ఎమ్బీయస్: హమ్మయ్య, వాక్సిన్ రాలేదు!

మూడు నెలలుగా ఐసిఎమ్మార్, తెలుగు మీడియా కలిసి చేసిన హడావుడి చూస్తే ఆగస్టు 15 నాటికల్లా వాక్సిన్ పేరుతో ఏదో ఒకటి మన మొహాన కొట్టి చప్పట్లు కొట్టమంటారని హడిలి చచ్చాను. అది జరగనందుకు సంతోషంగా వుంది. నిజమైన వాక్సిన్ వచ్చినపుడే ఆనందంగా వుంటుంది తప్ప పబ్లిసిటీ కోసం యిలా ఉత్తుత్తి వాక్సిన్‌లు జనాల్లోకి వదిలితే ప్రజలకు టీకా ప్రక్రియపై, వైద్యవిధానంపై నమ్మకం సడలిపోతుందనే నా భయాన్ని గతంలోనే వెల్లడించాను.

క్లినికల్ ట్రయల్స్ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఆగస్టు 15కి వాక్సిన్ వెలువడడం అసాధ్యం అని తెలిసినా ఐసిఎమ్మార్, తెలుగు మీడియా బుకాయిస్తూనే వచ్చాయి. చివరకు ఏ కారణం చేతనో బుద్ధి మేల్కొని ఆగస్టు మొదటివారం నుంచి హడావుడి తగ్గించారు. ఆగస్టు 15 గడువు విధించి, అంతర్జాతీయంగా వైద్యుల చేత, శాస్త్రజ్ఞుల చేత ఛీ కొట్టించినందుకు ఐసిఎమ్మార్‌కు కేంద్రం ఏ దండనా విధించకపోవడం చేత, కేంద్రానికి కూడా దీనిలో హస్తముందనే నా సంశయం తీరలేదు.

ఏదిఏమైనా కేంద్రం పబ్లిసిటీ యావ తగ్గించుకుని, వాక్సిన్ పరిశోధనలను వాటిమానాన అవి జరగనిస్తోంది. అంతవరకు సంతోషం. ఆర్నెల్లుగా కోవిడ్ గురించి నానా రకాలుగా బెదరగొట్టిన తర్వాత, యిప్పుడు ప్రభుత్వం దానితో సహజీవనానికి రాజీ పడిపొమ్మని జనాలకు చెప్తోంది. ఇప్పటికే కోట్లాదిమందికి కోవిడ్ వచ్చి వారం పదిరోజులు ఒంట్లో కాపురం పెట్టి, చడీచప్పుడు లేకుండా, ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోయింది అంటోంది. 

ఆ ముక్క వాళ్లు చెప్పడానికి ముందే ఇది ప్రాణాంతకం కాదని జనాలకీ అర్థమై పోయింది. కోవిడ్ కంటె ముందు ఆసుపత్రి బిల్లు కట్టలేక చచ్చేట్లు వున్నామనే భయమే వారిని వెంటాడుతోంది. బిల్లు కట్టడానికి ఎంతోకొంత సొమ్ము సమకూర్చుకోవాలని జనాలు బయటకు వచ్చి ఉద్యోగవ్యాపారాలు మొదలుపెట్టుకున్నారు.

నాకు తెలిసిన సమాచారం ప్రకారం - యిన్నాళ్లకు కోవిడ్‌కు చికిత్స ఎలా చేయాలో వైద్యులు ఒకరి నొకరు సంప్రదించుకుంటూ ఒక పద్ధతిని ప్రస్తుతానికి స్థిరీకరించుకున్నారు. ఐసిఎమ్‌ఆర్ పదేపదే ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్ మారుస్తూ వచ్చినా, చివరకు వైద్యులే తంటాలు పడి ఆ మార్గమేదో తేల్చుకుని దాని ప్రకారం చికిత్స చేస్తున్నారు. ఇతర రోగాలుంటే తప్ప కోవిడ్ కారణంగా మరణించేవారి సంఖ్యను గణనీయంగా తగ్గించారు. పోయినవాళ్లు కూడా ఎందుకు చనిపోయారో పరిశోధనలు చేస్తే తెలుస్తుంది. కానీ వాళ్ల బంధువులు కలిసి రావాలి కదా! పైగా టైముండాలి.

