సినిమా రివ్యూ: భానుమతి రామకృష్ణ

చిత్రం: భానుమతి అండ్ రామకృష్ణ
రేటింగ్: 2.75/5
బ్యానర్: నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, 
తారాగణం: నవీన్ చంద్ర, సలోని లూత్రా, హర్ష చెముడు, రాజా చేంబోలు తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
కూర్పు: రవికాంత్ పేరేపు
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి
విడుదల తేదీ: జులై 3, 2020
వేదిక: ఆహా

ఓటిటి పుణ్యమా అని సినీ ప్రియులకు కొత్త సినిమాల కొరత వుండట్లేదు. తాజాగా ఆహా వేదికగా ‘భానుమతి అండ్ రామకృష్ణ’ చిత్రం విడుదలయింది. ఇటీవల విడుదలయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ కాలేజ్ కుర్రాళ్లను, పాతికేళ్ల లోపు యువతని ఆకట్టుకుంటే... ఈ ప్రేమకథ కాస్త మెచ్యూర్డ్ వర్గాన్ని టార్గెట్ చేస్తుంది. శేఖర్ కమ్ముల స్కూల్‌ని గుర్తు చేసే శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు, సంఘటనలు చాలా వరకు పరిణతి వున్న ప్రేమజంట భావోద్వేగాలు, వారికుండే తర్జనభర్జనలు, అన్నిటికీ మించి వారి ఎమోషన్స్‌ని డామినేట్ చేసే స్వతంత్రపు స్వభావాలు, ఈగోలు... ఈ చిత్రాన్ని ఆహ్లాదంగా మలిచాయి. 

కథగా చెప్పుకుంటే చాలా చిన్న విషయమే. ముప్పయ్యేళ్లకి ఇంకా పెళ్లి కాని భానుమతికి బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ డీల్ చేస్తున్న సమయంలో ఆమెకి అసిస్టెంట్‌గా వస్తాడు రామకృష్ణ. భానుమతి ఎంత మోడ్రన్, అవుట్‌స్పోకనో... అందుకు పూర్తి విరుద్ధం రామకృష్ణ. ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన రామకృష్ణకి ఇంగ్లీష్ రాదు, ముప్పయ్ మూడేళ్లొచ్చినా పెళ్లి కాలేదు. పెళ్లి విషయంలో ఇద్దరి సిట్యువేషన్ ఒకటే అయినా కానీ మిగిలిన అన్ని విషయాల్లో భిన్న ధృవాలు. వాటి మధ్యే ఆకర్షణ ప్రకృతి సహజం కనుక ఇద్దరూ ఒకరిపట్ల ఆకర్షితులౌతారు. అయితే ఇలాంటి ఆపోజిట్ పోల్స్ కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి పలు సందేహాలు, సందిగ్ధాలు, అహాలు ఎట్సెట్రా అడ్డు పడతాయి కనుక అవన్నీ దాటుకుని ఎలా ఒక్కటవుతారనేది కథ. 

క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు తగినంత సమయం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ చిత్రంలో ప్రత్యేకించి కాన్‌ఫ్లిక్ట్ అంటూ లేదు. ఇద్దరి క్యారెక్టర్ల మధ్య వున్న కాన్‌ఫ్లిక్ట్ కథని నడిపిస్తుంది. భానుమతికి మీడియోకర్ మగాళ్లు నచ్చరు. కానీ అచ్చంగా అలాంటి వ్యేక్త అయిన రామకృష్ణలో ప్రత్యేక గుణాలు గుర్తించడానికి, వాటికి ఆకర్షించబడడానికి, తర్వాత ఇష్టపడడానికి, అతడిని యాక్సెప్ట్ చేయడానికి ఆమె పలు సందేహాలకు లోనవుతుంది. కథను భానుమతి పాయింటాఫ్ వ్యూలో చెప్పడం వల్ల రామకృష్ణ కోణం అంతగా కనిపించదు. 

