కరోనా లాక్ డౌన్.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి..

ఏప్రిల్‌ 14తో ముగియాల్సిన దేశ వ్యాప్త లాక్‌ డౌన్‌పై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ముగియడం కాదు, కొనసాగడం తప్పదనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ‘ఈ దశలో లాక్‌ డౌన్‌ని ముగించేస్తే.. ఆ తర్వాత పరిస్థితులు చెయ్యిదాటిపోవడం ఖాయం’ అన్న అభిప్రాయాలే ఎక్కువగా విన్పిస్తున్నాయి. ‘నా వరకూ నేను లాక్‌డౌన్‌ కొనసాగింపుకే మద్దతిస్తాను..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాజాగా తేల్చి చెప్పేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మీడియా సాక్షిగా ‘లాక్‌డౌన్‌’ పొడిగింపుపై తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేశారు కేసీఆర్‌.

కేసీఆర్‌ ఒక్కరే కాదు, చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల ఆలోచనలు ఇలానే వున్నాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటేసేలా వుంది. అక్కడసలు హద్దూ అదుపూ లేకుండా కొత్త కేసులు నమోదవుతుండడం గమనార్హం. తమిళనాడులోనూ దాదాపు ఇదే పరిస్థితి వుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ‘అదుపులోకి వస్తుంది..’ అని తెలంగాణ ప్రజలకి కేసీఆర్‌ భరోసా ఇస్తున్నా, ఆ వైరస్‌ ఎంతమందికి అంటుకుంది.? అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

ఇక, లాక్‌ డౌన్‌ ముగిస్తే ఏంటి పరిస్థితి.? కొనసాగించాల్సి వస్తే ఏంటి పరిస్థితి.? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. జనాన్ని ఎక్కువ రోజులు ఇళ్ళకే పరిమితం చేస్తే, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించీ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతోంది. తెలంగాణ ఆదాయం రోజుకి 400 నుంచి 4430 కోట్లు అయితే, గత ఆరు రోజుల్లో రావాల్సిన సుమారు 2,600 కోట్లకుగాను ఆరు కోట్లే వచ్చాయని కేసీఆర్‌ చెబుతున్నారు. ఇదొక్కటి చాలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా చూపుతున్న ప్రభావం ఎంతో చెప్పడానికి.

ప్రభుత్వాల పరిస్థితే ఇలా వుంటే, సామాన్యుడి దుస్థితి ఏంటి.? రోజు కూలీలు, చిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరి పరిస్థితీ ముందు ముందు అగమ్యగోచరంగా తయారవబోతోంది. 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో, ప్రభుత్వమే పూర్తిగా ప్రజల్ని ఇంట్లో కూర్చోబెట్టి ‘తిండి’ పెట్టాలంటే సాధ్యమయ్యే పనే కాదు. కానీ, ‘సెల్ఫ్ క్వారంటైన్‌ - సెల్ఫ్ ఐసోలేషన్‌ - సోషల్‌ డిస్టెన్స్‌’ తప్ప ఇంకో మందు లేదు కరోనా వైరస్‌ని నియంత్రించడానికి. ముందు నుయ్యి, వెనక గొయ్యి.. అన్నట్టు తయారయ్యిందిప్పుడు పరిస్థితి. మరి, ఈ గండం నుంచి దేశమెలా గట్టెక్కుతుందో ఏమో.!