చివరకు ఎలా తయారైందంటే కోవిడ్ అనేది సామాన్యులు హడిలి చావడానికి, కార్పోరేటు ఆసుపత్రులు డబ్బు దండుకోవడానికి సాధనంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రయివేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయని యావత్తు మీడియా కోడై కూస్తున్నా, రుజువులు చూపిస్తున్నా కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవడం లేదు. ఇదేం దుర్మార్గమో, యిదెక్కడి లాలూచీయో అర్థం కావటం లేదు.

ఇక వాక్సిన్ గురించి చెప్పాలంటే యీ రోగం గురించి తెలియగానే వాక్సిన్ ఎక్కడ? అంటూ ప్రజలూ హడావుడి పడితే, ఇదిగో వచ్చేస్తోందంటూ ఫార్మా సంస్థలు హంగామా చేశాయి. చాలా వ్యాధులకు వాక్సిన్ తయారుచేయలేక పోయారన్న సంగతి విస్మరించి, మేధావులతో సహా కోవిడ్ వాక్సిన్‌ గురించి ఏమేమో మాట్లాడారు. ఆర్నెల్లలో వచ్చేస్తుందని కొందరు, అక్టోబరులో వచ్చి తీరుతుందని మరి కొందరు అన్నారు. 

దేశంలో బయోవాక్సిన్‌లకు ఆద్యుడు, ఎన్నో వాక్సిన్‌లకు రూపకర్త, మరి కొన్ని వాక్సిన్‌లు చేద్దామనుకుని చేయలేకపోయిన వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్) ‘అదంత సులభం కాదు, కనీసం రెండేళ్లు పడుతుంది. కొన్ని ఫార్మాలిటీస్ ఎత్తేసి కుదేసినా కనీసం ఏడాదిన్నర తప్పదు’ అని నెత్తీనోరూ కొట్టుకుని మార్చి నుంచి మొత్తుకుంటూనే వున్నారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 2021 మధ్యలో ‘రావచ్చు’ అంటోంది. ఇవాళ మన కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ 2021 ఏప్రిల్ లోపున.. అంటున్నారు.

ఈ లోపుగా వరప్రసాద్‌ను మీడియా వాళ్లు చంపుకుతిన్నారు – ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి చిటికెల పందిరి వేశారు, ముఖ్యమంత్రి ఓస్ అదెంత అన్నారు, హైదరాబాదు వాక్సిన్ కంపెనీ వాళ్లు అతి త్వరలో అరచేతిలో పెట్టబోతున్నారని పత్రికలలో చేంతాడంత వ్యాసాలు వస్తున్నాయి. వీటికేమంటారు?’’ అని. ‘.. నేనేమంటాను? వస్తే ఆశ్చర్యపడతాను, సరైనదే అయితే ఆనందపడతాను కూడా’ అని చెప్పి వూరుకున్నారాయన. వాళ్ల మాతృసంస్థ సనోఫీ, గ్లాక్సో వంటి మరో ఫార్మా దిగ్గజంతో కలిసి అభివృద్ధి చేస్తున్న వాక్సిన్‌ యిప్పటిదాకా మానవప్రయోగాలు మొదలెట్టనే లేదు. మరి ఆయనకు వాక్సిన్‌కు పట్టే సమయం మీద సందేహాలున్నాయంటే వుండవూ!? ఇప్పుడు దాదాపు సెప్టెంబరు మధ్యకి వచ్చాం. వాక్సిన్‌ల పరిస్థితి ఏమిటో ఒక్కసారి చూడండి.

