ఆసుపత్రులను కట్టడి చేస్తే..?

ప్రయివేటు ఆసుపత్రుల ఫీజుల దందా అంటూ కోర్టు మొట్టికాయలు మొడుతుంది. అదే ఆసుపత్రులను కట్టడి చేస్తే, వాళ్లు పేషెంట్లను చేర్చుకోము అని బోర్డులు పెడతారు. ఆ బోర్డులను మీడియా ఫ్రంట్ పేజీలో వేసి, ప్రభుత్వం వేధిస్తోంది అని వార్తలు రాస్తుంది. మరి అలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలి.

కరోనా టైమ్ లో మానవత్వం అన్నది మరిచిపోయాయి ఆసుపత్రులు. ఫ్రంట్ లైన్ వర్కర్లు, వైద్య సిబ్బంది అని వేనోళ్ల పొగడడం వరకు ఓకె. కానీ ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం పేషెంట్లను పీల్చి పిప్పి చేస్తున్నాయిస. ప్యాకేజీల కింద ట్రీట్ మెంట్లు చేస్తున్నాయి. టెస్ట్ లకు ఓ యూనిఫారమ్ రేటు అంటూ లేదు. కోవిడ్ ప్రోటోకాల్ పరిక్షల విషయంలో ల్యాబ్ లు విపరీతంగా దోచుకుంటున్నాయి. 

ఇవన్నీ నిజానికి ప్రభుత్వం కట్టడి చేసే ప్రయత్నం చేయవచ్చు. కానీ అప్పుడు ఇవే ఆసుపత్రులు, ల్యాబ్ లు సహాయ నిరాకరణకు దిగుతాయి. దాంతో ప్రభుత్వంపై మీడియా విమర్శలు మొదలవుతాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కోర్టులు వేసే మొట్టికాయలకు ప్రభుత్వాలు తలవంచాల్సి వస్తుంది.

దీనికి ఒకటే పరిష్కారం దేశంలో మెడికల్ ఎమర్జెన్సీ విధించడం. ఫార్మా కంపెనీలు, ఆసుపత్రులు, ల్యాబ్ లు అన్నీ ప్రభుత్వాల పర్యవేక్షణలోకి తీసుకోవడం. ఇది కేంద్రం వల్లనే సాధ్యం అవుతుంది. కానీ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వైద్య వ్యాపారం మూడు కేసులు, ఆరు లక్షలు అన్నట్లు సాగిపోతోంది. సీరియస్ కోవిడ్ కేసు అంటే చాలు అయిదు లక్షల నుంచి పదిహేను లక్షలు పిండేస్తున్నారు.

మీడియాకూ ఆసుపత్రులతో అవసరాలు వుంటాయి కాబట్టి, ఆ దిశగా వార్తలు రాయకుండా, ప్రభుత్వాల మీదే సదా వార్తలు వండి వారుస్తున్నారు. కోర్టులు కూడా ఆసుపత్రుల బిల్లల మీద ఓ విచారణ కమిటీ వేస్తే  పరిస్థితి వేరుగా వుంటుందేమో?