ఫ్యాన్స్ కుమ్ములాటలు.. పవన్ కు తలనొప్పులు

సినిమాలు చేసుకునే టైమ్ లో కేవలం ఫ్యాన్స్ ను చూసుకుంటే చాలు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం ఫ్యాన్స్ ను చూసుకుంటే సరిపోదు. అన్నివర్గాల వారినీ కలుపుకొని పోవాలి, అవసరమైతే పక్క పార్టీల నేతల్ని కూడా తమలో కలుపుకుపోవాలి. సరిగ్గా ఇక్కడే స్థానికంగా ఫ్యాన్స్ కు, పవన్ కు మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతున్నాయి.

ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ జనసేనలోకి క్రమంగా వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి కావొచ్చు, టీడీపీ నుంచి కావొచ్చు.. ఆ పార్టీల్లో టిక్కెట్లు రావని నిర్థారించుకున్న నేతలంతా మెల్లగా దుకాణం సర్దేస్తున్నారు. జనసేన జెండాను ఎత్తుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వారితో స్థానికంగా ఉన్న పవన్ అభిమానులకు కొన్ని చికాకులు ఉన్నాయి. దీంతో వీళ్ల రాకను స్థానిక అభిమానులు వ్యతిరేకిస్తున్నారు.

అయితే జనసేన అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ కు ఇవి గిల్లికజ్జాల కింద లెక్క. అందుకే ఫ్యాన్స్ అభిప్రాయాల్ని, తెరవెనక ఆందోళనల్ని పవన్ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో పవన్ ది కూడా తప్పు ఉంది. పార్టీ పెట్టిన కొత్తలో కేవలం ఫ్యాన్స్ అంటూ తిరిగాడు పవన్. జనసేన ప్రారంభం నుంచే ఇతర పార్టీల నేతలు తమ గూటిలోకి వస్తారంటూ అభిమానుల్ని మానసికంగా సన్నద్ధం చేసుంటే బాగుండేది.

ఏదేతైనేం తెరవెనక జనసైనికుల కుమ్ములాటలు మాత్రం ఎక్కువయ్యాయి. అభిమానులు ఇగోలు పక్కనపెట్టాలని, పార్టీ కోసం పనిచేయాలని పవన్ పదేపదే చెబుతున్నప్పటికీ ఈ కుమ్ములాటలు ఏరోజుకారోజు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఈ పరిణామాల్ని దగ్గరుండి గమనిస్తున్న కొంతమంది జనసేన నేతలు.. ఎన్నికల ముందు పవన్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయి, రచ్చకెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ చెబుతుండడం విశేషం.

అదేకనుక జరిగితే ఇంకా క్షేత్రస్థాయి నిర్మాణ దశలోనే ఉన్న జనసేన పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే జనసేన ఆవిర్భావమే అభిమానుల పునాదులపై జరిగింది. ఇప్పుడదే అభిమానం రెండుగా చీలితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. సరిగ్గా సినిమాల విషయంలో కూడా గతంలో ఇలానే జరిగింది.

మెగాభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ వేరు. ఒకప్పుడు మెగాభిమానులంటే కాంపౌండ్ హీరోలందరికీ కామన్ గా ఫ్యాన్స్. కానీ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంటే కేవలం పవన్ కు మాత్రమే ఫ్యాన్స్. కొద్దోగొప్పో రామ్ చరణ్ కు వీళ్లు అండదండలు అందిస్తారేమో కానీ బన్నీని పూర్తిగా తమ లిస్ట్ నుంచి తీసేశారు. మిగతా హీరోల సంగతి సరేసరి. సరిగ్గా ఇలాంటి చీలికే జనసేన పార్టీలో కూడా వస్తే అది చాలా నష్టం తెచ్చిపెడుతుంది.

రానురాను పార్టీలో పరిస్థితి ఫ్యాన్స్ వెర్సస్ పవన్ అన్నట్టు తయారైంది. ఇప్పటికే అభిమానుల ఇష్టానికి వ్యతిరేకంగా కొంతమంది నాయకుల్ని చేర్చుకునేందుకు పవన్ పావులు కదుపుతున్నారు. రాబోయే రోజుల్లో మరింతమంది కీలకమైన నేతలు వచ్చి చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇలాంటి టైమ్ లో పవన్ తన అభిమానులపై కాస్త గట్టిగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంటిపోరుతో పార్టీ పరువుపోయే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments