ఎస్పీ బాలు హ‌ర్ట్ అయిన సంద‌ర్భం...

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాలు భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఆయ‌న మిగిల్చిన సుమ‌ధుర పాట‌లు మ‌న‌తోనే ఉన్నాయి. అవి ఎప్ప‌టికీ మ‌న వెంటే ఉంటాయి. బాలు గుండె ఆగిందే త‌ప్ప‌... ఆయ‌న స్వ‌రం కాదు. ఎందుకంటే ఆయ‌న స్వ‌రం అజ‌రా మ‌రం. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎస్పీ బాలు అంటే మృధు స్వ‌భావిగా పేరు. వివాదాల‌కు ఆయ‌న సుదూరం. స‌మ‌స్య వ‌చ్చినా సున్నితంగా , హూందాగా ప‌రిష్క‌రించుకునే నేర్ప‌రిత‌నం ఆయ‌న సొంతం. హీరో కృష్ణ‌తో చిన్న‌పాటి మ‌న‌స్ప‌ర్థ వ‌చ్చిన‌ప్పుడు కూడా ఎలాంటి మ‌ధ్య‌వ‌ర్తిత్వం లేకుండా , త‌న‌కు తానుగా వెళ్లి ప‌రిష్క‌రించుకున్నారు.

అయితే  సంగీత రారాజు ఇళ‌య‌రాజా త‌న‌కు లీగ‌ల్ నోటీసు పంప‌డం ...ఎస్పీ బాలును హ‌ర్ట్ చేసింది. ఈ విష‌యాన్నే త‌నే చెప్పారు. అయితే దాన్ని కూడా మీడియా పెద్ద‌ది చేయ‌వ‌ద్ద‌ని, ప‌రిష్క‌రించుకుంటామ‌ని అప్ప‌ట్లో విన్న‌వించ‌డం ఆయ‌న పెద్ద‌రికానికి నిద‌ర్శ‌నం. మాటను ఎంతో పొదుపుగా వాడే మ‌న‌స్త‌త్వ‌మే సంగీత ప్ర‌పంచంలో ఎదురు లేని గాయ‌కుడిగా ఎస్పీ బాలును నిలిపింది. అలాంటి బాలు బాధ ప‌డిన ఆ సంఘ‌ట‌న గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే.

సంగీత సామ్రాజ్యంలో  ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎవ‌రికి వారు రారాజులే. వీరిలో ఏ ఒక్క‌రూ ఎక్కువ కాదు, అలాగ‌ని త‌క్కువా కాదు. చిన్న విష‌య‌మై ఎస్పీ బాలుతో పాటు ఆయ‌న కుమారుడు చ‌ర‌ణ్‌,  గాయ‌ని చిత్ర,  ఈవెంట్ ఆర్గనైజర్లకు లీగల్ నోటీసులను ఇళ‌య‌రాజా పంపారు. 2017, మార్చిలో బాలు బృందం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా, త‌న పాట‌లు పాడొద్దంటూ ఇళ‌య‌రాజా బాలు ట్రూప్‌న‌కు లీగ‌ల్ నోటీసులు పంపారు. త‌మ‌కు నోటీసులు వ‌చ్చిన‌ విష‌యాన్ని సోషల్ మీడియా ద్వారా బాలు నిర్ధారించారు.

సంగీత కచేరికి సంబంధించి ఎస్పీ బాలు ఓ రేటు చెప్పార‌ని, దానిపై బేరాలు ఆడ‌డం  ఇష్టం లేని ఇళ‌య‌రాజా కొత్త గాయ‌కుల‌తో పాటలు పాడించార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత బాలు త‌న కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎస్పీబీ 50 పేరుతో క‌చేరీకి బాలు ప్ర‌ణాళిక ర‌చించారు. ప్ర‌పంచ సంగీత ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  సింగపూర్, టొరంటో, రష్యా, శ్రీలంక, మలేషియా, దుబాయ్‌తో పాటు మ‌న‌దేశంలోని  పలు చోట్ల  బాలు బృందం ప్రదర్శనలిచ్చింది.  ఇళయరాజా పాటలు కూడా పాడారు.  

కానీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా ఇళ‌య‌రాజా నుంచి బాలుతో పాటు మిగిలిన బృంద స‌భ్యుల‌కు లీగ‌ల్ నోటీసులు అందాయి. తాను కంపోజ్ చేసిన పాట‌లు పాడొద్ద‌ని ఆ నోటీసుల సారాంశం. అంత‌కు ముందు త‌న సంగీత క‌చేరికి బాలు స‌హ‌క‌రించ‌లేద‌ని న‌మ్మ‌డం వ‌ల్లే, ఆ విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకుని , అమెరికా టూర్‌లో త‌న పాట‌లు పాడ‌డానికి వీల్లేదంటూ లీగ‌ల్ నోటీసులు పంపారు. దీంతో ఎస్పీ బాలు హ‌ర్ట్ అయ్యారు.  

ఈ విషయమై త‌న‌తో  నేరుగా మాట్లాడి ఉంటే లీగ‌ల్ నోటీసుల వ‌ర‌కు వ‌చ్చేది కాద‌ని బాలు నొచ్చుకున్నారు. అయితే ఇళ‌య రాజా త‌న‌కు లీగ‌ల్ నోటీసులు పంపారు కాబ‌ట్టి, తాము కూడా అదే విధంగా స‌మాధానం ఇస్తామ‌న్నారు. అందువ‌ల్ల ఈ విష‌య‌మై వివాదం చేయ‌వ‌ద్ద‌ని అప్ప‌ట్లో మీడియాకు బాలు విజ్ఞ‌ప్తి చేశారు.

గ‌తంలో ఎప్పుడూ చెప్ప‌ని అభ్యంత‌రం ఇప్పుడే ఎందుకో అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తన ట్రూప్ ఇక మీద‌ట ఇళయరాజా పాటలు పాడబోదని బాలు స్పష్టం చేశారు.  కానీ త‌మ మ‌ధ్య ఇలాంటి వాతావ‌ర‌ణం  చోటు చేసుకోవ‌డం దురదృష్టకరమ‌ని బాలు వాపోయారు.

ఎస్పీ బాలు భౌతికంగా దూర‌మైన నేప‌థ్యంలో ఆయ‌న‌కు సంబంధించిన అనేక జ్ఞాప‌కాలు మ‌నో నేత్రం ముందు క‌ద‌లాడు తున్నాయి. అందులో భాగంగానే ఇళ‌య‌రాజా, బాలు మ‌ధ్య త‌లెత్తిన చిన్న‌పాటి వివాదం గురించి కూడా త‌ల‌చుకోవ‌డం. ఇలాంటివేవీ కూడా ఎస్పీ బాలు గౌర‌వాన్ని, ప్ర‌తిష్ట‌ను త‌గ్గించ‌లేక‌పోయాయి.

బాలు కూడా ఇలాంటి వాటిని పెద్ద‌వి చేసి చూడా ల‌ని ఏనాడూ భావించ‌లేదు. బాలు గొప్ప‌త‌నం ఏంటంటే .... ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను రాత్రి క‌నే పీడ‌క‌ల‌ల‌గా భావించడ‌మే. అలాంటి గొప్ప వ్య‌క్తిత్వం ఉండ‌డం  సంగీత ప్ర‌పంచంలో శిఖ‌ర స‌మానుడిగా మ‌నంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. అందుకే ఆయ‌న దూర‌మైతే లోకం క‌న్నీళ్లు పెట్టుకుంటోంది.  ఒక మ‌నిషి జ‌న్మ‌కు ఇంత‌కంటే సార్థ‌క‌త ఏముంటుంది? క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌కు ఇదే అక్ష‌ర నివాళి. 

కొరటాల కథ కొట్టేసింది బోయపాటేనా?

పవన్, బాబు ఒకరికి ఒకరు