప్రజాధనం వాడుతున్నారన్నమాట అనుకున్నాను. ఇలాటివి ఎప్పణ్నుంచో ఉన్నాయి. కానీ యీ స్థాయిలో దుర్వినియోగం జరిగినట్లు నాకు తెలియదు. ఇది అనవసర వ్యయం అనే కోణంలోని చూసి బాధపడ్డాను కానీ యిప్పుడు వేరే కోణం కూడా కనబడుతోంది.

బిసిలకనే కాదు, రకరకాల పేర్లతో యీ కార్పోరేషన్లు పెట్టింది పార్టీ పక్షుల పునరావాసానికే కాకుండా, అప్పులు తెచ్చుకోవడానికీ, అక్కవుంట్లు గందరగోళ పరచడానికీ కూడా అని అర్థమౌతోంది. పయ్యావుల కేశవ్ 40 వేల కోట్ల అక్కౌటింగ్ ప్రొసీజర్ సరిగ్గా లేదని ఎత్తి చూపారు. అది బాబు హయాంలోనూ జరిగి వుండవచ్చు, యితర రాష్ట్రాలలోనూ జరిగి వుండవచ్చు, ప్రతి కాగ్ రిపోర్టులోనూ రిమార్కు వస్తూండవచ్చు. కానీ ప్రతీదీ పారదర్శకంగా చేస్తున్నాం అని చెప్పుకునే జగన్ ప్రభుత్వంలో కూడా యిదే పద్ధతి అవలంబించడమేమిటి అనేదే ప్రశ్న. ఇబ్బడిముబ్బడిగా సూటుకేసు కంపెనీలు పెట్టేసి, ఇధర్ కా మాల్ ఉధర్ అన్నట్లు చేసి, నిఘా సంస్థలను కన్‌ఫ్యూజ్ చేసిన రీతిలోనే, యీ కార్పోరేషన్‌ల పేర నిధులు కేటాయింప చేసుకుని, అప్పులు తెచ్చుకుని మరోలా వాడేస్తున్నారని బోధపడుతోంది. డెవలప్‌మెంట్‌ కని తెచ్చుకుంటే అలాటి ప్రాజెక్టులకే ఖర్చు పెట్టాలి. దారి మళ్లించకూడదు.

ప్రభుత్వం చేయగలిగిన అప్పులపై పరిమితి వుంటుంది కాబట్టి యీ కార్పోరేషన్ రూటు ఎంచుకున్నారు. ‘అవి అప్పు తెచ్చుకున్నాయి, మేం గ్యారంటీ యిచ్చామంతే, అది మేం చేసిన అప్పు కాదు’ అని చెప్పుకోవడానికి వీలుగా! మీలో చాలామంది అనాలోచితంగా గ్యారంటీలు యిచ్చేస్తూ వుండవచ్చు. వారి కోసం రాస్తున్నాను – గ్యారంటీ యివ్వడం అప్పివ్వడం కంటె ప్రమాదకరం! రూలు ప్రకారం అప్పు చెల్లువేసే సమయానికి ఋణదాత, ఋణగ్రస్తుణ్ని గట్టిగా అడక్కుండా హామీదారుణ్నే రొక్కించవచ్చు. అదేమిటి, వాణ్ని పిండితే డబ్బు వస్తుంది కదా, ఫలానా చోట ఆస్తి వుంది కదా, అది స్వాధీనం చేసుకోకుండా నన్నడుగుతావేం? అని హామీదారు వాదించినా లాభం లేదు. ‘నాకు రావలసినది నాకు యిచ్చేసి, నా స్థానంలో నిలబడి, నువ్వే వాడి దగ్గర వసూలు చేసుకో’ అని ఋణదాత చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఋణదాత, ఋణగ్రస్తుడు యిద్దరూ కుమ్మక్కయి హామీదారుణ్ని ముంచవచ్చు. ఎవరైనా స్నేహితుడు వచ్చి అప్పడిగితే యిచ్చేస్తే అసలుతో వదిలిపోతుంది. అతని తరఫున హామీ యిస్తే, మూడు నాలుగేళ్ల వడ్డీతో సహా పోతుంది. నీరవ్ మోదీ కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంకు గ్యారంటీలిచ్చే మునిగింది. అందుకని, గ్యారంటీలను కూడా లయబిలిటీస్‌ గానే చూడాలి.

