జ‌గ‌న్‌కు సాక్షి చేయాల్సిన మేలు...ఈనాడు చేసింది

టీడీపీ క‌ర‌ప‌త్రం ఈనాడు అని వైసీపీ అధినేత‌, సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నోసార్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. అసెంబ్లీ వేదిక‌గా కూడా ఈనాడులో రాసిన క‌థ‌నాల‌ను చ‌దివి వినిపిస్తూ చంద్ర‌బాబును "మీ క‌ర‌ప‌త్రం"లో రాసిందే అంటూ దెప్పి పొడిచే వారు. అదే విధంగా సాక్షిని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ర‌ప‌త్రంగా చంద్ర‌బాబు అనేక‌సార్లు విమ‌ర్శించారు. పాల‌క‌ప్ర‌తిప‌క్ష నేత‌ల విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా...శుక్ర‌వారం వెలువ‌డిన ఈనాడు ప‌త్రిక మాత్రం జ‌గ‌న్‌కు మేలు చేసే క‌థ‌నాల‌నే ప్ర‌చురించింద‌ని చెప్పాలి. ఇదే జ‌గ‌న్ మాన‌స పుత్రిక సాక్షి విష‌యానికి వ‌స్తే...ఎంత త‌క్కువ మాట్లాడితే ఆరోగ్యానికి అంత మంచిదనే రీతిలో ఉంది.

క‌రోనా వైర‌స్‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని, అది ఒక మ‌లేరియా, టైపాయిడ్ లాంటి రోగ‌మే అని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్నారు. జ‌నంలో భ‌యాన్ని పోగొట్టేందుకు సీఎం క‌రోనా ఏమంత ఆందోళ‌న‌కు గురి కావాల్సిన ప‌నిలేదంటూ చెప్పుకుంటూ వ‌స్తున్నారు. అలాగే గ్రీన్ జోన్ల‌లో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ప్ర‌ధాని మోడీకి సైతం సీఎం సూచించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాపాడుకోవాలంటే సామాజిక దూరం పాటిస్తూనే లాక్‌డౌన్ ఎత్తివేసి, రోజువారీ కార్య‌క‌లాపాల‌ను సాగించాల్సిందేన‌ని సీఎం అభిప్రాయ‌ప‌డుతున్నారు. సీఎం స్పంద‌న‌పై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. కానీ వాళ్ల విమ‌ర్శ‌ల‌ను సీఎం ఏ మాత్రం లెక్క చేయ‌డం లేదు.

తాజాగా సీఎం వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా ముఖ్యంగా మ‌న‌దేశంలో పేరున్న ఇద్ద‌రు ప్ర‌ముఖులు త‌మ‌త‌మ అభిప్రాయాల‌ను వివిధ వేదిక‌ల నుంచి వెల్ల‌డించారు. ఆ ప్ర‌ముఖులు ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్‌. వీళ్ల‌ద్ద‌రి అభిప్రాయాల‌కు ఈనాడు ప‌త్రిక అగ్ర‌స్థానం క‌ల్పించింది. ప‌తాక శీర్షిక‌తో ఇద్ద‌రి అభిప్రాయాల‌కు స‌మాన ప్రాధాన్యం ఇస్తూ ప్ర‌చురించింది.

సుదీర్ఘ లాక్‌డౌన్ మంచిది కాదు శీర్షిక‌తో రాహుల్‌గాంధీ ముఖాముఖిలో ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాంరాజన్ అన్న‌ట్టు క‌థ‌నాన్ని ఈనాడు రాసింది. ఈ క‌థ‌నంలో క‌రోనాపై యుద్ధంలో వంద శాతం విజ‌యం అసాధ్య‌మ‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ రఘురాంరాజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. కేసుల సంఖ్య సున్నాకు త‌గ్గేంత వ‌ర‌కూ ఆర్థిక వ్య‌వ‌స్థ తెర‌వక‌పోతే ఇబ్బందులు వ‌స్తాయ‌న్నారు.

