ఎమ్బీయస్: వలస కార్మిక విషాదం

2020 నాటి కోవిడ్ 19 సంక్షోభంలో అత్యంత అమానుష పర్వం ఏదైనా వుందా అంటే అది వలసకార్మికులకు సంబంధించినదే. లాక్‌డౌన్ వలన ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, ఉద్యోగాలు పోతాయి, ఫ్యాక్టరీలు మూతపడతాయి, వ్యాపారాలు దెబ్బ తింటాయి... ఇలా ఎన్ని వున్నా, వలస కార్మికుల ప్రస్థానంతో సరిపోలవు. ఇది మానవవిషాదం. వారి గురించి ఫోటోలు చూసినా, వీడియోలు చూసినా కన్నీళ్లు రానివాడు మనిషే కాదు. ఇలాటిది ఈ శతాబ్దిలోని రెండు దశాబ్దాలలో చూడలేదు. గత శతాబ్ది మధ్యంలో 1947లో దేశవిభజన సమయంలో జరిగినదే దీనికి దగ్గరగా వస్తుంది.

విభజన జరిగినపుడు ప్రజలు అటూయిటూ తరలివెళతారని నాయకులు ఊహించలేదు. అప్పటిదాకా  తరతరాలుగా యిరుగుపొరుగున నివసిస్తూ వచ్చిన హిందూ, ముస్లిములు అలాగే కొనసాగుతారనీ, ఎటొచ్చీ వాళ్లున్న దేశం పేరు మాత్రమే మారుతుందని అనుకున్నారు. అయితే దేశాలు వేరుపడ్డాయని అనగానే వాళ్లు కత్తులు చేతబట్టి కుత్తుకలు కోసుకున్నారు. భయంతో హిందువులు యిటూ, ముస్లిములు అటూ తరలివెళ్లిపోయారు. రైళ్లు, బస్సులు, ఎడ్ల బళ్లు  ఏది దొరికితే అది పట్టుకుని బయటపడ్డారు. అయితే సరిహద్దు దాటేవరకే మరణభయం.

మరి యిప్పుడు దేశసరిహద్దుల్లోనే యీ విలయం. ఏ వాహనమూ లేదు, కాలి నడకనే వందలాది, వేలాది మైళ్ల పయనం. అప్పుడైతే చేతిలో డబ్బుంటే దారిలో ఏదైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు చేతిలో డబ్బూ లేదు, ఉన్నా కొనుక్కోవడానికి దుకాణమూ లేదు, దుకాణాల్లో తిండీ లేదు. ఆకలితో, దాహంతో, ఎండలో, చీకటిలో నడక, నడక. అప్పట్లో కొన్ని సరిహద్దు రాష్ట్రాలకే యీ సమస్య వచ్చిపడింది. ఇప్పుడు దేశమంతా సమస్యే. అప్పట్లో లక్షలాది ప్రజలు శరణార్థులుగా తరలి వస్తారని ఊహించలేని నెహ్రూ, పటేల్, జిన్నా అందరూ బిత్తరపోయారు. కమ్యూనికేషన్ సౌకర్యాలు లేవు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతోందో తెలియక బెంబేలెత్తారు. ఇప్పుడు కమ్యూనికేషన్ సౌకర్యాలు అద్భుతంగా వున్నాయి. ఏం జరుగుతోందో తెలుసు. అయినా పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది.