రష్యా వాక్సిన్ స్పుత్నిక్‌-వి ని మూడో దశ పరీక్షలు చేయకుండానే జనాల్లోకి వదిలేశారు. ‘నా కుమార్తెకు యిచ్చాను కాబట్టి ఆ పరీక్షలు అక్కరలేద’నేశాడు పుతిన్. దీని మీద సమీక్ష చేసిన ‘‘ద లాన్సెట్’’ ఇది యాంటీ బాడీలను తయారుచేస్తోంది కానీ 76 మంది మీదే జరిగింది కాబట్టి ఏమీ చెప్పలేమని పియర్స్ వ్యాఖ్యానించారంది. రష్యా వాళ్లది, చైనావాళ్లది డేటా నమ్మడానికి లేదని అంతర్జాతీయ నిపుణులు సందేహిస్తూనే వుంటారు. ఆమెరికా వారి ఎఫ్‌డిఏ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీలు వాక్సిన్‌కు అనుమతి యివ్వడానికి యీ డేటా చాలదంటారు. 

అయినా ఆ రష్యా వాక్సిన్ తయారీకి మేం సహకరిస్తాం అంటూ రెండు, మూడు భారతీయ కంపెనీలు ముందుకు వచ్చాయని నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు వికె పాల్ సంబరపడి పోతున్నారు. ఎవరూ యింకా గట్టిగా నమ్మనిదాన్ని మనం ఎందుకు తయారుచేయాలో, మన భారతీయులపై ప్రయోగాలు ఎందుకు చేయాలో నా కర్థం కాదు. రష్యాకే చెందిన వెక్టర్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ డెవలప్ చేసిన వాక్సిన్ రెండో దశ ప్రయోగాలు పూర్తయ్యాయట. అసలు సమస్యంతా మూడో దశ ప్రయోగాలతోనే! దాని గురించి తర్వాత రాస్తాను.

ప్రపంచం మొత్తం మీద 150 దేశాల్లో వాక్సిన్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నా, నిజానికి యిప్పటిదాకా జనాలు కాస్త ఆశలు పెట్టుకున్నది – అమెరికాకు చెందిన మోడెర్నా వాక్సిన్ ‌మీద, బ్రిటన్ వారి ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ మీద! మోడెర్నా జులై 27 నుంచి మూడో దశ ప్రయోగాలు చేస్తున్నానంటోంది. త్వరలో 30 వేల మీద చేస్తానంటోంది. ప్రస్తుతం ఎంతమంది మీద చేస్తోందో వివరాలు చెప్పటం లేదు. వాళ్లు తయారు చేసే ఎమ్-ఆర్‌ఎన్‌ఏ తరహా వాక్సిన్ యిప్పటిదాకా మనుష్యుల మీద ప్రయోగించబడలేరు. తయారైతే యిదే మొదటిదౌతుంది.

పైగా మోడెర్నాకు వాక్సిన్ తయారీలో అనుభవం లేదు. ఇప్పటిదాకా ఒక్క వాక్సినూ తయారు చేయలేదు. అయినాకానీ వాక్సిను డోసు ధర 32 నుంచి 37 డాలర్లు వుంటుందని, ఏడాదికి 50 కోట్ల డోసులు తయారు చేసేస్తామని చెప్తూ అమెరికన్ కంపెనీ కెటాలెంట్‌తో ఒప్పందం పెట్టుకుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌తో చేతులు కలిపి, అమెరికా ప్రభుత్వం నుంచి 100 కోట్ల డాలర్ల నిధులు కూడా సంపాదించింది.

మోడెర్నా ఇండియన్ కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకోవటం లేదు. ఎందుకంటే ఆ తరహా వాక్సిన్‌కు మన కంపెనీల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అక్కరలేదట. ఒకసారి సిద్ధమైతే చాలు, భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేయవచ్చట. అందుకే ఆస్ట్రాజెనెకా వాళ్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తోను, జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్లు బయోలాజికల్-ఈ తోనూ ఒప్పందాలు చేసుకోగా మోడెర్నా మనవాళ్లెవరితోనూ చేసుకోకుండా స్విజర్లండ్ కంపెనీతో చేసుకుంది.