చంద్రబాబు తన హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టారు అని ‘‘సాక్షి’’ పేపరు తెగ రాసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మంత్రులు యాగీ చేశారు. సరే వీళ్లేం చేశారట? మొదటగా బాబు హయాంలో జరిగిన పనులన్నిటిలో కమిషన్లు చేతులు మారాయని అనుమానా లున్నాయంటూ బిల్లులు చెల్లించకుండా తొక్కి పెట్టారు. సందేహాలుంటే సగం యిచ్చి, తక్కిన సగం విచారణ పూర్తి చేశాక యిస్తామనవచ్చు. మొత్తం ఆపేశారు. సరే, వీళ్లు వచ్చాక అప్పగించిన పనులకైనా యిస్తున్నారా అంటే అదీ లేదు. ఏడాదిగా బకాయి పడిన సందర్భాలు చాలా వున్నాయి. ఈ మధ్యే ఓ కేసు విన్నాను. ప్రభుత్వ బడుల నాడు-నేడు పథకంలో భాగంగా స్కూళ్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కై ఓ కంపెనీకి పెద్ద కాంట్రాక్టు వచ్చింది. లంచంగా పైసా యివ్వనక్కరలేదు కానీ బిల్లు ఎప్పుడు చెల్లిస్తామో గ్యారంటీ లేదు అన్నారట. సరే, కరోనా కారణంగా బేరాలు లేవు కదా, ఫ్యాక్టరీ ఉత్తినే నడపడం దేనికని ఆయన ఒప్పుకున్నాడు. మోతుబరి కాబట్టి ఆయనకు చెల్లింది, తక్కినవాళ్లు చెల్లింపులు లేకుండా బండి నడపగలరా?

ఇలా ఉద్యోగులను కష్టపెట్టి, వ్యాపారస్తులను కష్టపెట్టి డబ్బంతా ఏం చేస్తున్నారా అంటే జగనన్న యీ పథకం, జగనన్న ఆ పథకం అంటూ వాటికే ఖర్చు చేస్తున్నారు. పథకాల పేర్ల విషయంలో ‘వరుసలెందుకు?’ అంటూ చంద్రబాబు పాలనలోనే ఓ వ్యాసం రాశాను. ఆ సందేహం యిప్పటికీ తీరలేదు. ఓటరుకు చంద్రబాబు అన్న అయితే, ఆయన కొడుకు వయసున్న జగన్‌ కూడా అన్నే ఎలా అవుతాడు? భర్తకు ఉపయోగపడే పథకానికి జగనన్న.. అని పెడితే భార్యకు ఉపయోగపడే పథకానికి జగన్ బావ.. అని పెట్టాలి. స్కూలు పిల్లాడి పథకానికి జగన్ పెదనాన్న కావాలి. ఒకే వ్యక్తి అందరికీ అన్న ఎలా అవుతాడు? గాంధీగారిని జాతిపిత అనేవారు. పిల్లల దగ్గరకు వచ్చేసరికి గాంధీ తాత అనేవారు. ఆయన కంటె చిన్నవాడు కాబట్టి నెహ్రూని చాచా నెహ్రూ అనేవారు. చంద్రన్న అనే పేరుకి అలవాటు పడ్డాం, రేపు లోకేశ్ ముఖ్యమంత్రి అయితే ఆయనేం పెట్టుకుంటాడు? మేనల్లుడు లోకేశ్ అనిపించుకుంటాడా? వైయస్‌ హయాంను రాజన్న రాజ్యం అన్నా, జగన్ని జగనన్న అన్నట్లు, ఎవరు అధికారంలో వున్నా ఆ రాష్ట్ర ప్రజలందరికీ అన్న వరుస అని జీవో తెచ్చేస్తారేమో!

సరే, పేర్లదేముంది లెండి, రేపు వేరేవాళ్లు అధికారంలోకి రాగానే యీ పేర్లన్నీ చెరిపేసి, కొత్త పేరు రాస్తారు. ... ‘అన్న’ అనేది మాత్రం చెరపకుండా వుంటే పెయింటు ఖర్చు కలిసి వస్తుంది. బిసి, దళిత, మైనారిటీల కోసమే మా ప్రభుత్వం వంటి స్లోగన్లూ చెరపనక్కరలేదు. నాయకుల దృష్టిలో వాళ్లే ఓటర్లు, వాళ్లే మనుష్యులు.. తక్కినవాళ్లు ఏ గంగలో కలిసినా ఫరవాలేదు.

