ఎమ్బీయస్ : నెరజాణ కథలు చెప్పే నీతి

ఈ కథలు చెప్తున్నపుడు వీటి ద్వారా సమాజానికి ఏం చెప్తున్నావని చాలామంది అడిగారు. ఏం చెప్తున్నానో వారికి ఎందుకర్థం కాలేదో నాకు బోధపడలేదు. చెప్పేది సూటిగానే చెప్పాను – భార్యలను బాగా చూసుకోండి, తిండీ బట్టా, డబ్బూ మాత్రమే కాదు, శారీరక సుఖం కూడా అందించండి. లేకపోతే కుకోల్డ్ అయిపోతారు జాగ్రత్త అని. ఈ కథలు ఏడు శతాబ్దాల క్రితం రాసినవి. ఈ కథలన్నిటిలో మొగుళ్లు మతపరం గానో, అనుమానం కొద్దో, ఆసక్తి లేకనో భార్యలను దూరం పెట్టారు. అందుకే భార్యలు తెగించారని గమనించండి.

తెగించారనే పదం ఎందుకు వాడానంటే, యిప్పటికీ అక్రమసంబంధాల విషయంలో మహిళలకే ఎక్కువ రిస్కు. తప్పు యిద్దరూ సమానంగా చేసినా గర్భధారణ ద్వారా ప్రకృతి స్త్రీ గుట్టే బయటపెడుతుంది. మగవాడిలో ఏ మార్పూ వుండదు. సమాజమూ మొగాడికి కన్సెషన్ యిచ్చేస్తుంది. దీనికైనా బుద్ధి వుండద్దా, మదమెక్కి కొట్టుకుంటోంది అని సాటి మహిళలే యీసడిస్తారు. ఇప్పుడే యిలా వుంటే, ఆ మధ్య యుగాల్లో సమాజం స్త్రీ పట్ల మరీ నిర్దయగా వుండేది. చట్టపరంగా కఠిన శిక్షలుండేవి. సజీవదహనం చేసేవారు. రాళ్లతో కొట్టి చంపేవారు. అయినా రిస్కు తీసుకుని వారు వేరేవారితో సంబంధం పెట్టుకున్నారంటే వారి శరీరం ఆ అవసరం కోసం ఎంతగా తపించిందో అర్థం చేసుకోవాలి.

ఎందుకీ తాపం అంటే ప్రకృతి శక్తి అలాటిది. మానవులమే కాదు, పశుపక్ష్యాదులు కూడా ప్రకృతికి ఎదురీదలేము. మన శరీరనిర్మాణమే దానికి లోబడి వుంటుంది. అది తెలుసుకుని సామాజిక నియమాలు, న్యాయసూత్రాలు ప్రకృతికి అనుగుణంగా రూపొందించాలి. భార్య పోయిన విధురుడు మళ్లీ పెళ్లాడవచ్చు కానీ, భర్త పోయిన విధవ పెళ్లాడకూడదు అని పిచ్చి నియమం పెడితే రండాగర్భాలు, భ్రూణహత్యలు పెరిగాయి. ఆస్తి కోసమో, కన్యాశుల్కం కోసమో, వధువు కంటె రెట్టింపు వయసు ఉన్నవాణ్ని యిచ్చి పెళ్లి చేస్తే ఆమె కొన్నాళ్లకు పక్కదారులు పట్టేది.

సమాజసంస్కర్తలు యివన్నీ గమనించి, సరిదిద్దుకుంటూ వచ్చారు. కొన్ని తరాలకు యుక్తవయసులో వివాహాలయ్యే పరిస్థితి వచ్చి సమాజం మెరుగు పడుతూ వచ్చింది. కానీ యిటీవల యువతీయువకులు సమాజపు కట్టుబాట్ల వలన కాకుండా చేజేతులా జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఏ సెక్స్ సర్వేనైనా చూడండి, గత ఏభై ఏళ్ల క్రితం భార్యభర్తల మధ్య సాగిన శృంగారకలాపం కంటె యీ తరం శృంగారకలాపం చాలా తక్కువని చెప్తోంది. నెలలో ఎన్నిసార్లు కలుస్తున్నారో, ఎంతసేపు భోగిస్తున్నారో గణాంకాలు గమనిస్తే అయ్యోపాపం అనిపిస్తోంది. మగవాళ్లలో వీర్యకణాలు తగ్గిపోతున్నాయి, నీరసిస్తున్నాయి, అందుకే సంతానసాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా మొలుచుకు వస్తున్నాయి. సహజంగా జరగవలసిన శిశుజననం లక్షలతో కూడుకున్న వ్యవహారమై పోయింది.