మామూలుగా అయితే ఏదైనా మందు కానీ, వాక్సిన్ కానీ యుఎస్‌ఎఫ్‌డిఏ అప్రూవ్ చేసిందంటే అది ప్రామాణికంగా వుంటుందని ప్రపంచం నమ్ముతుంది. కానీ యీ రోజు అమెరికాను పాలిస్తున్నది పబ్లిసిటీ పిచ్చి-మారాజు ట్రంప్. నాలుగురోజుల క్రితం ఓ జర్నలిస్టుతో మాట్లాడుతూ తను కావాలనే కోవిడ్ తీవ్రతను తగ్గించి చూపానని (ప్లే డౌన్), జనాల్లో భయాందోళనలు కలిగించకూడదనే అలా చేశానని చెప్పుకున్నాడు. మామూలుగా ఐతే అలా ఒప్పుకునే రకం కాదతను. కానీ ప్రజల మూడ్ చూసి ఒప్పుకోవలసి వచ్చింది.

సాధారణ పరిస్థితుల్లో అధ్యక్షుడిగా వున్నవాళ్లు రెండోసారి ఎన్నిక కావడం మరీ కష్టమేమీ కాదు. రెండు తడవల తర్వాత ఎలాగూ ఛాన్సుండదనే లెక్కతో దేశానికి పనికి వచ్చే దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారని ప్రజల నమ్మకం. కోవిడ్ గొడవ లేకపోతే ట్రంప్ కూడా అలా నెగ్గేందుకు ఛాన్సుండేది. కానీ ప్రస్తుతం 65 శాతం మంది ప్రజలు కోవిడ్‌ను ట్రంప్ హేండిల్ చేసిన తీరు సరిగ్గా లేదని భావిస్తున్నట్లు సర్వేలు ప్రకటిస్తున్నాయి. అందువలన యిలా దిగివచ్చాడు కానీ నెగ్గడానికి యిది సరిపోదని అతనికీ తెలుసు కాబట్టి అధ్యక్ష ఎన్నికలు జరగబోయే నవంబరు 3 లోగా వాక్సిన్‌ను జనాల చేతుల్లో పెట్టేశానని చెప్పాలని ఆతృత పడుతున్నాడు.

ఇప్పటికే టీకా రెడీగా వున్నట్లు పోజు కొడుతూ, నవంబరు 1 నాటి కల్లా వాక్సిన్ యివ్వడానికి సిద్ధంగా వుండాలని రాష్ట్రాలకు చెప్పాడు కూడా. ఆ ఆశల మోసులకు నీళ్లు పోస్తున్నది మోడెర్నా. ఈ హడావుడి మేళంలో మోడెర్నా ఎలాటి వాక్సిన్ తయారుచేసి అందించినా, ట్రంప్ దాన్ని ఆమోదింప చేసేస్తాడేమోనని భయం వేస్తోంది. తయారు చేసే కంపెనీకి అనుభవం లేదు, ఈ తరహా వాక్సిన్‌ మనుషులకు కొత్త, పైగా ట్రంప్‌కు రాజకీయపరమైన అర్జన్సీ వుంది. అందుకే దాని గురించి మరీ అంత ధైర్యంగా ఉండలేకపోవడం!

ఇక ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెన్‌కా వాక్సిన్. ప్రపంచవ్యాప్తంగా మూడోదశ ప్రయోగాలకు వచ్చిన 9 వాక్సిన్‌లలో యిది ఒకటి. మొదట్లో జంతువుల మీద వికటించిందన్నారు. సర్దుకుని మూడోదశ ప్రయోగాల దాకా వచ్చారు. ప్రస్తుతం 18 వేల మంది మీద చేస్తున్నాం, అమెరికాలో 30 వేల మంది వాలంటీర్లను రిక్రూట్ చేసుకోవడం మొదలెట్టాం అన్నారు. తీరా చూస్తే ఓ వలంటీరు మెదడు వెన్నెముకల్లోని మైలీన్ తొడుగుకి వైరల్ ఇన్ఫెక్షన్ సోకిందట. దాంతో ఆస్ట్రా జెన్‌కా వాళ్లు సెప్టెంబరు 8న ఆపేశారు. వారి ఇండియా భాగస్వామి సీరం మాత్రం 1600 మంది మీద చేస్తున్న ప్రయోగాలు ఆపలేదు. దాంతో డిసిజిఐ వాళ్లు కోప్పడి ఆపించేశారు. 

