దేశంలో ప‌రిస్థితి అల్ల‌క‌ల్లోలంగా...

క‌రోనా సెకండ్ ఉధృతిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆందోళ‌న వ్యక్తం చేసింది. ఈ సంద‌ర్భంగా దేశంలో క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌పై కీల‌క కామెంట్స్ చేసింది. ‘దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోంది. నేషనల్‌ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది’’ అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచార‌ణ‌లో భాగంగా వైరస్‌ కట్టడికి జాతీయ ప్రణాళిక అవసమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయ‌ప‌డింది. ఈ సంద‌ర్భంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

24 గంటల్లో 3.14 లక్షల కేసులతో మ‌న దేశం కోవిడ్ వ్యాప్తిలో  ప్రపంచ రికార్డు సృష్టించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే గురువారం మాట్లాడుతూ ఈ సమస్యపై స్వీయ విచారణ జరపాలనుకుంటున్నట్లు తెలిపారు.

కోవిడ్ మహమ్మారికి మందులు అందుబాటులో లేని సమయంలో చోద్యం చూడటం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, విధానంపై జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయ‌న‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ను ప్రకటించే అధికారం రాష్ట్రాలకే ఉందని తెలిపారు.

ఢిల్లీ, బోంబే, సిక్కిం, మధ్య ప్రదేశ్, కలకత్తా, అలహాబాద్ హైకోర్టుల్లో కోవిడ్-19 మహమ్మారి సంబంధిత సమస్యలపై విచారణ జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో హైకోర్టులు ప్రజా ప్రయోజనాల కోసం తమ అధికార పరిధిని సరైన విధంగా వినియోగిస్తున్నాయని సీజేఐ జస్టిస్ బాబ్డే అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నదంతా గందరగోళంగా, అయోమయంగా ఉందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

‘దేశంలో ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌ పద్ధతి, లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అం శాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే దీన్ని మేం సుమోటోగా స్వీకరిస్తున్నాం’  అని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే స్ప‌ష్టం చేశారు.  

కరోనా నియంత్రణకు రేపటిలోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని ఆదేశించడం గ‌మ‌నార్హం.  ఈ అంశంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్‌ హరీష్‌ సాల్వేను అమికస్‌ క్యూరీగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నియమించింది. దీనిపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.