అప్పట్లో ఎటుచూసినా హింస, రక్తపాతం. ప్రజల్లో ప్రతీకారేచ్ఛ. ఇప్పుడు హింస లేదు. ఆకలి చావులే. వలస కార్మికులపై జాలి తప్ప ఎవరికీ క్రోధం లేదు. అయినా వారికి ఏ ఉపకారమూ జరగలేదు, ఏ సహాయమూ అందలేదు. అప్పుడు రాడ్‌క్లిఫ్ అనే బ్రిటిషు లాయరు వచ్చి, స్థానిక సమస్యల పట్ల ఏ అవగాహనా లేకుండా మ్యాప్ మీద గీతలు గీస్తూ, మూడు రోజుల్లో విభజన ప్రక్రియ ముగించాడు కాబట్టే యీ అనర్థం జరిగింది అన్నారు. అప్పటికింకా పరిపాలన బ్రిటిషు అధికారుల చేతుల్లోనే వుంది కాబట్టి అల్లర్లు జరుగుతూ వుంటే మా బాగా జరిగింది అనుకుంటూ ఉదాసీనంగా ఉన్నారని మనవాళ్లు ఆడిపోసుకున్నారు. తెల్లదొర రాడ్‌క్లిఫ్ మూడు రోజులు టైమిచ్చాడు. ఇప్పటి పాలకుడు నల్లదొర యిచ్చిన గడువు నాలుగు గంటలే! అందరూ యిళ్లల్లోనే వుండాలన్నాడు. ఇల్లు చేరనిస్తే కదా, ఇంట్లో వుండడానికి!

అబ్బే, నా ప్రసంగం వినడానికి అందరూ తమతమ యిళ్లల్లోనే వుండి వుంటారనుకున్నా అనడానికి లేదు. దేశంలో వలస కార్మికులు ఉన్నారన్నది పాలకులకు, అధికారులకు అందరికీ తెలుసు. ఏటా 90 లక్షల మంది వలస కార్మికులు పెరుగుతున్నారని నీతి ఆయోగ్‌యే ఎప్పుడో చెప్పింది. 8 కోట్ల మంది అంతర్రాష్టీయ కార్మికులున్నారని నిర్మలగారు యిప్పుడు స్వయంగా చెప్పారు. రాష్ట్రంలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వలస వెళ్లి పనిచేసే వారు 5 కోట్ల దాకా వుంటారని అంచనా. మొత్తం 13 కోట్లు అంటే, దేశజనాభాలో దాదాపు 10 శాతం. లాక్‌డౌన్ విధిస్తే ఇన్ని కోట్లమంది గతేమిటి అని ఎవరికీ తట్టలేదా!!?

వీళ్లంతా వసతి కలవారు, ఎవరి బాగు వాళ్లు చూసుకోగలిగిన వారనుకున్నాం అనడానికి లేదు. ఇది దశాబ్దాల పాపం. గ్రామీణ ప్రాంతాలను పాడుపెట్టేశాం, వ్యవసాయం కిట్టుబాటు కాకుండా చేశాం, గ్రామాల్లో పరిశ్రమలు పెట్టలేదు, అభివృద్ధిని వికేంద్రీకరించకుండా నగరీకరణకి పెద్దపీట వేసి దేశప్రజనంతా అటువైపు పరుగులు తీసేట్లా చేశాం, అక్కడే మెట్రోలు, బుల్లెట్ ట్రెయిన్లు, ఐఐటీలు, ఎయిమ్స్, సూపర్ స్పెషాలిటీలు, హైపర్ మాల్స్, ఫ్లయిఓవర్లు, స్కైస్క్రాపర్లు... యివన్నీ కట్టడానికి కావలసిన లేబర్ నంతా గ్రామాల నుంచి తీసుకుని వచ్చి కుదేశాం.

భారతదేశంలోని వలస కార్మికులలో 33% మంది యుపి నుంచి, 15% మంది బిహార్ నుంచి, 6% మంది రాజస్థాన్ నుంచి వచ్చి వుంటారని ఓ అంచనా. మధ్యప్రదేశ్, ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు.. యిలా అనేక రాష్ట్రాలు వలస కూలీలను సరఫరా చేస్తున్నాయి (వీళ్లని ఎవరూ పట్టించుకోక పోవడం చేత గణాంకాలు స్థిరంగా లేవు). ఆ రాష్ట్రాల్లో వీళ్లకు ఉపాధి లేదు. అందుకే బయటి రాష్ట్రాలకు వచ్చి తక్కువ కూలీకి పని చేస్తున్నారు. దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు వంటి అనేక రాష్ట్రాలు వీళ్ల చేత పనిచేయించుకుంటున్నాయి. బిహార్ రాష్ట్రంలో దాదాపు 8% వలస కార్మికులేనట.

ఎక్కడివాళ్లు అక్కడే అనడంతో 8 కోట్ల మంది యితర రాష్ట్రాలలో, 5 కోట్ల మంది రాష్ట్రంలోని యితర జిల్లాలలో యిరుక్కుపోతారని, రెక్కాడితే కానీ డొక్కాడని యీ జనాభా వద్ద సేవింగ్స్ ఏవీ వుండవని, వాళ్లు పని చేసే చోట చాలా మందికి పక్కా యిళ్లు కూడా వుండవనీ, పని చేసే స్థలాల్లోనే టెంట్లలో, షెడ్లలో వుంటారనీ పాలకులకు, వారి సలహాదార్లకు తెలియదా? నిర్మల గారు యీ రోజు వలస కార్మికులకు తక్కువ అద్దెలో యిళ్లు యిచ్చే పథకం పెడతామని చెప్తున్నారు. వాళ్లకు సరైన గూడు లేదన్న సంగతి నెలన్నర కితం  తెలియదా? వలస వచ్చినచోట కూడూ, గూడూ రెండూ లేకుండా మూడు వారాల పాటు ఎలా వుండగలరని అనుకున్నారు?

మూడు వారాల పాటు లాక్‌డౌన్‌లో వుంటే చైన్ తెగిపోతుందని మోదీగారికి ఎవరో చెప్పారు, ఆయన మార్చి 24న  అదే చెప్పారు. తెగకపోతే.. అనే సందేహం రావాలి కదా, అప్పుడు యీ వలస కార్మికుల గతేమిటి అని కూడా ఆలోచించాలిగా! నిజానికి లాక్‌డౌన్ పొడిగిస్తూ పోతున్నారు. మూడు వారాలు ఆరువారాలైంది. ఇంకా సాగుతోంది. ఇలా జరిగితే ఎలా అనే కంటిజెన్సీ ప్లాను ఉండాలిగా! అదేమీ లేకుండా ఎక్కడివాళ్లు అక్కడే గప్‌చుప్ అంటే ఎలా? 6 కోట్ల లోపు జనాభా వున్న దక్షిణాఫ్రికా మూడు రోజుల గడువు యివ్వగా లేనిది 135 కోట్ల ఇండియా ఎన్ని రోజులివ్వాలి? ఇప్పుడు వేసిన శ్రామిక రైళ్లు అప్పుడే వేస్తే పోలా? కనీసం రాష్ట్రపు సరిహద్దుదాకా తీసుకెళ్లి పడేస్తే, అక్కణ్నుంచి నడిచే దూరం తగ్గేదిగా! నడవలేకపోతే తెలిసున్నవాళ్లెవరి యింట్లోనైనా తలదాచుకునే వీలుండేది.

ఇన్నాళ్లకు తరలింపులు ప్రారంభించారు. బస్సులు వాడుతున్నారు. బస్సులో మహా అయితే 50 మంది పడతారు. అదే రైలైతే వెయ్యి మంది పడతారు. స్పీడూ ఎక్కువ. సిబ్బందితో యింటరాక్షనూ వుండదు. టాయిలెట్ సౌకర్యాలూ వుంటాయి. లాక్‌డౌన్ పీరియడ్‌లో కూడా శ్రామిక్ రైళ్లు నడిపేసి వుంటే వలస కార్మికుల సమస్య తీరిపోయి వుండేది. అబ్బే దానివలన కరోనా మరీ వ్యాపించేది అనుకోనక్కరలేదు. అప్పటికంటె యిప్పుడు ప్రమాదం మరింత ఎక్కువైంది. వీళ్లు యిళ్లు చేరి వుంటే గ్రామాల్లో సామాజిక దూరం పాటించడం సులభమయ్యేది. క్యాంపుల్లో గుంపులుగా వుంటూ, రోడ్ల మీద గుంపులుగుంపులుగా వెళ్లి కరోనా ప్రమాదానికి మరింత ఎక్కువగా గురయ్యారు. వీళ్లంతా మాటిమాటికీ 20 సెకండ్ల పాటు మోచేతుల దాకా కడుక్కోవడానికి క్యాంపుల్లో నీళ్లున్నాయా? రహదారుల్లో నీళ్లున్నాయా? తాగడానికి, కడుక్కోవడానికి చలివేంద్రాలు ఎవరైనా ఏర్పాటు చేశారా?

లాక్‌డౌన్ విధించిన 5 రోజుల తర్వాత యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గత మూడు రోజుల్లో లక్షమంది వలస కార్మికులు రాష్ట్రానికి చేరారని, వారికి 14 రోజుల క్వారంటైన్ విధించామని ప్రకటించారు. అంటే వీళ్లంతా లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించి, అక్రమంగా నడిచి వచ్చినవారన్నమాట! ఎలాగూ క్వారంటైన్ విధించి జాగ్రత్తలు తీసుకుంటూన్నపుడు సక్రమంగానే రప్పిస్తే పోయేదిగా! ప్రాణాలకు తెగించి వచ్చినవారికే ఆ వెసులుబాటు యివ్వడం దేనికి? ఆ తర్వాతి రోజుల్లో ఎన్ని లక్షల మంది వచ్చారో లెక్కలు వాళ్లే చెప్పాలి. పంజాబ్, హరియాణాలలో రికార్డు స్థాయిలో గోధుమలు పండితే పంట నూర్చడానికి లాక్‌డౌన్ నిబంధనలు సడలించి, యితర రాష్ట్రాల నుంచి కూడా కూలీలలను రప్పించుకున్నారు. మరి అప్పుడు కరోనా భయం లేదా?

నిజానికి వలస కూలీలు లేనిదే అనేక రాష్ట్రాలలో బండి చక్రాలు కదలవు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కాలంటే వాళ్లు ఉండి తీరాలి. మా యింటికి వెళ్లిపోతాం, మా వాళ్లను చూసుకోవాలి అంటూ వాళ్లు యిప్పుడు వెనక్కి వెళ్లిపోతూ వుంటే వాళ్లను నయానో, భయానో ఆపాలని చూస్తున్నాయి ఆ రాష్ట్రప్రభుత్వాలు. ఇంత ముఖ్యమైన శ్రామికవర్గాన్ని యిన్నాళ్లూ గాలికి వదిలేయడంలో ఏ విజ్ఞత వుంది? ఏ మానవత్వం వుంది? మార్చి 24నే వాళ్లతో ‘ఇక్కడే ఉంటారా? ఇంటికి వెళతారా? ఉండేమాటైతే మీకు మామూలుగా వచ్చే ఆదాయంలో సగం యిస్తాం, మీ కోసం క్యాంటీన్లు నడుపుతాం, మీ కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడేందుకు విశేష సౌకర్యాలు కల్పిస్తాం’ అనాల్సింది. కాదూ వెళ్లిపోతామంటారా, రైలెక్కండి, మీ రాష్ట్ర సరిహద్దుల్లో దింపేస్తాం. అక్కణ్నుంచి మీ రాష్ట్రం చూసుకుంటుంది అనాల్సింది కదా!

సరిహద్దు దాకా అని ఎందుకంటున్నానంటే  యిప్పుడు వీరి బాధ్యత రాష్ట్రాలదే అని కేంద్రం అంటున్నా, రాజ్యాంగం ప్రకారం అంతర్రాష్టీయ కూలీలు కేంద్రపరిధిలోని అంశం. రాష్ట్రంలోనే జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేవారి సమస్య రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. లాక్‌డౌన్ విధించేముందు కేంద్రం రాష్ట్రాలతో చర్చించి, వీరి విషయం కూడా ప్రస్తావించి వుంటే ఒక విధానం రూపొందేది. అది జరగకపోవడంతో యీ విషాదం సంభవించింది. లాక్‌డౌన్ విధించిన రెండు, మూడు రోజులకే యిది తెర మీదకు వచ్చింది. అందరూ అయ్యో, అయ్యో అనడం మొదలుపెట్టారు. కానీ పాలకులు కూడా ఏమీ చేయలేదు. 45 రోజుల తర్వాత 20 లక్షల కోట్ల పాకేజిలో వీళ్ల గురించి ప్రస్తావించారు కానీ మొదట్లో ప్రకటించిన 1.70 లక్షల కోట్ల పాకేజీలో వీరి వూసేది?