రాష్ట్రానికి వస్తున్న ఆదాయం చూడబోతే ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2019-20లో 1.62 లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే 1.18 లక్షల కోట్లు మాత్రం వచ్చింది. 2021 మార్చి నాటికి 18 వేల కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ వుంటుందనుకుంటే కాగ్ రిపోర్టు ప్రకారం 2020 నవంబరు నాటికే 58 వేల కోట్లయింది. కొత్త బజెట్‌లో రైతులకు ఉపయోగపడే మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీముకి బజెట్‌లో యిచ్చినది రూ. 500 కోట్లు. కరోనాపై పోరుకి కేటాయించినది వెయ్యి కోట్లు. కాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కై గత సంవత్సరం ఖర్చు పెట్టినది 19 వేల కోట్లు మాత్రమే, యిది కేటాయించిన దానిలో 60శాతం. ఈసారి బజెట్‌లో 48 వేల కోట్ల రూ.లు అంటే 20శాతం కేటాయించినది దేనికంటే 22 నగదు బదిలీ పథకాలకు! జగన్ ప్రాధాన్యత ఏమిటో యిక్కడే స్పష్టంగా తెలుస్తోంది. దీర్ఘకాలిక మౌలిక వసతులు కాదు, యీ రోజు బిస్కట్ల పంపిణీ మాత్రమే. ఈ గణాంకాల గురించి మరీ స్తనశల్యపరీక్ష చేయకండి. ఈ వ్యాసం పూర్తయేలోపునే మరో పథకం వచ్చేసి, అప్పు యింకా పెరిగిపోవచ్చు.

సంక్షేమ పథకాల వలన డబ్బు సరఫరా పెరిగి, వస్తూత్పత్తి పెరుగుతుందన్న వాదన నిజమే, కానీ వాళ్లు స్థానికంగా ఉత్పత్తి అయినవి మాత్రమే కొంటారన్న గ్యారంటీ ఏముంది? అసలు ఏ ఉద్దేశంతో డబ్బిస్తున్నారో దానికే ఖర్చు పెడుతున్నారన్న ష్యూరిటీ ఏముంది? వచ్చిన డబ్బంతా తాగుడుకే ఖర్చు పెడుతున్నారేమో! ఆంధ్రలో మద్యం ధరలు ఎక్కువ కాబట్టి వీళ్లు ఎన్ని పథకాలు పెట్టినా సరిపోవటం లేదు. ‘మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఎందుకు బాగా ఆడాయో తెలుసా? అమ్మ ఒడి పథకం డబ్బులన్నీ ఖాతాలోకి నేరుగా వచ్చిపడ్డాయి. దాంతో బట్టల దుకాణాల్లో సేల్స్ పెరిగాయి, ఓ మాదిరి సినిమాలూ ఆడేశాయి.’ ‘కరోనా టైములో కూడా మా చర్చికి విరాళాలు పెరిగాయంటే దళారీ బెడద లేకుండా అందరికీ పూర్తి డబ్బు చేరడమే..’ అనే వ్యాఖ్యలు వింటూ వుంటే నవ్వాలో, ఏడవాలో తెలియదు. పథకం ఉద్దేశం ఏమిటి? ఖర్చవుతున్న విధానమేమిటి?

ఈ మధ్య మోదీ సర్కారు ఈ-రుపీ అనే చక్కని స్కీము పెట్టింది. ఎరువుల సబ్సిడీ, ఆయుష్మాన్ భారత్ వంటి చెల్లింపులకై డిజిటల్ ఓచర్లు వస్తాయి, డబ్బు కాదు. ఆ కూపన్లను లక్షిత ప్రయోజనాలకే వాడాలి. లేకపోతే పనికి రావు. అన్ని సంక్షేమ పథకాలకూ యిలాటి స్కీము పెట్టాలి. డబ్బిచ్చి బియ్యం కొనుక్కో అనే బదులు నీ పేరన షాపులో 25 కిలోల బియ్యానికి డబ్బిచ్చేశాం. కూపను చూపించి తీస్కో అనాలి. అయినా పథకాల వలనే గెలుస్తున్నాం అనుకుంటూ పోతే వాటి జాబితా పెరుగుతూ పోతుంది. కెసియార్ అన్ని స్కీములిచ్చారు కాబట్టే 2018 అసెంబ్లీ గెలిచారన్నారు, మరి 2019 పార్లమెంటు ఎన్నికలలో 17 సీట్లలో 9 మాత్రమే గెలిచాడేం? ఇన్ని స్కీములున్నా యిప్పటికీ కాన్ఫిడెన్సు లేదు. హుజూరాబాద్ ఉపయెన్నిక అనగానే భయపడిపోయి కొత్తగా దళితబంధు పథకం పెట్టాడు. గోరంట్ల రాజీనామా చేసి రేపు రాజమండ్రి రూరల్ లో ఉపయెన్నిక వస్తే జగన్ అక్కడ ఏ కులం ఎక్కువుందో చూసి, వాళ్లకో పథకం పెట్టేస్తాడు. ఆదాయంలో యింత భాగం సంక్షేమానికి, యింత అభివృద్ధికి అని పెట్టుకుంటే దానిలోనే సర్దుకోవాల్సి వస్తుంది. అలాటి పరిమితే లేదు కాబట్టే వారానికి రెండు స్కీములు,  వాటి గురించి ఫుల్ పేజీ యాడ్స్!