ఇదంతా ఎందువలన అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్లడం వలననే! రతిసుఖం అనుభవించేందుకు ప్రకృతి వయోపరిమితిని విధించింది. 35, 40 ఏళ్లకు మించి ఆ సామర్థ్యం వుండదు. ఆ వయసుకి ముందు తొందరపడినా, వయసు తర్వాత తాపత్రయపడినా ప్రకృతికి ఎదురీదినట్లే, అది అనర్థదాయకం. యుక్తవయసు వచ్చినా వివాహమాడకుండా, జీవితంలో స్థిరపడ్డాకనే పెళ్లి చేసుకుంటానంటూ వాయిదా వేయడంతో ఎంతో హాని జరుగుతోంది. 50 ఏళ్ల క్రితం మగవాళ్లు 18 ఏళ్లకే పెళ్లాడేవారు, 40 ఏళ్ల క్రితం 22 ఏళ్లకు పెళ్లాడారు. 25 ఏళ్ల క్రితం 26 ఏళ్లకు, గత 15 ఏళ్లగా 30 ఏళ్లకు పెళ్లాడుతున్నారు. 28 ఏళ్లు వచ్చేదాకా పెళ్లికూతుళ్లనే చూడడం లేదు. అంటే తమ పూర్వీకులతో పోలిస్తే వీళ్లకు శయ్యాసుఖం 12 ఏళ్లు తగ్గిపోయినట్లేగా! ఎందుకంటే ప్రకృతి మేటింగ్ కెపాసిటీ ఎక్స్‌పైరీ ‌డేటు ఎక్స్టెండ్ చేయలేదు. అదే వుంచింది.

18 ఏళ్లకు పెళ్లి చేసుకునే రోజుల్లో పెళ్లి చేసుకుని, యిద్దరూ కలిసి కష్టపడుతూ కావలసినవి ఒక్కొక్కటి అమర్చుకునేవారు. నలుగురైదుగురు పిల్లల్ని కని, పోషించేవారు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. ఇద్దరు కూడా ఎందుకు, ఒక్కళ్లే చాలనుకుంటున్నారు. ఆ పిల్లనో, పిల్లవాడినో పోషించడానికి తను (చాలా సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి) సంపాదించేది చాలదనే అనవసరపు భయం పట్టుకుని జీతం ఒక స్థాయికి వచ్చేవరకు పెళ్లి మాట తలపెట్టటం లేదు. ఇల్లు అమర్చుకుని, కారు కొనుక్కుని, అవి చూపించి కాబోయే వధువుని యింప్రెస్ చేద్దామనుకుంటున్నారు. కానీ ఆమెకు వీటితో బాటు మరొకటి కూడా కావాలని యీ కథలు నొక్కి వక్కాణిస్తున్నాయి.

పెళ్లికొడుకులే కాదు, పెళ్లికూతుళ్లు కూడా వైవాహిక బంధంలో తమకేవి కావాలో తెలుసుకోలేక పోతున్నారు. వరుడికి ఇల్లు, కారు, అమెరికా వెళ్లే ఛాన్సు, ప్రమోషన్లు తెచ్చుకునే నేర్పు, తలిదండ్రులను దూరంగా పెట్టే నిర్దయ వగైరా వున్నాయా లేదా అని చూస్తే సరిపోదు. శారీరకసౌఖ్యమనేది వివాహం నిలబడడానికి అవసరమైన ముడిసరుకు అనే గ్రహింపు వుండాలి. వివాహంలో కాంజుగల్ బ్లిస్ (లైంగిక సుఖం) చాలా ముఖ్యం, అది లేదని నిరూపిస్తే కోర్టు వివాహాన్ని రద్దు చేసి విడాకులు యిప్పించేస్తుంది. భర్త ఉన్నతోద్యోగం చేస్తున్నాడని సరదా పడడంతో బాటు, అతను ఉద్యోగానికి సంబంధించిన వర్రీలను పడకగదికి తీసుకుని వచ్చి చతికిలపడతాడేమోనన్న దిశలో కూడా ఆలోచించాలి.

