సినిమా రివ్యూ: పలాస 1978

సమీక్ష: పలాస 1978
బ్యానర్: సుధాస్ మీడియా
తారాగణం:
రక్షిత్, తిరువీర్, నక్షత్ర, రఘు కుంచె, లక్ష్మణ్ తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: రఘు కుంచె
ఛాయాగ్రహణం: అరుళ్ విన్సెంట్
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
విడుదల తేదీ: మార్చ్ 06, 2020

సినిమా మొదలైన కొద్ది క్షణాలలోనే థియేటర్లలోంచి శ్రీకాకుళం జిల్లాలోని ‘పలాస’కి తీసుకెళ్తాడు దర్శకుడు. ఇటీవలి కాలంలో ఒక ప్రాంతపు యాస, అక్కడి మనుషుల వేషధారణ, జీవన శైలితో పాటు అక్కడి మట్టి వాసనని కూడా చూపించే పలు చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చాయి. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పలాస’ పంతొమ్మిది వందల ఎనభై, తొంభై దశకాల నాటి ఆ ఊరిని, అక్కడ నెలకొన్న సామాజిక అసమానతలని కళ్లకి కడుతుంది. ‘రంగస్థలం’లో ఇలాంటి ఒక కాల్పనిక ఊరిని చూపించి, ఇంచుమించు ఇలాంటి సమస్యనే వాణిజ్యాంశాలతో చూపించాడు సుకుమార్. ఈ చిత్ర దర్శకుడు కరుణ కుమార్ తాను చూసిన, తనకి తెలిసిన వాస్తవిక సంఘటనల ఆధారంగా సహజత్వం ఉట్టిపడే క్రైమ్ డ్రామాని తెర మీదకు తెచ్చాడు. 

తెలుగు సినిమా పరిశ్రమ సాధారణంగా వెండితెరని రంగుల్లో తడిపి ప్రేక్షకులకి ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించడానికే మొగ్గు చూపుతుంది. ఈ తరహా రస్టిక్ అండ్ రా రూరల్ డ్రామాలని ఇంత వాస్తవికరగా చూపించడం అరుదుగా జరుగుతుంది. ఉదాహరణకు నిజ జీవితంలో కోపమొస్తే బూతులే మాట్లాడతారు కానీ సినిమాల్లో మాత్రం పార్లమెంటరీ భాషనే వాడుతుంటారు. ఒకవేళ పొరపాటున రచయిత ఒక మాట జారినా సెన్సార్ బోర్డు కత్తెర వాడతారు. కానీ ఈ చిత్రం సహజత్వాన్ని ప్రతిబింబించేది కనుక పచ్చి బూతులు ఆడ, మగ నోట కూడా విచ్చలవిడిగా వినిపించారు. సామాజిక అసమానతల గురించి దర్శకుడు కరుణ కుమార్ ఎక్కడా సుగర్ కోట్ చేయలేదు. వేళ్లూనుకుపోయిన ఆ కుసంస్కృతిని డిప్లమసీ లేకుండా ఉన్నది ఉన్నట్టు చూపించాడు. 

దళితులు చిన్న తప్పు చేస్తే అది వారి జీవితాలని ఏ విధంగా మార్చేస్తుంది, అగ్ర వర్ణాలకి చెందిన వారు తమ అధికార దాహం కోసం వీరిని పావులుగా ఎలా వాడుకుంటారు అనేది కరుణ కుమార్ క్రమబద్ధంగా జరిగే సంఘటనలతో చూపించే విధానం ఆసక్తి రేకెత్తిస్తూనే ఆలోచింపచేస్తుంది. సినిమా టికెట్ ఇప్పించమన్న యువతిని నీచంగా మాట్లాడినందుకు ఆమె బంధువు సదరు ‘పెద్ద మనిషి’ని నిలదీస్తే దానికి బదులుగా కాలితో తన్ని తమ వర్ణానికి చెందిన అందరినీ దుర్భాషలాడతాడు. దానికి ప్రతిగా అతడిని కొడితే, దాని తర్వాత జరిగే సీక్వెన్స్‌లో హత్య కేసులో నిందితులయి, కాపాడిన ‘షావుకారు’కి కృతజ్ఞతగా అతడి తరఫున రౌడీలయి.. కళాకారులు కాస్తా కొద్ది రోజుల్లో ఖూనీకోరులుగా మారిపోవాల్సి వస్తుంది. ఎంత ఊడిగం చేసినా అధికారం ఇవ్వడానికి మాత్రం ‘షావుకారు’ దర్పం అడ్డొచ్చి... పదవి కావాలంటే తోబుట్టువుని చంపాల్సిన పరిస్థితి వస్తుంది. 

