జగన్‌ బాటలో పవన్‌: జనంలోకి జనసేనాధిపతి

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్టోబర్‌ నెలాఖరున పాదయాత్ర ప్రారంభించనున్న విషయం విదితమే. అక్టోబర్‌ 26 లేదా 27వ తేదీల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ ప్రకటించింది కూడా. మరోపక్క, జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ కూడా అక్టోబర్‌ తర్వాత జనంలోకి వెళ్ళనున్నాడు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్‌ 'ఏకాంత చర్చల' అనంతరం ఈ విషయం వెలుగు చూసింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్య గురించి హార్వార్డ్‌ యూనివర్సిటీ ప్రతినిథుల్ని వెంటేసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబుతో, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పవన్‌కళ్యాణ్‌ సమావేశమయిన విషయం విదితమే. ఈ సందర్భంగానే పవన్‌ - చంద్రబాబు మధ్య ఏకాంత భేటీ కూడా జరిగింది. అనంతరం పవన్‌కళ్యాణ్‌ మీడియా ముందుకొచ్చారు. 

ఉద్దానం కిడ్నీ సమస్య సహా పలు అంశాలపై ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పవన్‌, అక్టోబర్‌ నెలాఖరుకి ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తయిపోతుందనీ, ఆ తర్వాత జనంలోకి వెళ్తాననీ, జనంలోకి వెళ్ళి జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుంటాననీ పవన్‌కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. అంటే, వైఎస్‌ జగన్‌కి పోటీగా, చంద్రబాబు - పవన్‌కళ్యాణ్‌ని రంగంలోకి దించుతున్నారన్నమాట. 

ఈ మధ్యకాలంలో చాలా అంశాలపై మాట్లాడకపోవడానికి కారణం, జరిగిన ఘటనలు చాలా సున్నితమైనవనీ, ఏం మాట్లాడినా అది రాజకీయమే అవుతుందనీ, నోటికొచ్చింది మాట్లాడేసి రాజకీయంగా ఎదగాలనుకోవడంలేదనీ, కొన్ని సమస్యల విషయంలో బాధితుల దగ్గరకు వెళితే, అది కుల పోరాటాలుగా మారిపోతాయనే ఆందోళన తనలో వుందనీ పవన్‌కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. 

మొత్తమ్మీద, చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్‌కళ్యాణ్‌ పొలిటికల్‌ వ్యూహాలపై ఓ క్లారిటీ వచ్చిందన్నమాట. జగన్‌ పాదయాత్రపైకి చంద్రబాబు 'పవన్‌కళ్యాణ్‌ జనంలోకి' అనే అస్త్రాన్ని ప్రయోగించబోతుండడం విశేషమే మరి.