డబ్బుంటే చాలు, అన్నీ అవే అమరుతాయి అనుకోవడం అవివేకం. సూక్తి వుంది, మంచం కొనగలవు కానీ నిద్రను కొనలేవు. బ్రెడ్ కొనగలవు కానీ ఆకలి కొనలేవు అంటూ..! అలా మంచం గించం అన్నీ జబర్దస్త్‌గా ఉన్నా అసలైన సుఖం దక్కాలి. అది పూర్తిగా వ్యక్తిగతమైనది, అది తీరకపోతే జీవితంలో పెద్ద లోటే! పెళ్లికి ముందు దాని గురించి స్పృహ వుండటం లేదు. అందుకే అనుకున్న స్థాయిలో ఇల్లు, కారు, జీతం అన్నీ అమరినా, వైవాహిక బంధాలు నిలవటం లేదు. భార్యాభర్తలు విడిపోవడానికి డబ్బే కారణం కావటం లేదు. కాపురంలో అసంతృప్తి, అహంకారం ముఖ్యమైన కారణాలవుతున్నాయి.

గతంలో అయితే చిన్నపుడే పెళ్లయి వాళ్లిద్దరి మధ్య అనుబంధాలు గట్టిపడేవి. ఇప్పుడా అవకాశం లేదు. ప్రత్యేక వ్యక్తిత్వాలు పూర్తిగా రూపు దిద్దుకుని, దాదాపు 30 ఏళ్ల ఒంటరి జీవితానికి అలవాటు పడి, అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. రతిలో తృప్తి పడితే ఒకరిపై మరొకరికి యిష్టం పెరిగి, అహంకారం అదుపులో వుంటుంది, కాపురం నిలబడే అవకాశం మెరుగవుతుంది. అది యువతీయువకులు ఎందుకు గ్రహించటం లేదో నాకు అర్థం కాదు. అమెరికాలో దంపతులు వేర్వేరు రాష్ట్రాలలో ఉద్యోగాలు చేయడం నాకు బోధపడదు. ఎంత? జస్ట్ మూడు గంటలు ఫ్లయిట్ టైమంతే అంటారు. కానీ  ఈ వూళ్లో, ఆ వూళ్లో ఎయిర్‌పోర్టుకి వెళ్లడానికి, అక్కణ్నుంచి తిరిగి రావడానికి టైము పడుతుంది కదా. వీకెండ్స్‌లో మాత్రమే భార్యాభర్తా కాస్త సమయం గడపడానికి వీలు చిక్కుతుంది.

అది కూడా రోజంతా కాదు, కలిసి వున్న సమయంలోనే యిల్లు సర్దుకోవడాలు, సినిమాకి, ఫ్రెండ్స్ యిళ్లకు, దగ్గర్లో వున్న పిక్నిక్ స్పాట్‌కు వెళ్లడాలు అన్నీ చేసుకోవాలి. పైగా ప్రయాణపు బడలిక వలన త్వరగా అలసిపోతారు. ఇద్దరూ ఒక చోటే వుంటే లభించే అవకాశాలలో మూడో వంతు కంటె తక్కువ అవకాశాలే దక్కుతాయి కదా. పైగా వారంలో ఐదు రోజులు దూరంగా వుండడంతో అనుమానాలు కలుగుతూంటాయి. అమెరికా లాటి వాటిల్లో డివోర్స్ కారణంగా ఒంటరిగా వుండే ఆడామొగా ఎక్కువమంది వుంటారు కాబట్టి, ఎవరి సంగతి ఎవరూ పట్టించుకోరు కాబట్టి సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఎవరైనా కొలీగ్ గురించి కాస్త బాగా చెపితే చాలు, భార్య, లేదా భర్తకు అనుమానపు పురుగు మెదడులో ప్రవేశిస్తుంది. ఇక అక్కణ్నుంచి ఫోన్ చెక్ చేయడాలు, సడన్‌గా వూరెళ్లి చూడడాలు.. యిలాటివి ప్రారంభమౌతాయి. అక్కణ్నుంచి కాపురంలో బీటలు.

నాకు తెలిసి చాలామంది కాపురాలు యిలాగే విచ్ఛిన్నమయ్యాయి. ఎందుకలా విడివిడిగా వుండడం అని యింట్లో పెద్దలు అడిగితే, ‘డబ్బు సంపాదించే అవకాశం వున్నపుడు సంపాదించుకోకపోతే రేపు పిల్లల్ని పోషించడం ఎలా?’ అంటారు. అసలు కాపురమంటూ నిలబడితే కదా, పిల్లలూ, మనుమలూ! డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా వుంటే, అత్యాశలకు పోకుండా బజెట్ వేసుకుని ప్లాన్ చేసుకుంటే, వృద్ధాప్యంలో కూడా డబ్బు గురించి చింత పడకుండా, ఓహో అని కాకపోయినా, బాగానే బతికేయవచ్చు. డబ్బు కోసం యవ్వనాన్ని ధారపోస్తే వయసు తిరిగిరాదు. అప్పుడు డబ్బు యివ్వవలసినంత ఆనందాన్ని యివ్వదు.

పెళ్లంటూ చేసుకున్నాక భార్యాభర్తా కలిసి వుండాలి. కలిసి సుఖించాలి. ఆర్థిక కారణాల చేత, లేదా కలహాల చేత విడివిడిగా వుంటే సమాజానికి కూడా చేటు. అనేకమంది గ్రామాల్లో జరుగుబాటు లేక, నగరాలకు వస్తారు. భార్యను వెంట తెచ్చుకునేటంత ఆదాయం వుండదు. నగరంలో తిండికి, నివాసానికి లోటు లేకపోయినా పడకసుఖం లేక అల్లాడుతారు. వీళ్ల కోసమే వేశ్యావాటికలు వెలుస్తాయి. వీళ్లు నిరంతరం ఆవురావురుమని వుంటారు కాబట్టి ఎవరైనా అబలలు దొరికితే బలాత్కారాలు చేస్తారు. నిర్భయ కేసులో నిందితులు అలాటివారే.

కరోనా సందర్భంగా వలస కార్మికుల స్థితిగతులు దేశం దృష్టికి వచ్చి, వారి కోసం నగరాల్లో యిళ్లు కట్టి అద్దెకిస్తామంటున్నారు. అది జరిగితే వాళ్లు కుటుంబాలతో వుండే అవకాశాలు పెరిగి, మానభంగాల కేసులు తగ్గుతాయి. వలస కార్మికులకైతే వేరే దిక్కు లేక భార్యలకు దూరంగా వుంటున్నారు. మరి చదువుకుని, బాగా ఆర్జిస్తూ అమెరికాలో వున్నవారు విడివిడిగా వుండడంలో ఏమర్థం వుంది?

యుక్తవయసు వచ్చినా ఒంటరిగా వుండడంతో పోర్నో చూడడం పెరుగుతోంది. లాక్‌డౌన్ సమయంలో పోర్నో సైట్లు విపరీతంగా డిమాండులో వున్నాయట. అవి భార్యాభర్తల మధ్య కామప్రేరకాలుగా వుంటే ఫరవాలేదు కానీ వాటిని చూసి వికృతమైన ఆలోచనలు తెచ్చుకుంటే, ప్రకృతివిరుద్ధమైన, అసహజమైన పద్ధతులకు ఎగబడితే అవి చేసే హాని అంతాయింతా కాదు. వాటిని చూసి, నిజమనుకుని భ్రమించి, అసంతృప్తి పెంచుకునేవారు కొందరుంటున్నారని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిని చూడడంలో ఆనందం పెరిగిపోయి పక్కన జీవిత భాగస్వామి వున్నా భౌతికంగా అనుభవించకుండా, సెక్స్ జోక్స్ ఎంజాయ్ చేసే దుస్థితి వస్తోందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. నిజానికి అర్ధరాత్రి తర్వాత కూడా సెల్‌ఫోన్ ఆపరేట్ చేసే దంపతుల గురించి ఏమనుకోవాలో పూర్వతరాలకు బోధపడటం లేదు. ఈ టైములో వేరే పనిలో వుండవలసినవారు కదా అనుకుంటున్నారు.  