కొవిడ్‌-19 నేప‌థ్యంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించ‌డానికి అనుస‌రించాల్సిన అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ అమెరికాలో ఉన్న ర‌ఘురాం రాజ‌న్‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ముఖాముఖి నిర్వ‌హించారు. తెలివిగా ఆలోచించి భౌతిక దూరం పాటించే వీలున్న చోట్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను జాగ్ర‌త్త‌గా తెర‌వాల‌ని సూచించారు. మ‌ళ్లీ లాక్‌డౌన్‌కు వెళితే విధ్వంస‌క‌ర ప‌రిణామం అవుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లు కూడా ర‌ఘురాం రాజ‌న్ చెప్పిన అభిప్రాయాల‌తో పోలి ఉన్నాయి. క‌రోనా వైర‌స్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలించ‌లేమ‌ని మూడు రోజుల క్రితం జ‌గ‌న్ చెబితే ప్ర‌తిప‌క్షాల నేత‌లు, ఎల్లో మీడియా నానా యాగీ చేశాయి. ఇప్ప‌టికీ అదే రాద్ధాంతం కొన‌సాగిస్తున్నాయి.

ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి అభిప్రాయాల‌ను ప‌రిశీలిద్దాం.

నిర్బంధ‌మే ఎక్కువ ప్రాణాలను హ‌రిస్తుంది అనే శీర్షిక‌తో ఇన్ఫోసిన్ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ‌మూర్తి స్పష్టీక‌ర‌ణ అంటూ చ‌క్క‌టి క‌థ‌నాన్ని ప్ర‌జెంట్ చేశారు. ఈ క‌థ‌నంలో...కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోడానికి విధించిన లాక్‌డౌన్ మ‌రికొంత కాలం కొన‌సాగితే వైర‌స్‌తో క‌న్నా ఆక‌లితోనే దేశంలో ఎక్కువ మంది చ‌నిపోతార‌ని ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి హెచ్చ‌రించారు. క‌రోనాతో క‌లిసి సాగేందుకు సిద్ధ‌ప‌డాల‌ని ఆయ‌న కోరారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఉద్దేశించి నారాయ‌ణ‌మూర్తి ప్ర‌సంగించారు.

భార‌త్‌లో కరోనాతో చ‌నిపోయిన వాళ్ల సంఖ్య చాలా త‌క్కువ‌ని, అభివృద్ధి చెందిన దేశాల్లోని క‌రోనా మ‌ర‌ణాల రేటుతో పోల్చుకుంటే ఇక్క‌డ మ‌ర‌ణాల రేటు స్వ‌ల్ప‌మ‌న్నారు. వివిధ కార‌ణాల వ‌ల్ల భార‌త్‌లో ఏటా 90 ల‌క్ష‌ల మంది చ‌నిపోతుంటార‌ని, అందులో నాలుగో వంతు మంది కాలుష్యం కాటుకు బ‌ల‌వుతున్నార‌న్నారు. గ‌త రెండు నెల‌ల్లో క‌రోనాతో చోటు చేసుకున్న వెయ్యి మ‌ర‌ణాల‌ను వాటితో పోల్చితే ఈ మ‌హమ్మారి మ‌నం ఊహించినంత ఆందోళ‌న‌క‌ర‌మైన‌ది కాద‌ని అన్నారు.

ఇవే విష‌యాల‌ను జ‌గ‌న్ చెబితే...ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా క‌లిసి సీఎం అన‌రాని మాట‌లు ఏవో అన్న‌ట్టు దుష్ప్ర‌చారం చేస్తున్నాయి. క‌రోనాతో మ‌నం స‌హ‌జీవ‌నం చేయాల్సిందేన‌ని జ‌గ‌న్ అంటే, క‌రోనాతో క‌లిసి సాగేందుకు సిద్ధ‌ప‌డాల‌ని నారాయ‌ణ‌మూర్తి చెప్పారు. అలాగే రాజ‌కీయ నాయ‌కుడిగా, ముఖ్య‌మంత్రిగా బ‌హిరంగంగా వివ‌రాలు వెల్ల‌డించ‌డానికి వెనుకాడే విష‌యాల‌పైన కూడా నారాయ‌ణ‌మూర్తి క్లారిటీ ఇచ్చారు.

