క్షీణించిన జ‌య‌ల‌లిత నెచ్చెలి ఆరోగ్యం

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి, ప్ర‌సిద్ధ న‌టి జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ ఆరోగ్యం క్షీణించింది. ఈ విష‌యాన్ని బెంగళూరులోని విక్టోరియా వైద్య‌శాల  వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమెకు ఐసీయూలో ట్రీట్‌మెంట్ ఇస్తున్న‌ట్టు వైద్యులు తెలిపారు. 

శ్వాస సంబంధిత‌, వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న శ‌శిక‌ళ‌ను మొద‌ట బెంగ‌ళూరులోని బౌరింగ్ ఆస్ప‌త్రిలో చేర్చారు. రెండుసార్లు ఆమెకు ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేయ‌గా నెగెటివ్ వ‌చ్చింది. అయితే ఆ ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్ లేక‌పోవ‌డంతో మెరుగైన వైద్యం కోసం శ‌శిక‌ళ‌ను విక్టోరియా వైద్య‌శాల‌కు త‌ర‌లించారు. 

అక్క‌డ సీటీ స్కాన్ ప‌రీక్ష‌లో శ‌శిక‌ళ‌కు క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయింది. దీనికి తోడు ర‌క్త‌పోటు, షుగ‌ర్ త‌దితర స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తులు దెబ్బ‌తిన్న‌ట్టు వైద్యులు చెప్పారు.

క‌రోనాతో పాటు ప‌లు ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న శ‌శిక‌ళ ఆరోగ్యం క్షీణించ‌డంతో ప్ర‌స్తుతం ఐసీయూలో ట్రీట్‌మెంట్ అందిస్తున్న‌ట్టు విక్టోరియా వైద్య‌శాల వైద్య నిపుణులు వెల్ల‌డించారు. 

జ‌య‌ల‌లిత అక్ర‌మాస్తుల కేసులో నాలుగేళ్లుగా శ‌శిక‌ళ బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌ణ అగ్ర‌హారం జైల్లో శిక్ష అనుభ‌విస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు  ఆదేశాల మేరకు రూ.10కోట్లు జరిమానా చెల్లించి ఏడాది ముందుగానే ఆమె ఈ నెల 27న‌ విడుదల కాబోతున్నారు.

ఈ త‌రుణంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌డం శ‌శిక‌ళ అభిమానులు, కుటుంబ స‌భ్యుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో శ‌శిక‌ళ విడుద‌ల రాజ‌కీయ ప్రాధాన్యం సంత‌రించుకుంది. అలాంటిది ఇప్పుడు శ‌శిక‌ళ తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌డం త‌మిళ‌నాడులో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా