బాలీవుడ్ కు శాంతి చేయించాలేమో!

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. నెలకు ఒకరు చొప్పున వరుసగా బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ లోకాన్ని వీడుతున్నారు. ఓ వైపు లాక్ డౌన్ తో పీకల్లోతు కష్టాలు.. మరోవైపు ప్రముఖులు ఇలా వరుసగా వీడి వెళ్లడం బాలీవుడ్ ను సంకట స్థితిలోకి నెడుతోంది. దీంతో ఈ బాలీవుడ్ కు ఏదో అయిందంటూ కొత్త చర్చ మొదలైంది.

ఇర్ఫాన్ ఖాన్ తో మొదలైంది బాలీవుడ్ లో బ్యాడ్ న్యూస్ ల పరంపర. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకొని భారతీయ సినీపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్.. 54 ఏళ్ల వయసులో అరుదైన కాన్సర్ తో మరణించాడు. బాలీవుడ్ లో అందరివాడు అనిపించుకున్న ఇర్ఫాన్ కు, కరోనా/లాక్ డౌన్ కారణంగా బాలీవుడ్ మనస్ఫూర్తిగా నివాళులు కూడా అర్పించలేకపోయింది.

ఇర్ఫాన్ నుంచి బాలీవుడ్ కు చీకటి రోజులు మొదలయ్యాయి. ఆ వెంటనే మేటి నటుడు, బాలీవుడ్ వారసత్వ సంపద రిషి కపూర్ కన్నుమూశారు. 80ల్లో రొమాంటిక్ హీరోగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న రిషికపూర్ బాలీవుడ్ పెద్ద మనుషుల్లో ఒకరు. అలాంటి వ్యక్తిని కోల్పోవడంతో షాక్ కు గురైంది బాలీవుడ్.

ఇర్ఫాన్, రిషికపూర్ లేరనే వార్తను జీర్ణించుకుంటున్న టైమ్ లోనే మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది బాలీవుడ్. సాజిద్-వాజిద్ సంగీత ద్వయంలో ఒకరైన వాజిద్ ఖాన్ కన్నుమూశాడు.ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్  అందించిన ఈ సంగీత దర్శకుడు తమను వీడి వెళ్లిపోయాడని బాలీవుడ్ బాధపడుతున్న టైమ్ లోనే ఊహించని విధంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

34 ఏళ్ల చిన్న వయసులో స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న టైమ్ లో ఊహించని విధంగా, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సూసైడ్ చేసుకొని చనిపోయాడు సుశాంత్. సుశాంత్ మరణంపై ఇప్పటికీ ప్రతి రోజూ ఏదో ఒక వార్త మీడియాలో కనిపిస్తూనే ఉంది.

ఇవి చాలవన్నట్టు తాజాగా సరోజ్ ఖాన్ ను కూడా కోల్పోయింది బాలీవుడ్. ప్రపంచవ్యాప్తంగా "బాలీవుడ్ డాన్స్" అనే బ్రాండ్ క్రియేట్ అయిందంటే దానికి కారణం సరోజ్ ఖాన్. ఇతర దేశాల ప్రజలు బాలీవుడ్ డాన్సింగ్ స్టయిల్ కు అభిమానులుగా మారారంటే దాని వెనక సరోజ్ ఖాన్ కృషి ఉంది.

2వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ అందించి లెజెండ్ అనిపించుకున్న సరోజ్ ఖాన్ మృతితో బాలీవుడ్ లో చర్చ తారాస్థాయికి చేరుకుంది. రోజుల వ్యవథిలో ఇలా ప్రముఖుల్ని కోల్పోవడంతో.. ఇండస్ట్రీకి శాంతి చేయాలంటున్నారు కొంతమంది.

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