ఇప్పుడు ఆస్ట్రాజెన్‌కా వాళ్లు మళ్లీ మొదలు పెడతామంటున్నారు. వాటి వ్యవహారం ఎలా తేలుతుందో తెలియదు కానీ ఏడాది చివరకల్లా తెచ్చేద్దామను కుంటున్నామని చెప్పేసుకుంటున్నారు. ప్రభుత్వసంస్థలైతే ఉన్నదున్నట్లు చెప్ప గలుగుతాయి. కార్పోరేట్లు అనేసరికి వాటి కంపెనీ షేరు వేల్యూ పడిపోకుండా చూసుకోవాలని ఎలాటి బడాయి కబుర్లయినా చెప్పేస్తాయి. 

ఇక మన తెలుగునాట తయారవుతున్న కోవాక్సిన్ సంగతికి వస్తే యిక్కడ జరుగుతున్న హడావుడి అంతాయింతా కాదు. జులై 20న మొదటిదశ ప్రయోగాలు ప్రారంభం కాగానే ‘విజయవంతం’ అంటూ వాఁవాఁకారాలు చేశారు. అవి యిప్పటికి పూర్తయి, నిమ్స్‌లో రెండో దశ ప్రయోగాలు సెప్టెంబరు 8న 12 మందిపై ప్రారంభమయ్యాయి. (అంటే అక్కడికే 50 రోజులైందన్నమాట) దేశం మొత్తం మీద 12 సెంటర్లలో 380 మందిపై ప్రయోగాలు చేస్తున్నారు. జరగాల్సిన కథ యింకా చాలా వుంది. రెండో దశ ప్రయోగాల ఫలితాలు సంతృప్తికరంగా వుంటే మూడో దశ ప్రారంభించకుండానే ఉత్పత్తికి అనుమతి యిచ్చేయవచ్చు అని గతంలో డిసిజిఐ అన్నారు. ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ వ్యవహారం చూశాక, అంతకు తెగిస్తారో లేదో తెలియదు.

కోవాక్సిన్ విషయంలో నాకు అర్థం కాని విషయమేమిటంటే, ‘రేసుస్ జాతి కోతులు 20 వాటిపై జరిగిన ఛాలెంజ్ ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి’ అంటూ తీరిగ్గా సెప్టెంబరు 12న ఆ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. జంతువులపై ప్రయోగాల గురించి యిప్పుడు చెప్పడమేమిటి? మొదటిదశ మానవపరీక్షలకు ముందు కదా చెప్పాల్సింది! కొంపదీసి కోతులకు, మనుష్యులకు ఒకేసారి ప్రయోగాలు మొదలెట్టేశారా? అసలు గతంలోనే ‘జంతువులపై చేసిన ప్రయోగాలు హైదరాబాదులో జరిగాయా? అమెరికాలో జరిగాయా’ అనే సందేహం వచ్చింది. దానికి కంపెనీ సంతృప్తికరమైన సమాధానాలు ఏవీ యివ్వలేదు అనుకుంటూండగా యిప్పుడీ గందరగోళపు ప్రకటన!  