అయితే అతడి మంచితనాన్ని, పల్లెటూరి తాలూకు అమాయకత్వాన్ని చూపించే సన్నివేశాలు బాగానే రాసుకోవడం వల్ల రామకృష్ణ స్వభావం, వ్యక్తిత్వం గురించిన క్లారిటీ వుంటుంది. మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ అంటే డ్రామా, ఎమోషన్స్‌తో కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి చెప్పడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. అలా అని కథని విడిచి కామెడీ కోసం ట్రాక్‌లు వేసుకోలేదు. హీరో స్నేహితుడిగా ‘వైవా’ హర్షను అవసరం మేరకు వాడుకుని వినోదం మిస్ కాకుండా చూసుకున్నారు. హీరోయిన్‌కి ముప్పయ్యేళ్లు వచ్చినా ఇంకా డేట్స్‌కి వెళ్లడంపై ఆమె ఏజ్‌ని గుర్తు చేసే విధంగా మృదువైన, హార్మ్‌లెస్ హ్యూమర్ జోడించారు. 

క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్, భానుమతి  రామకృష్ణ ఒకరిని ఒకరు ఇష్టపడడం వరకు స్మూత్‌గా నెరేట్ చేసిన డైరెక్టర్ చివరి ఘట్టానికి వచ్చేసరికి రెగ్యులర్ ‘రొమాన్స్’ జోన్రా తాలూకు క్లీషేస్ విడిచిపెట్టలేదు. అప్పటికప్పుడు గొడవ పడడం, తర్వాత కలుసుకోవడం కోసం కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయడం (స్పాయిలర్స్ అనుకోకండి. ఇదంతా ట్రెయిలర్‌లోనే చూపించేసారు)... వగైరా అంతా రెగ్యులర్ సరంజామాలా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు కూడా హడావిడిగా ముగించేసిన భావన కలుగుతుంది. 

ఈ కథ రక్తి కట్టించడానికి అవసరమయిన సిన్సియర్ పర్‌ఫార్మెన్స్ నవీన్ చంద్ర, సలోని లూత్రా ఇచ్చారు. కాస్త ఎక్కువ చేస్తే అతి చేస్తున్నట్టు, కాస్త తగ్గిస్తే మరీ తింగరిమేళంలా అనిపించేట్టు వున్న పాత్రని బ్యాలెన్స్ పోకుండా బాగా పర్‌ఫార్మ్ చేసాడు నవీన్ చంద్ర. శేఖర్ కమ్ముల హీరోయిన్ మాదిరి లక్షణాలున్న పాత్రలో సలోని లూత్రాకి అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది కానీ నెమ్మదిగా ఆకర్షిస్తుంది. ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. ఆమెకి డబ్బింగ్ చెప్పిన వారికి సగం క్రెడిట్ ఇచ్చేయాలి. వైవా హర్ష మంచి టైమింగ్, ఎక్స్‌ప్రెషన్ వున్న ఆర్టిస్ట్ అయినా కానీ తగినంతగా తెలుగు సినిమా అతడిని వినియోగించుకోలేదు. చిన్న చిన్న సన్నివేశాల్లో తన మార్కు హాస్యంతో ఈ చిత్రాన్ని హర్ష పలుమార్లు నిలబెట్టాడు. 

చిన్న సినిమాగా తీసారు కనుక సాంకేతికంగా వనరులు గొప్పవి లేవు. అయితే స్క్రిప్ట్, డైలాగ్స్ పరంగా తగినంత కేర్ తీసుకున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు శ్రీకాంత్‌కి చిన్న చిన్న ఎమోషన్స్‌ని స్ట్రయికింగ్‌గా చెప్పే సామర్ధ్యం ఉంది. ఆ ఎమోషనల్ డైలెమాని చాలా బాగా తెరెకక్కించాడు. నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటిటి ప్లాట్‌ఫామ్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ మెప్పించే మెటీరియల్ కాదు కనుక టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవడానికి ఈ వేదిక ఉపకరిస్తుంది. 

రిలేట్ చేసుకునే పాత్రలు, సహజమైన సన్నివేశాలు, ఆహ్లాదం కలిగించే సంభాషణలు వున్నట్టయితే మామూలు కథలని కూడా వినోదాత్మకంగా, జనరంజకంగా చెప్పవచ్చునని ఈ చిత్రం మరోసారి నిరూపిస్తుంది.  ఈ సినిమాలోని డైలాగ్‌లానే సంతోషం అనేది అందరికీ ఒక్కటే కాదు... ఒక్కొక్కరికీ ఒక్కోటి అన్నట్టు ఈ చిత్రం కూడా ఇలాంటి వినోదం, ఈ తరహా ఎమోషన్‌కి కనక్ట్ అయ్యే వారికి సంతృప్తినిస్తుంది. 

బాటమ్ లైన్:ప్లెజెంట్ లవ్‌స్టోరీ! 

గణేష్ రావూరి