దర్శకుడు ఈ క్రమాన్ని చాలా పట్టుగా, కళ్లకు కట్టినట్టుగా చూపించి తన దర్శకత్వ ప్రతిభతో కట్టి పడేసాడు. అయితే ఈ క్రమంలో ఒకే ఒక వీక్ పాయింట్ మాత్రం... మోహనరావుగా నటించిన రక్షిత్ అనిపించాడు. మోహన్ రావు పేరు సాఫ్ట్‌గా వున్నా కానీ అతనికి బాహుబలి మాదిరి బిల్డప్ ఇచ్చారు. అయితే రక్షిత్ బాడీ లాంగ్వేజ్‌లో కానీ, అతని వాచకంలో కానీ అంతటి ఇంటెన్సిటీ, ఎమోషన్ కానరాలేదు. బహుశా అంతటి బిల్డప్ లేనట్టయితే ఈ పాత్రకి అతను చేసింది నరిపోయేదేమో కానీ ‘బైరాగి రాయి’ సన్నివేశంలో (బాహుబలిలో శివలింగం సీన్ అనుకోండి) అతను మరీ తేలిపోయాడు. అతని సోదరుడిగా నటించిన తిరువీర్ (జార్డ్ రెడ్డి ఫేమ్) మాత్రం భావోద్వేగాలని అద్భుతంగా పలికించాడు. సహ నటీనటులంతా తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. అయితే పెద్ద షావుకారుగా చేసిన పెద్దాయన (ఈయనకి రాసిన డైలాగ్స్ హైలైట్), ఎఐ సెబాస్టియన్ పాత్ర పోషించినతను తమ సహజమయిన నటనతో ఆకట్టుకుంటారు. చిన్న షావుకారుగా రఘు కుంచె మాత్రం సర్‌ప్రైజ్ పాే్యకజ్. టిపికల్ విలనిజం అవసరం లేని అవకాశవాద పాత్రని రఘు పోషించిన విధానం మెప్పిస్తుంది. 

నేపథ్య సంగీతంతోను రఘు కుంచె ఈ చిత్రాన్ని పలు సన్నివేశాల్లో ఎలివేట్ చేసాడు. కెమెరా వర్క్ ఇంటెన్స్ సీన్స్‌లో చాలా ఎఫెక్టివ్‌గా వుంది. ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్‌కి తోడ్పాటునందించిన నిర్మాతని ప్రశంసించాలి. కరుణ కుమార్ తన ప్రయత్నం మిగతా సినిమాల మధ్య ప్రత్యేకంగా నిలబడాలనే తపనతో చేసినట్టుగా కాకుండా దళిత గొంతుక వినిపించాలనే నిజమయిన ఎమోషన్‌తో చేసిన సినిమాలా వుంది. దర్శకుడిగా అతని ప్రతిభ కనిపించే సన్నివేశాలు కూడా చాలానే వున్నాయి. ఇదే సినిమాని కమర్షియల్‌గా చూపించే అవకాశం వున్నా కానీ కరుణ కుమార్ ఆ దారిలోకి అస్సలు వెళ్లలేదు. అయినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో హీరోయిజాన్ని ఏ కమర్షియల్ హీరో ఎలివేషన్‌కీ తీసిపోనట్టు చూపించారు. 

ప్రథమార్ధం ఎంత రసవత్తరంగా సాగుతుందో, ద్వితియార్ధం అంతటి సాగతీత సన్నివేశాలు, రిపీటెడ్ సీక్వెన్స్‌లతో అక్కడక్కడే తచ్చాడుతుంది. షావుకార్లు పదే పదే కుయుక్తులు పన్నడం, వాటి ఫలితాలు కూడా ఇంచుమించు అవే రిపీట్ అవుతుండడం, సెబాస్టియన్ పాత్ర తాలూకు అనవసరపు బిల్డప్ వ్యవహారం జోరుగా సాగుతోన్న ‘పలాస’ రోడ్డులో స్పీడ్ బ్రేకర్లలా అడ్డం పడతాయి. చాలా సన్నివేశాలు ముందుగానే ఊహించగలిగేలా వుండడం ఈ చిత్రానికి మరో బలహీనత అయింది. ముందు అంతా హింసని చూపించి చివర్లో అంబేద్కర్ ఫిలాసఫీని బోధించడం అందరికీ రుచించకపోవచ్చు. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న కథలోని ఆత్మ ఆ పతాక సన్నివేశాల్లోనే నిక్షిప్తమై వుంది. వినాయకుడి తల నరికితే అతికించిన దేవుడు... ఏకలవ్యుడి బొటనవేలు తెగినపుడు ఎందుకు అతికించలేదనే ప్రశ్న నలుదిశలా పిక్కటిల్లుతుంది. పురాణాల నుంచి నిన్న కాక మొన్న నల్గొండలో హత్యకి గురయిన ప్రణయ్ వరకు చరిత్ర ఏమీ మారలేదనే వాస్తవం కళ్ల ముందుకొచ్చి ఒళ్లు జలదరిస్తుంది!

రెగ్యులర్ సినిమాల మధ్య చాలా ప్రత్యేకతలతో స్పెషల్‌గా అనిపించే పలాస సగటు కమర్షియల్ సినిమా కాదు. దీనికి వుండే అప్పీల్ కూడా తక్కువే. అందుకే దీనిని అన్నిటి గాటన కట్టేసి రెగ్యులర్ రేటింగ్ ఇవ్వకుండా ‘నాట్ అప్లికబుల్’ కేటగిరీలో వేస్తున్నాం. వాస్తవికత నిండిన క్రైమ్ డ్రామాలని, రాగా వుండే తమిళ సినిమాల మాదిరి రియలిస్టిక్ చిత్రాలని చూడడం పట్ల ఆసక్తి వుంటే ‘పలాస’ తప్పకుండా దర్శించవచ్చు. ఇది మిగతా ప్రేక్షకులు సందర్శించే ప్రాంతం కాదు. 

బాటమ్ లైన్: సమాజానికో సూటి ప్రశ్న! 

గణేష్ రావూరి