దేశంలో ఏటా 90 లక్ష‌ల మంది చ‌నిపోతుంటార‌ని, అందులో నాలుగో వంతు మంది కాలుష్యం కాటుకు బ‌లి అవుతున్నార‌ని నారాయ‌ణ మూర్తి చెప్పారు. అలాగే క‌రోనాతో చ‌నిపోయిన వెయ్యి మ‌ర‌ణాలు కూడా ఏమంతా ఆందోళ‌న‌కు గురి కావాల్సిన విష‌యం కాద‌ని మూర్తి అన్నారు. ఈ విష‌యాల‌పై రాజ‌కీయంగా ఇబ్బంది వ‌స్తుంద‌నే భ‌యంతో జ‌గ‌న్ లాంటి వాళ్లు మాట్లాడ‌లేరు. కానీ నిజాలు మాత్రం అవే.

జ‌గ‌న్ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా ఉన్న ఆ ఇద్ద‌రి అభిప్రాయాల‌కు సాక్షి మాత్రం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. ర‌ఘురాం రాజ‌న్‌తో పోల్చుకుంటే నారాయ‌ణ‌మూర్తి అభిప్రాయాన్ని...క‌రోనా ఉనికి అంగీక‌రించాలి అనే శీర్షిక‌తో లాక్‌డౌన్ కొన‌సాగించ‌డం స‌రికాదుః నారాయ‌ణ‌మూర్తి అంటూ మొద‌టి పేజీలో ఓ చిన్న ఇండికేష‌న్ ఇచ్చారు.  మూడో పేజీలో సింగిల్ కాలం వార్త‌ను ప్ర‌చురించారు. అలాగే ...ఆచితూచి పున‌రుద్ధ‌ర‌ణ అనే శీర్షిక‌తో రాహుల్‌తో ర‌ఘురామ‌రాజ‌న్ అంటూ మ‌రో సింగిల్ కాల‌మ్ వార్త‌తో అదే మూడో పేజీలో స‌రిపెట్టారు.

క‌నీసం వైఎస్ జ‌గ‌న్ చెప్పిన అంశాల‌ను బ‌ల‌ప‌రిచేలా ఉన్న వాళ్ల‌ద్ద‌రి అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్ల త‌ట‌స్థుల్లో సీఎం మాట‌ల‌పై న‌మ్మ‌కం క‌లిగించ‌వ‌చ్చు క‌దా? క‌రోనాపై జ‌గ‌న్ చెప్పే మిగిలిన విష‌యాల‌పై కూడా త‌ట‌స్థుల ఆలోచ‌న‌ల్లో మార్పు తీసుకురావ‌చ్చు క‌దా? మ‌రి సాక్షి ఆ దిశ‌గా ఎందుకు ఆలోచించ‌డం లేదు?

ఎంత‌సేపూ జ‌గ‌న్‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు...ఇవేనా సాక్షికి ప్రాధాన్య అంశాలు. మ‌రే వ‌ర్గాన్ని ప‌ట్టించుకోదా? ర‌ఘురాం రాజ‌న్‌, నారాయ‌ణ‌మూర్తిలకు స‌మాజంలో ఉన్న గుర్తింపు, గౌర‌వం ఎలాంటివో తెలిసి కూడా...మొక్కుబ‌డిగా ఇవ్వ‌డం వ‌ల్ల న‌ష్టం ఎవ‌రికి? ఈ వేళ నారాయ‌ణ‌మూర్తి, ర‌ఘురాం రాజ‌న్ చెప్పిన పాజిటివ్ విష‌యాల‌ను వైసీపీ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ...చూడండి జ‌గ‌నే కాదు...ఈ పెద్ద‌లు ఏం చెప్పారో అని ప్ర‌తిప‌క్షాల గూబ ప‌గ‌ల కొడుతున్నారు. ఆ ప‌ని సాక్షి ఎందుకు చేయ‌డం లేద‌నేదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

-సొదుం

జగన్ గారు చెప్పింది మూర్ఖులకు అర్ధం కావట్లేదు