పరిశోధన అనేది చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. కోట్ల మందికి వాక్సిన్‌లు యిచ్చేటప్పుడు ప్రతి దశలోనూ ఆచితూచి అడుగులు వేయాలి. అందుకే పదులు, వందలు, వేలు అలా వాలంటీర్లను పెంచుకుంటూ పోతారు. ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు అని భారత్ బయోటెక్ సిఎండి చెప్తూండగా తెలుగు మీడియా మాత్రం తెగ హంగామా చేసేస్తోంది. రాజకీయనాయకులు కూడా! మొన్న తెలంగాణ అసెంబ్లీలో ఒవైసీ ‘‘భారత్ బయోటెక్ వాక్సిన్‌లో తెలంగాణకు వాటా వుండాలి.’’ అని డిమాండ్ చేస్తే ‘‘తప్పకుండా వుంటుంది’’ అని కెసియార్ హామీ యిచ్చేశారు. వెనకటికో సామెత వుంది ‘నేను కొనబోయే పొలంలో, నాటబోయే చెట్టుకి, కాయబోయే పళ్లల్లో సగం నీకు, సగం నాకు..’ అని. అలాగుంది యవ్వారం.

కెసియార్ మాటల మాంత్రికుడైతే కావచ్చు కానీ సొంత బాజా వాయించుకోవడంలో చంద్రబాబుకి సాటి రాలేరు. దేశం హోల్‌మొత్తంలో ఏం జరిగినా దాన్ని తన ఖాతాలో వేసుకునే ఘనుడాయన. ఒలింపిక్స్‌లో పతకం వచ్చినా, ఆస్కార్‌లో అవార్డు దక్కినా, నోబెల్‌కు పేరు వెళ్లినా, కుజగ్రహానికి రాకెట్ పంపినా, వేయేల.., చీమ చిటుక్కుమన్నా అంతా నా ప్లానింగ్‌తోనే జరిగిందని చెప్పుకునే బాబు ప్రపంచప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్న కోవిడ్ వాక్సిన్ గురించి ఏదో ఒకటి క్లెయిమ్ చేయకుండా వూరుకోగలరా?

కోవాక్సిన్ మొదటి దశ ప్రయోగాలు సంతృప్తికరంగా పూర్తయ్యాయని, రెండో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయని సెప్టెంబరు 8న కంపెనీ ప్రకటిస్తే ఆ ముక్క కంపెనీ కంటె నెలన్నర ముందుగా బాబు జులై 25నే ప్రకటించేశారు. బుడుగు కార్టూన్ వుంది, చేతిలో ఓ గిన్నె పట్టుకుని యింట్లోకి పరిగెట్టుకుని వస్తూంటాడు. ‘‘అమ్మా, ఇవాళ మనం టిఫెన్ చేసుకోనక్కరలేదు. పక్కింటివాళ్లు యిచ్చారు. ఇంకా వాళ్ల కా సంగతి తెలీదనుకో..’’ అంటాడు. అలాగ కంపెనీ వాళ్లకే తెలియకుండా బాబుకి ప్రయోగాల గురించి ముందే తెలిసిపోయింది.

జులై 26 నాటి ‘‘ఈనాడు’’లో ఆయన పేర వచ్చిన ప్రకటనలో ‘భారత్ బయోటెక్‌తో తను మాట్లాడేనని మొదటిదశ పరీక్షలు పూర్తయ్యాయని, రెండు, మూడు దశల పరీక్షలు పూర్తి చేయాలంటే యింకా 80 రోజుల వరకు పట్టే అవకాశం వుందని బాబు వివరించారు.’ అని వుంది. ఆ కంపెనీ సిఎండి, అగ్రిబయోటెక్ సైంటిస్టు. ఆయనే ఎప్పటికి తయారవుతుందో కమిట్ కావటం లేదు. కానీ బాబు మాత్రం తన పర్యవేక్షణలో అంతా జరుగుతున్నట్లు బిల్డప్ యిచ్చేస్తున్నారు. మొదటిదశ ప్రయోగాలు మొదలైన ఐదు రోజులకే అవి విజయవంతమయ్యాయని యీయన డిక్లేర్ చేశారు. ఇక రెండో దశ ప్రయోగాల ఫలితాల సంగతి తేలాక కదా, మూడో దశ గురించి చెప్పగలిగేది, అప్పుడే యీయన 80 రోజులు పడుతుందని చెప్పడానికి ఆతృత పడడమెందుకు? ఎందుకంటే భారత్ బయోటెక్ క్రెడిట్‌ను కెసియార్ తన ఖాతాలో వేసేసుకుంటాడేమోనన్న ఆదుర్దా యీయనది!

