వాళ్ల అభిమాన‌మే అంద‌రి క‌న్నా ఎక్కువ‌న్న ఎస్పీబీ

ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఏ భాష వారు? అని హిందీ వాళ్ల‌ను అడిగితే అంత తేలిక‌గా స‌మాధానం ఇవ్వ‌లేరు. ఆయ‌న పాట‌లను అభిమానించే ప్రేక్ష‌కులు కూడా ఆయ‌న తెలుగు వ్య‌క్తా, త‌మిళుడా, క‌న్న‌డీగా.. అనే విష‌యాల గురించి గూగుల్ సెర్చ్ చేసుకోవాల్సిందే! బ‌య‌టి వాళ్ల‌ను అంత‌లా క‌న్ఫ్యూజ్ చేశారాయ‌న‌.

చాలా మందికి స‌రిగా తెలియ‌ని అంశం ఏమిటంటే.. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలోని చాలా బ్ర‌హ్మ‌ణ కుటుంబాలు ఇళ్ల‌ల్లో క‌న్న‌డ‌లో మాట్లాడుకుంటాయి. అనంత‌పురం, క‌ర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లోని చాలా బ్ర‌హ్మ‌ణ కుటుంబాలు బ‌య‌ట ఏ భాష‌లో మాట్లాడినా, తెలుగులో పండితులు అయినా.. ఇంట్లో మాత్రం వారి వ్య‌వ‌హారికం అంతా క‌న్న‌డ‌లోనే సాగుతుంది. రాయ‌ల‌సీమ‌లో పాత కాలం నుంచి క‌ర‌ణం ప‌నుల్లో ఉండిన కుటుంబాలు, ఉపాధ్య‌య‌వృత్తిలో కొన‌సాగిన బ్ర‌హ్మ‌ణులు.. ఇలాంటి వారి ఇళ్ల‌లో ఈ త‌రానికి కూడా స్ప‌ష్ట‌మైన క‌న్న‌డ వ‌స్తుంది. ఇళ్ల‌ల్లో క‌న్న‌డ‌లో మాట్లాడుకుంటారు.

ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం కుటుంబం కూడా ఈ త‌ర‌హా కుటుంబ‌మే. జ‌న్మ‌తః క‌న్న‌డ వ్య‌వ‌హారికంగా కొన‌సాగించే కుటుంబంలోనే బాలూ జ‌న్మించారు.  మూలాల వ‌ల్ల అలా క‌న్న‌డ భాష వ్య‌వ‌హారికం అయ్యి ఉండ‌వ‌చ్చు. మిథునం సినిమా ప్రీమియ‌ర్ షో కు ఎస్పీబీ బంధువులంతా హైద‌రాబాద్ లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ కు వ‌చ్చారు. వారంతా క‌న్న‌డ‌లో ముచ్చ‌టించుకోవ‌డం క‌నిపించింది కూడా.

విశేషం ఏమిటంటే.. త‌న‌ను బాగా ఆద‌రించింది క‌న్న‌డ ప్రేక్ష‌కులే అని ఎస్పీబీ అనేక ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. తెలుగు, త‌మిళులు ఏదో త‌క్కువ చేశార‌ని ఆయ‌న చెప్ప‌లేదు. తెలుగు, త‌మిళుల త‌న‌ను త‌మ‌వాడిగా చూసుకున్నార‌ని.. అయితే క‌న్న‌డీగులు ఈ రెండు భాష‌ల‌కు మించి త‌న‌ను ఆద‌రించార‌ని ఎస్పీబీ అనే ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు.

అలాంటి మాట‌ల‌న్నింటినీ క‌లిపి  క‌న్న‌డ సోష‌ల్ మీడియా పేజ్ ల వాళ్లు ఒక వీడియో కూర్చి షేర్ చేశారు. తెలుగులో ఒక యూట్యూబ్ చాన‌ల్ ఇంట‌ర్వ్యూలో కూడా బాలూ ఈ విష‌యాన్ని చెప్పారు. క‌న్న‌డీగులు  త‌న‌ను ఆద‌రించే స్థాయి ఒక మెట్టు ఎక్కువ‌ని ఆయ‌న అన్నారు.

అక్క‌డి స్టార్ హీరోలు ఎస్పీబీని దేవుడిలా కొలుస్తారు! దివంగ‌త విష్ణువ‌ర్ద‌న్ అయితే బాలూకూ మ‌రింత వీరాభిమాని. క‌ళాకారుల‌ను తెలుగు వాళ్లు అభిమానిస్తారు, త‌మిళులు ఉద్వేగ భ‌రితుల‌వుతారు, క‌న్న‌డీగులు అన్ని క‌ళ‌ల‌ల‌నూ కాపాడుకునేంత‌లా ఆద‌రిస్తారు. ఈ ర‌కంగా ఎస్పీబీపై అభిమానం చూప‌డంలో కూడా క‌న్న‌డీగులే ఆయ‌న మ‌న‌సును చూర‌గొన్నారు.