శృంగారం ఆడామగా మధ్య జరిగేదే అయినా చొరవ తీసుకోవలసినది మగవాడే. స్త్రీ శరీరనిర్మాణం ప్రకారం ఆమె సన్నిద్ధం కావడానికి పెద్దగా శ్రమ అక్కరలేదు. కానీ మగవాడి పరిస్థితి అది కాదు. కర్త అతనే కాబట్టి, దానికి తగిన శరీరాకృతి, ఆరోగ్యం, చురుకుదనం, మానసికోల్లాసం సమకూర్చుకో వలసిన బాధ్యత అతనిదే. భార్యను తృప్తి పరచడం అతని విధి, కర్తవ్యం. దానిని అతను ఏ కారణం చేత ఎగ్గొట్టినా, వాయిదా వేసినా, అండర్ పెర్‌ఫామ్ చేసినా భార్యకు కలిగే అసంతృప్తి విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. అది వారి కుటుంబంలో చిచ్చు రగల్చడమే కాదు, మరొకరి కుటుంబాన్ని కూడా దెబ్బ తీస్తుంది.

సంతృప్తి పడని స్త్రీ అనేక ప్రమాదాలు తెచ్చిపెడుతుందని గ్రహించిన భారతీయులు శృంగారం గురించి దంపతుల్లో అవగాహన పెంచడానికి ఎంతో కృషి చేశారు. దేవాలయాలు సాంస్కృతిక నిలయాలు కాబట్టి, ప్రజలందరూ గుమిగూడే స్థలాలు కాబట్టి అక్కడ శృంగార భంగిమలను శిల్పాలుగా చెక్కారు. కామసూత్రను జనులందరూ చదవదగిన పుస్తకాలలో చేర్చారు. పురాణాల్లో, కావ్యాలలో, ప్రబంధాల్లో శృంగారాన్ని విస్తృతంగా వర్ణించారు. బ్రిటిషు వాళ్లు వచ్చాకనే వాటిపై నిషేధాలు ప్రారంభమయ్యాయి.

క్రైస్తవం శృంగారాన్ని చూసే దృక్కోణం వేరు. వారు దాన్ని పాపిష్టి పనిగా చూస్తారు. మనం ఒక యజ్ఞంగా చూసి, ముహూర్తాలు పెట్టి, పదిమందికి తెలిసేట్లా శోభనకార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అనేక దేశాల్లో క్రైస్తవం వ్యాపించే ముందున్న ఆచారాలు భిన్నంగా వుండడం చేత అన్ని దేశాలలోనూ శృంగారం పట్ల ఒకే లాటి దృక్పథం లేదు. ఇంగ్లీషు వాళ్లలో చాదస్తం ఎక్కువ. ముఖ్యంగా విక్టోరియన్ ఎరాలో. అప్పట్లో డైనింగ్ టేబుల్ కాళ్లు కూడా నగ్నంగా కనబడకూడదని వాటికి తొడుగులు తొడిగేవారని చదివాను. అబ్బే, అది అతిశయోక్తి అని యీ మధ్య అంటున్నారు. ఏది ఏమైనా వాళ్లకు పట్టింపులు ఎక్కువ అన్నది ఖచ్చితం. ఉదాహరణకి బ్రిటిషు హయాంలో ‘‘రాధికా సాంత్వనం’’ అనే తెలుగు శృంగారప్రబంధాన్ని నిషేధించారు. అది  తొలిసారిగా రాసినప్పుడు రాజాస్థానంలో వందలాది మంది ఎదుట రచయిత్రి ముద్దుపళని చదివి వినిపించి, హర్షధ్వానాలు అందుకుంది. అదీ మన వారసత్వం.

ఈ వారసత్వానికి ప్రతినిథులం మనం. శృంగారాన్ని చదవడానికి, చర్చించడానికి మొహమాట పడకూడదు. భర్త చేత సుఖం పొందలేక పరకీయలైన స్త్రీల గురించిన అంశానికి వస్తే, అలాటి వారి గురించి అనేక జానపద గీతాలున్నాయి. హాలుడి గాథాసప్తశతిలో కథలున్నాయి. శుకసప్తతి కథలు కేవలం యీ సబ్జక్ట్ మీదే రాసిన 70 కథలు. అందువలన యీ అంశంపై రాసి నేను మైల పడిపోయానని అనుకోవటం లేదు.

