నెల్లూరు కలెక్టరేట్ లో కరోనా కలకలం

ఏపీనుంచి తబ్లిగీ జమాత్ కి వెళ్లొచ్చినవారిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు, ఉద్యోగుల బంధువులు కూడా ఉన్నారు. వారంతా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తమ తమ విధుల్లో చేరిపోయారు. కరోనా కల్లోలం చుట్టుముట్టాక, అందరి ట్రావెల్ హిస్టరీ కూపీ లాగుతున్నాక కూడా వీరిలో కొంతమంది బైటపడలేదు. ఏమీ ఎరగనట్టే ఉన్నారు. వ్యక్తిగతంగా ఎంక్వయిరీ మొదలుపెట్టే సరికి ఏకంగా నెల్లూరు కలెక్టరేట్ లోనే ఓ ఢిల్లీ రిటర్న్ ఉన్నట్టు తెలిసి అంతా షాకయ్యారు.

ఢిల్లీలో జరిగిన మత సభలకు హాజరై నెల్లూరు తిరిగొచ్చిన కలెక్టరేట్ ఉద్యోగి యథావిధిగా డ్యూటీలకు హాజరయ్యాడు. కరోనా కట్టడికి జరిగిన సమీక్షలలో అందరికీ టీ, కాఫీ అందించాడు. కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశాల్లోనూ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ ల లోనూ, మంత్రుల సమీక్షలలోనూ ఆ అటెండర్ అందరితో సన్నిహితంగా మెలిగాడు.

చైర్లు వేయడం దగ్గర్నుంచి, మంచినీళ్ల బాటిళ్లు అందించడం, చేతి రుమాళ్లు ఇవ్వడం సహా.. అన్ని పనులూ చేశాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు క్వారంటైన్ కి తరలించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు తమ వివరాలు ఇవ్వాలంటూ అధికారులు కోరినా కూడా ఇతను బైటపడకపోవడం ఇప్పుడు వివాదంగా మారింది. ఇటీవల అతనికి కరోనా లక్షణాలు కనపడ్డంతో.. సహోద్యోగులు భయపడి అసలు విషయం బైటపెట్టారు.

అలర్ట్ అయిన కలెక్టర్ వెంటనే అతడ్ని జిల్లా ప్రధానాసుపత్రిలోని క్వారంటైన్ కి తరలించారు. దీంతో ఇప్పటి వరకూ అతనితో సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి.. రివ్యూ మీటింగ్ లకు హాజరైన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఎవ్వరూ బైటకు చెప్పుకోలేని పరిస్థితి.

సైలెంట్ గా ఆ ఉద్యోగిని క్వారంటైన్ కి తరలించి అధికారులు ఏమీ ఎరుగనట్టే వ్యవహరిస్తున్నారు. కనీసం దీనిపై ప్రకటన కూడా చేయలేదు. తబ్లిగి జమాత్ కి వెళ్లొచ్చిన వారి వివరాలు తెలుసుకోవడంలో నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడీ పరిస్థితి ఎదురైంది. కలెక్టర్ కే కన్నుగప్పి.. ఇప్పటివరకూ ఏమీ ఎరగనట్టు విధులకు హాజరైన ఆ అటెండర్.. చివరకు కరోనా లక్షణాలతో క్వారంటైన్ సెంటర్ కి వెళ్లిపోయాడు. ఈ మధ్య కాలంలో అతను ఎంతమందికి వైరస్ అంటించాడనే విషయం తలచుకొని నెల్లూరు కలెక్టరేట్ అధికారులు వణికిపోతున్నారు.

గుర్తుంచుకోండి ఈ ఆదివారం రాత్రి 9 గంటలకి