నిజానికి హైదరాబాదులో బయోటెక్ విప్లవం ప్రారంభమైనపుడు చంద్రబాబు దాన్ని పసిగట్టలేదు. అప్పుడాయన ఐటీ మోజులోనే వున్నాడు. తొలి స్వదేశీ బయోటెక్ వాక్సిన్ శాన్‌వాక్‌-బిని శాంతా బయోటెక్నిక్స్ 1997 ఆగస్టులో ఆవిష్కరించినపుడు బాబు ఆ సభకు వెళ్లలేదు, పట్టించుకోలేదు. హెల్త్ మినిస్టర్ డా. ఎన్. జనార్దన రెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఎందుకంటే సైజు ప్రకారం చూస్తే శాంతా అంత పెద్ద కంపెనీలా బాబుకి ఆనలేదు. తర్వాతి రోజుల్లో శాంతాకు జాతీయంగా, అంతర్జాతీయంగా అవార్డులు, రివార్డులు రావడంతో వాక్సిన్ ప్రాధాన్యత, బయోటెక్ రంగం సన్‌రైజ్ యిండస్ట్రీగా ఎదుగుతున్న వైనం తెలిసివచ్చిం దాయనకు.

దాంతో శాంతా తర్వాత మూడేళ్లకు వచ్చిన భారత్ బయోటెక్‌ను ప్రోత్సహించారు. హెరిటేజిలో వున్న డైరక్టరు ఒకాయన అక్కడా చేరారు. భారత్ ఫ్యాక్టరీకి చుట్టూ బయోటెక్ పార్కు ఏర్పరచి జెనోమ్ వ్యాలీ అని పేరు పెట్టారు. ఇక అప్పణ్నుంచి హైదరాబాదంటే ఐటీ-బిటీ అని ప్రాసతో జంటపదాల పల్లవి అందుకుని అవి రెండు కళ్లన్నారు. (బాబు రెండు కళ్లకు చాలా సమానార్థకాలున్నాయి) అంత చేసి, యిప్పుడు చటుక్కున యీ కోవిడ్ వాక్సిన్ నిజంగా తయారైతే భారత్ బయోటెక్‌ ఖ్యాతిని తక్కినవాళ్లు ఎగరేసుకుని పోతూవుంటే చూస్తూ వుండగలరా? పైగా వెంకయ్య నాయుడు భారత్ బయోటెక్‌కు అండగా నిలుస్తున్నారు కాబట్టి దాని సిఎండికి ఏ ‘పద్మ’ అవార్డో యిచ్చి బిజెపియే ఆ క్రెడిట్ కొట్టేయవచ్చు. అలాటి ఉపద్రవమోదో జరిగేలోపునే బాబు ఆదరాబాదరాగా జులై 25 నాటి ప్రకటన చేయవలసి వచ్చింది.

పోన్లెండి, ఎవరికి క్రెడిట్ వస్తే, ఎవరికి అవార్డు వస్తే మనకేం పోయింది, మనకు నికార్సయిన వాక్సిన్ వస్తే అంతే చాలు. కానీ ఫలానా అప్పుడు వస్తుందని నిపుణులెవరూ కచ్చితంగా చెప్పలేకపోవడానికి కారణం, మూడో దశ ప్రయోగాల్లో వున్న క్లిష్టత. జంతువులపై ప్రయోగాలు విజయవంతమయ్యాక మొదలుపెట్టే మొదటి దశలో వాలంటీర్లు పదుల సంఖ్యలో వుంటారు. ఆ దశలో ప్రధానంగా చూసేది సేఫ్టీ, టోలరెన్స్. అంటే యిది యివ్వగానే ఏ ఇబ్బందీ, ఏ సైడ్ ఎఫెక్టూ రాలేదు కదా అని. ఇక రెండో దశలో వాలంటీర్లు వందల సంఖ్యలో వుంటారు. శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి కావాలంటే, సెల్ రెస్పాన్స్ తగినంతగా వుండాలంటే వాక్సిన్ డోసేజి ఎంత యివ్వాలి అని యీ దశలో చూస్తారు. దీనిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదాని పట్టిపట్టి చూస్తారు.