బీదల కోసం స్కీములంటూ అప్పుడు చెప్పినవేమిటి? నరేగాలో రోజుకి రూ.20 పెంచడం. లాక్‌డౌన్‌లో అది అక్కరకు రాదు కదా.  రేషన్ యిస్తున్నవారికి అదనంగా నెలకు 5 కిలోల గోధుమ, 1 కిలో పప్పుధాన్యాలు చొప్పున మూడు నెలలు ఉచితం, గ్యాస్ సిలిండర్లు మూడు నెలల పాటు ఉచితం. ఇవి రేషన్ కార్డులు ఉన్నవారికే వర్తిస్తాయని, వలస కూలీలకు దీనివలన లాభం లేదని పాలకులకు తోచలేదా? ఇప్పుడు గుర్తు వచ్చింది. దేశమంతటికీ వర్తించే రేషన్ కార్డు రాబోతోందన్నారు. కార్డుతో సంబంధం లేకుండా రేషన్ యిస్తామంటున్నారు. అసలు రోడ్ల మీద నడిచి పోయేవారికి గోధుమలు యిస్తే ఏం చేసుకుంటాడు, వండించి యివ్వాలిగానీ! ఇప్పుడు వచ్చింది ఆ ఆలోచన. జాతీయ రహదార్లపై నడిచి వెళ్లేవారి కోసం స్టాల్స్ నిర్వహించి, అన్నం పెడతారట.

అంటే మీరు నడక మాత్రం ఆపకండి, భోజనం పెట్టి నడిపిస్తూనే ఉంటాం అన్న అర్థం రావటం లేదూ? నడకెందుకు? రైళ్లు ఏర్పాటు చేస్తాం, దగ్గరున్న రైల్వేస్టేషన్ వరకు వాహనాలు ఏర్పాటు చేస్తాం అంటే సరిపోలేదా? ‘బోగీలో 50 మందిని ఎక్కమంటే 100 మంది ఎక్కుతారు, చెప్పినమాట వినరు, అదుపు చేయడానికి ఆర్‌పిఎఫ్ సిబ్బంది చాలరు’ అంటారా, మిలటరీని దింపండి. వాళ్లు తోలు ఒలిచేసి పద్ధతిగా పంపిస్తారు. మిలటరీ ట్రక్కులు నడిపి, కనీసం గర్భిణీలను, పిల్లలను, ముసలివారిని తీసుకెళ్లండి.

మిలటరీ మీద ఏటా కోటానకోట్లు ఖర్చుపెడుతున్నాం. యుద్ధం అనేది పదేళ్లకో, యిరవై ఏళ్లకో ఎప్పుడొస్తుందో తెలియదు కానీ వాళ్లను ప్రజాధనంతో మేన్‌టేన్ చేస్తున్నాం. ఇప్పుడైనా వాడుకోకపోతే ఎలా! విపత్తుల్లో వాడుతున్నారు. ఇది విపత్తుగా మీ కంటికి ఆనలేదా? వలస కూలీలను వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేశాం. పాపం వాళ్లు నడకనే నమ్ముకున్నారు. దారిలో పోలీసులు కనబడితే చావగొట్టి వెనక్కి పంపితే, మళ్లీ నడిచారు. ఏం ఖర్మం చెప్పండి. చాలామంది జనాలు రైళ్ల పట్టాల మీద నడిచారు.