పేదవాళ్లకిచ్చే పథకాల మీద పడి ఏడుస్తున్నాడు వీడు అనుకోకండి. నా ఏడుపులు చాలా వున్నాయి. వైయస్సార్ లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ ఎవార్డు పేర ఏటా 100 మందికి ఒక్కోరికి  10 లక్షలా? అంటే ఏటా 10 కోట్లా? సంస్థలకు పదేసి లక్షలంటే అర్థముంది. వ్యక్తులకు కూడా అంతేసి యివ్వడమా? పోనీ వాళ్లేదో ప్రతిభావంతులు కాబట్టి అనుకోవచ్చు. రమ్య కేసులో చూడండి, ప్రేమలో పడి మోసపోయి హత్యకు గురైతే ఆమె కుటుంబానికి రూ. 10 లక్షలా? ఆమె సమాజానికి చేసిన సేవేమిటి? ఒక దుర్మార్గుడితో ప్రేమలో పడడమా? హత్యకు గురి కావడమా? ఇదే ఒరవడి ఐతే, విఫలప్రేమతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలు వాటినీ హత్యలుగా చిత్రీకరిస్తారు. స్టెరిలైట్ సమయంలో మృతుల కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయలిచ్చి, కంపెనీ దగ్గర్నుంచి వసూలు చేస్తామన్నారు. చేశారో లేదో తెలియదు. అంత యివ్వడం కనీవినఎరగం. మేం యివ్వం అని కంపెనీ పేచీ పెట్టవచ్చు. రమ్య డబ్బు కూడా హంతకుడి నుంచి వసూలు చేసి యివ్వండి, అంతే కానీ టాక్స్ పేయర్స్ మనీ లోంచి కాదు. అయినా అవన్నీ చూసుకోవడానికి కోర్టులున్నాయి. మధ్యలో ప్రభుత్వానికేం పని?

ఏదో పాతకాలం నాటి రాజుల్లా డబ్బు విరజిమ్మితే ప్రజలు మురిసి ముక్కలవుతారని అనుకోవడం భ్రమ. ఉచితంగా యిస్తే ఏ విలువా వుండదు. బాబు తక్కువ యిచ్చారా, అయినా గెలిపించారా? జగన్ వచ్చి అన్న కాంటీన్లు మూసేస్తే కిక్కురు మన్నారా? అప్పులు చేసి ఎంతకాలం యీడ్చుకు రాగలరు? ఈడ్చుకు రాలేక పథకాలు ఆపేస్తే అప్పుడు ఓటర్లకు కోపం రాదా? పులి స్వారీ ప్రమాదమని అందరికీ తెలుసు. తాజాగా అఫ్గనిస్తాన్‌లో అమెరికా పరిస్థితి చూస్తున్నాం. పథకాలు సమాజంలో కొన్ని వర్గాలకే అందుతున్నాయి. తక్కిన వర్గాలన్నీ పళ్ల బిగువున భారాన్ని భరిస్తున్నాయి. పళ్లూడిపోయే పరిస్థితి వచ్చినపుడు వాళ్లు తిరగబడతారు. పథకాలతో కోతతో యిప్పటిదాకా లబ్ధి పొందినవారూ అసంతృప్తి చెందుతారు. మీకిచ్చే పథకాలను బాబు ఆపించేశాడు అని ఎంత ప్రచారం చేసినా, జగన్ మితిమీరి అప్పులు చేసి యీ తిప్పలు తెచ్చుకున్నాడు అని సామాన్యుడికీ అర్థమౌతుంది.

ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)