ఇక మూడో దశకు వచ్చేసరికి వాలంటీర్ల సంఖ్య వేలల్లో వుంటుంది. ఎత్నిక్ వేరియేషన్ సమస్య అధిగమించేందుకు గాను, వేర్వేరు ప్రదేశాల్లో (లేదా దేశాల్లో), వయసు రీత్యా, సామాజిక స్థాయి రీత్యా, లింగరీత్యా, యితర వ్యాధుల రీత్యా వేర్వేరు రకాలుగా వుండే వాలంటీర్లపై ప్రయోగించి చూస్తారు. దీనిలో కొంతమందికి అసలైన వాక్సిన్ యిస్తారు, కొందరికి ప్లాసెబో (ఉత్తుత్తి టీకా) యిస్తారు. ఎవరికి ఏదిచ్చారో, వాలంటీరుకీ తెలియదు, యిస్తున్న డాక్టరుకూ తెలియదు. (డబుల్ బ్లైండెడ్). ఎవరైనా వాలంటీరుకి సైడ్ ఎఫెక్టులు వచ్చాయనుకోండి, వాక్సిన్ వలన వచ్చాయో, లేకపోతే యివ్వకపోయినా యిచ్చారన్న ఫీలింగుతోనే వచ్చాయో చూస్తారు.

అంతకు ముందే వాక్సిన్ మార్కెట్‌లో వుందనుకోండి. ఈ వాక్సిన్ దానితో సమానంగా పని చేస్తోందా, మెరుగ్గా పనిచేస్తోందా అని పోల్చి చూస్తారు. వాక్సిన్ సామర్థ్యం ఏ పాటిదో దీనిలో తెలిసిపోతుంది. దానికి గాను కంపెనీ యిచ్చే డేటాను క్షుణ్ణంగా వడపోస్తారు. పనికి వస్తుందనుకుంటేనే, ఉత్పత్తి చేయడానికి అనుమతి యిస్తారు. ఉత్పత్తి చేసి, మార్కెట్‌లోకి పంపిణీ చేశాక కూడా నాలుగో దశ ప్రయోగాలు నిర్వహించి, మార్కెట్ సర్వేలెన్స్ డేటా సేకరిస్తారు. ఎందుకంటే అప్పుడు వాక్సిన్‌ను లక్షల మంది, కోట్ల మంది తీసుకుంటారు. వాళ్లలో ఎవరికి రియాక్షన్ యిచ్చినా ఉత్పాదనను వెనక్కి తీసుకుని, మళ్లీ ప్రయోగాలు చేయమంటారు. ఇంత తతంగం వుంటుంది.

ఇవేమీ జరగకుండా ‘వాక్సిన్ తయారై పోయింది, గూట్లో వుంది, ఆ గూడు నాదే..’ అనే గొప్ప కబుర్లు కట్టిపెట్టి, ‘ఆలస్యం అయితే అవుతుంది కానీ, ఇచ్చేదేదో సవ్యమైన వాక్సినే యిస్తాం, అప్పటిదాకా ఓపిక పట్టండి. ఈ లోగా జాగ్రత్తగా వుండండి’ అని నాయకులు నిజాయితీగా చెప్తే అదే పదివేలు. ఈ ఆగస్టు 15 పబ్లిసిటీ గొడవ వదిలిపోయింది కాబట్టి, కేంద్ర నాయకులు యీ దిశగా ఆలోచిస్తున్నారని తోస్తోంది. ప్రాంతీయ నాయకులు కూడా సంయమనం పాటిస్తే మంచిది.

ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
[email protected]