మహారాష్ట్రలోని అహ్మదాబాద్‌లో 16 మంది మధ్యప్రదేశ్ కార్మికులు చనిపోవడంతో అది వెలుగులోకి వచ్చింది. రైళ్ల పట్టాల మీద నడవడం ఏమైనా సుఖమైన పనా? కంకరరాళ్లుంటాయి. దారి సన్నం. అయినా ఆ దారి ఎందుకంటే పోలీసులుండరు, పట్టుకుని కొట్టరు. మహారాష్ట్ర ఘటనలో ఉదయం 5.15కు గూడ్సు బండి వస్తూంటే పట్టాల మీద వున్నవారికి మెలకువ రాలేదంటే చిత్రంగా లేదూ? అంటే అంత అలసిపోయారన్నమాట! సాటి భారతీయుడు నిద్రపోవడానికై పట్టాల మీద తలపెట్టి పడుక్కున్నాడని తలచుకుంటే సిగ్గుగా లేదూ! వీళ్లూ, నడకలేక చచ్చినవాళ్లూ  వీళ్లంతా కరోనా మృతుల్లోకి రారు కాబట్టి, మనం కరోనాను బాగా కట్టడి చేశాం అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుకోవచ్చు లెండి.

ఇప్పుడు సమస్య ముదిరిపోయాక, దేశమంతా గగ్గోలు పెడుతున్నవేళ, ప్రణాళికావైఫల్యాన్ని ఛీకొడుతున్న వేళ, కేంద్రం రాష్ట్రాల మీదకు తోసేయడం మొదలుపెట్టింది. మాట్లాడితే ఒన్ నేషన్  ఒన్ పాలసీ అంటూ తాజాగా విద్యుత్ కూడా తన చేతిలోకి తీసేసుకుందామని చూస్తున్న బిజెపికి యిలాటి గంభీర సమస్య వచ్చేసరికి రాష్ట్రాలు గుర్తుకు వచ్చాయి. 14 రాష్ట్రాలు ఎన్‌డిఏ పాలనలోనే ఉన్నాయి. వారితో చర్చించైనా ఓ పాలసీ ప్రకటించవచ్చు. అబ్బే, ఈ వైఫల్యం కారణంగా బిజెపి ముఖ్యమంత్రుల యిమేజి పోయినా ఫర్వాలేదు, మోదీగారి యిమేజి మాత్రం చెడకూడదు. అందువలన కేంద్రం పిక్చర్‌లోకి రాదు.

వలస కార్మికుల గురించి సంబంధిత రాష్ట్రాలు రెండూ చర్చించుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలట. ఆయనే వుంటే.. సామెతలా రాష్ట్రాల మధ్య సఖ్యతే వుంటే, కేంద్రం జోక్యం దేనికి? తెలుగు రాష్ట్రాల మధ్యే ఎడతెడని పంచాయితీ నడుస్తోంది. మధ్యలో నలిగేది ఉద్యోగులు, పౌరులు. మరి వలస కార్మికుల గతీ అంతేనా? ఒక్కో రాష్ట్రం ఒక్కో పాలసీ తీసుకుంటే, ఒకటి వలస వాళ్లను ఉండనీయమని, మరోటి రానివ్వమని అంటే అప్పుడేం జరుగుతుంది? వీళ్లు త్రిశంకుస్వర్గంలో వేళ్లాడాలా? ఎందుకీ చిన్నచూపు అంటే వీళ్లు ఓటు బ్యాంకు కాదు. దూరప్రాంతాల్లో వుండడం చేత వీరిలో సాధారణంగా చాలామంది ఓటేయలేరు.

 రైళ్లు వేశాక చార్జీల దగ్గర బేరాలు మొదలెట్టింది కేంద్రం. చార్జీలు తప్పవంది, ఖర్చులు భరిస్తామని ప్రతిపక్షం అనగానే, రాష్ట్రాలే బాధ్యత తీసుకుని, 5% మాకు కడితే చాలు అంది. ఏం వూరికే తీసుకెళ్లలేరా? ఏదైనా విపత్తు సంభవించినప్పుడు హెలికాప్టర్లలో జనాలను తరలిస్తారే! వరదలొస్తే పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తారే, అప్పుడు డబ్బులడుగుతున్నారా? వందే భారత్ అంటూ ధనికులను విమానాల్లో విదేశాల నుంచి తీసుకుని వస్తున్నారే! వీళ్ల దగ్గరకు వచ్చేసరికే దరిద్రం గుర్తుకు వచ్చిందా? ఎంపీల కాంటీన్‌లో కన్సెషన్లు యిచ్చినపుడు ఏమౌతుంది యీ పొదుపు? బుల్లెట్ రైళ్లు, వందలాది అడుగుల విగ్రహాలు  యిలాటివి ప్లాను చేసినపుడు ఏమౌతుంది? మిషన్ మంగళ్ అంటూ వేలాది కోట్లు ఖర్చవుతున్నాయి. భూమి మీద ఉన్న సాటి దేశస్తుణ్ని ఆపత్సమయంలో ఆదుకోలేనివాళ్లం కుజగ్రహంలో ఏ గడ్డి పీకుతాం?

