జ‌గ‌న్ స‌ర్కార్ లెక్క త‌ప్పింద‌న్న‌ హైకోర్టు

క‌రోనా లెక్క‌ల‌పై ఇంత కాలం తెలంగాణ స‌ర్కార్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తడాన్ని చూశాం. ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఇంచుమించు అదే ప‌రిస్థితి జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురైంది. 

క‌రోనా లెక్క‌ల‌పై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైద్యం స‌రిగా అందలేదంటూ సామాజిక కార్య‌క‌ర్త తోట సురేశ్‌బాబు , ఏపీసీఎల్ఏ వేసిన పిల్‌పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కార్ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఏపీలో ఆక్సిజ‌న్ కొర‌త లేద‌ని మొన్న అఫిడ‌విట్‌లో పొందుప‌రిచార‌ని, ఇప్పుడు ఆక్సిజ‌న్ బెడ్లు ఖాళీ లేవ‌ని నోడ‌ల్ అధికారులే చెబుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వ అఫిడ‌విట్‌లో లెక్క‌ల‌కు, వాస్త‌వ ప‌రిస్థితికి పొంత‌న లేద‌ని అభ్యంత‌రం తెలిపింది.

కరోనా నియంత్రణకు రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలను ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సంద‌ర్భంలో ఏపీలో క‌రోనా సెకెండ్ వేవ్‌, అందిస్తున్న వైద్యం వివ‌రాల‌ను అమికస్‌క్యూరీ న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏపీలో బెడ్స్ ఏ మాత్రం అందుబాటులో ఉన్నాయి, ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఫీజుల దందాపై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.