మీరు చెప్పదలచిన విషయాన్ని యిలాటి ఒక వ్యాసంలో రాసి చెప్పవచ్చు కదా, అలాటి కథల ద్వారా చెప్పడం దేనికి అని కొందరడగవచ్చు. ఏదైనా డైరక్టుగా చెపితే, తలకెక్కదు, జ్ఞాపకం వుండదు. పరుని భార్యను మోహించకు అని వాల్మీకి సింపుల్‌గా ఒక శ్లోకం రాసి వూరుకోవచ్చుగా, పన్నెండు కాండల రామాయణం రాసేడెందుకు? రావణుడు ఎంత గొప్పవాడో వర్ణించి చెప్పి, అలాటివాడు కూడా ఆ బలహీనత వలన నాశనమయ్యాడు చూడు అని మనసుకు నాటుకునేట్లు చెప్పాడు. అలాగే అహంకారం వలన దుర్యోధనుడు నాశనమయ్యాడు చూశావా అని చెప్పడానికి వేదవ్యాసుడు లక్ష శ్లోకాల మహాభారతం రాయవలసి వచ్చింది.  

నేను యీ కథలను రాసేటప్పుడు ఎక్కడా అంగాంగవర్ణన, కామకేళీవిలాసం రాయలేదు, గమనించండి. మీరు మీ భార్యను తృప్తి పరచకపోతే ఆమె ఏ విధంగా ఏమార్చగలదో తెలుసుకోండి అని చెప్పే కథలనే ఎంపిక చేసి చెప్పాను. ఇవి చాలామందికి నచ్చాయి. కొందరు నొచ్చుకున్నవాళ్లూ వున్నారు. బాగానే వున్నాయి కానీ, మీలాటి వారు రాయవలసిన కథలు కావు అని మరి కొందరు అభిప్రాయపడ్డారు. మనిషన్నాక అన్ని రకాలనూ చదవాలి, వీలైతే రాయాలి అని నా నమ్మకం.

ఈ కాలమ్ ద్వారా మీరు ఎక్కువగా నా నాన్-ఫిక్షన్ రచనలనే చూస్తున్నారు కానీ, నేను ఫిక్షన్‌లో పలు రకాల రచనలు చేశాను. వాటిలో శృంగారం కూడా ఒకటి. స్వాతి వీక్లీ నిర్వహించే సరసశృంగార కథల పోటీలో నాకు అనేకసార్లు బహుమతులు వచ్చాయి. ఈ కథలు చదివి నేటి యువతరంలో కొందరైనా తమ ఆలోచనావిధానాన్ని సమీక్షించుకుంటే, వీటి లక్ష్యం నెరవేరినట్లే.

వీటిని వెబ్ సీరీస్‌గా ప్రెజెంట్ చేస్తే చాలామందికి చేరతాయంటూ కొందరు సలహా యిచ్చారు. ఈ కథలు 14 వ శతాబ్దంలో, ఇటలీలో జరిగినవి. వాటిని అప్పటి మన భారతీయవాతావరణానికి అనువుగా మార్చుకోవచ్చు. కథలు చిన్నవి కాబట్టి, కొన్ని సంఘటనలు కలుపుకోవాలి. కథలకు కాపీరైటు లేదు కాబట్టి ఎవరైనా ఆ పని చేయవచ్చు. అయితే సీరీస్‌గా తీసినప్పుడు అశ్లీలత, అసభ్యత, దేహప్రదర్శన లేకుండా చూసుకోవడం అతి ముఖ్యం. పాత్రధారుల జాణతనం, సమయస్ఫూర్తి, చతురసంభాషణలపై ఫోకస్ వుంటూ ఫ్యామిలీతో కలిసి చూసేటట్లు తీయగలగాలి. లేకపోతే సాఫ్ట్ పోర్నోగా తయారై, పైన చెప్పిన ఉద్దేశానికి భిన్నంగా పరిణమిస్తుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
[email protected]