ఇతర దేశాల్లో యీ సమస్య వున్నట్లు వినలేదు. వాళ్ల కంటె మనం కరోనాని బాగా కట్టడి చేశాం అని చంకలు గుద్దుకునే ముందు యీ విషయమూ తలచుకుని సిగ్గుపడాలి. భోపాల్ గ్యాస్ మృతుల విషయంలో, వైజాగ్ ఎల్జీ మృతుల విషయంలో విదేశీ కంపెనీలను నోరారా తిట్టుకుంటున్నాం. మరి వలస కూలీల చావులకు ఎవర్ని తిట్టాలి? ఎవరు బాధ్యత వహిస్తారు? పట్టణాల నుంచి వచ్చిన అధికారగణం, పాలకగణం వారిని చిన్నచూపు చూశారు. వాళ్ల అతీగతీ పట్టించుకోలేదు. వాళ్లు నగరాల్లో మురికివాడలు తయారు చేస్తూ వుంటే, ఆ దుర్గంధం భరించలేక కారును మరోదారిలోకి మళ్లించారు. ఇప్పుడు అక్కడే కరోనా విలయతాండవం చేస్తూ మీ  5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ప్లానును ధ్వంసం చేస్తోంది. 

మీరు లాక్‌డౌన్ పేరు చెప్పి వలస కూలీలను అడలగొట్టేశారు, ఉసురు తీశారు. ఉన్న వూరు విడిస్తే అనర్థమనే భయం నరనరాలా పాకి మోదీ మోదీ గారు చెప్పిన  ‘జాన్ హై, జహాఁ హై’ (బతికుంటే బలుసాకు తినవచ్చు) మంత్రం పఠిస్తూ ఊరు వదిలి రాక అక్కడే కూర్చుంటే వాళ్ల ముందు సాగిలబడి నగరాలకు తీసుకు రావలసిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మీరు ఎన్ని లక్షల కోట్ల ఔదార్యం ప్రకటించినా ఆర్థికరథచక్రాలు కదలవు. వారి నైపుణ్యమే, 10, 12 గంటలు పని చేయగల వారి ఓపికే మీకు యింధనం.

ఏం ఊరించినా రాకుండా వాళ్లు ఉన్న ఊళ్లోని వుండిపోతే, పూట గడవక దొంగతనాలకు, దోపిడీలకు దిగితే శాంతిభద్రతల పరిరక్షణకు ఎన్ని వేల కోట్లూ చాలవు. ఇంతటి ముఖ్యమైన మానవ వనరును నిర్లక్ష్యంగా చూడడం, ప్రాణాలకు రక్షణ కల్పించకపోవడం, తిండీతిప్పలూ లేకుండా చేయడం  ఇది పూర్తిగా మానవ తప్పిదం. ప్రణాళికా వైఫల్యం. లాక్‌డౌన్ ఎత్తివేశాక, పూర్తి వార్తలు బయటకు వచ్చినపుడు దీని సమగ్ర స్వరూపం బయట పడినప్పుడు మన తల మరింత వంగుతుంది, కన్ను మరింత చెమరుస్తుంది. ఈ సమయంలో ప్రధానిగా వున్న మోదీపై యిది మాయని మచ్చగా చరిత్రలో నిలిచిపోతుంది.  

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2020)