ప్ర‌జాశాస‌న‌మే అంతిమ తీర్పు

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే అత్యంత శ‌క్తిమంతులు. చిన్న‌కోర్టులు మొద‌లుకుని సుప్రీంకోర్టు వ‌ర‌కు ఉన్న‌ప్ప‌టికీ...ప్ర‌జాతీర్పున‌కు మించిన‌ది మ‌రొక‌టి లేద‌ని ప్ర‌పంచానికి భార‌త‌దేశం...అందులోనూ మ‌న తెలుగు రాష్ర్ట‌మైన తెలంగాణ చాటి చెప్ప‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం. ప‌దిరోజుల క్రితం మాన‌వ‌త్వానికి మ‌చ్చ తెచ్చేలా, మ‌నిషి అనే ప‌దానికి విలువ‌లేకుండా చేసిన న‌లుగురు మృగాళ్ల‌కు మ‌ర‌ణ శిక్ష విధిస్తూ ప్ర‌జాశాస‌నాన్ని అమ‌లు చేసిన తీపి వార్త  తెల్లారేస‌రికి ప్ర‌తి గ‌డ‌ప‌కూ చేరింది. శుక్ర‌వారం సూర్యోద‌య స‌మ‌యానికి కామాంధుల న‌లుగురి జీవితాలు తెల్లారాయ‌నే విష‌యం ఒక్క బాధితురాలి కుటుంబానికి మాత్ర‌మే న్యాయం చేసిన‌ట్టు కాదు...ఈ స‌మాజానికి కూడా అనే స‌త్యాన్ని గ్ర‌హించాలి.

గ‌త నెల ప‌శువైద్యురాలిపై న‌లుగురు కామాంధులు హైద‌రాబాద్ శివార్ల‌లో అత్యాచారానికి పాల్ప‌డ‌డంతో పాటు స‌జీవ ద‌హ‌నం చేశార‌నే వార్త దావానలంలా వ్యాపించింది. ఈ దుర్ఘ‌ట‌న ఒక్క తెలుగు స‌మాజాన్ని మాత్ర‌మే కాకుండా యావ‌త్ భార‌తావ‌నిని దుఃఖ‌సాగ‌రంలో ముంచెత్తింది. హృద‌య‌మున్న ప్ర‌తి ఒక్క‌రినీ ఈ దుర్ఘ‌ట‌న క‌దిలించింది. ఆ న‌లుగురు రాక్ష‌సుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌ల‌పై దండెత్తింది.

ఈ దుర్ఘ‌ట‌న‌కు దేశంలో చ‌లించ‌ని మ‌నిషి, మ‌న‌సు ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు. న‌లుగురూ నిందితుల‌ను షాద్‌న‌గ‌ర్‌లో విచారిస్తున్నార‌ని స‌మాచారం తెలుసుకున్న ప్ర‌జానీకం వంద‌లు, వేలాదిగా స్వ‌చ్ఛందంగా పోలీస్‌స్టేష‌న్‌పై దాడికి వెళ్లారు. "ఆ మృగాళ్ల‌ను మాకు అప్ప‌గించండి. మ‌ర‌ణ‌దండ‌న మేం విధిస్తాం" అని వేలాది మంది ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు.  కుల‌మ‌తాలు, వ‌ర్గాల‌కు అతీతంగా , చిన్నాపెద్దా, ఆడ‌మ‌గా అనే తేడా లేకుండా షాద్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌ను చుట్టుముట్ట‌డం ఇప్ప‌టికీ క‌ళ్ల ముందు క‌ద‌లాడుతోంది.

"పాపా భ‌య‌మేస్తోంది" అని త‌న చెల్లితో బాధితురాలు ప‌లికిన చివ‌రి మాట‌లు మంట‌లై హృద‌యాల‌ను ద‌హించ‌వేశాయి. ప్ర‌తి ఒక్క‌రినీ క‌న్నీటిని పెట్టించింది.  న‌వ్వుతూ క‌నిపించే అమాయ‌క అమ్మాయి దిశ...ఆ కామాంధుల చేతుల్లో ఎంత విల‌విల‌లాడి ఉంటుందోన‌నే ఆవేద‌న , ఆక్రోశం వెర‌సి వారికి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌నే డిమాండ్ ఊరూరా  నిర‌స‌న గ‌ళ‌మై మార్మోగింది. ప్ర‌తి ఒక్క‌రూ ఆమె త‌మ ఇంటి బిడ్డే అన్నంత‌గా త‌ల్ల‌డిల్లారు.

చివ‌రికి ప్ర‌జాతీర్పే అమ‌లైంది. దిశ ప్రాణాలు తీసిన చోటే...ఆ న‌లుగురు రాక్ష‌సులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులును  తెల్లారుజామున 3.30 గంట‌ల‌కు పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు.  సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు స‌మాచారం.

కార‌ణాలేవైనా గ‌త నెల 27న రాక్ష‌స‌త్వానికి పాల్ప‌డిన దుర్మార్గుల‌కు కేవ‌లం ప‌దిరోజుల్లో మ‌ర‌ణ శిక్ష ప‌డ‌డం సంతోషాన్నిచ్చే విష‌యం. న్యాయం ఎక్క‌డో ఉండ‌దు. అది ఎవ‌రో వేసే భిక్ష కూడా కాదు. మ‌నం ఐక్యంగా పోరాడి శాసించాలి, సాధించాలి. దిశ నిందితుల‌కు కేవ‌లం ప‌ది రోజుల్లో మ‌ర‌ణ శిక్ష ప‌డ‌డం...భార‌తీయుల ఐక్య‌త‌ను, పోరాట స్ఫూర్తిని తెలియ‌జేస్తుంద‌న‌డంలో సందేహం లేదు

Show comments